నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ పొర్లుతున్నాడు రంగయ్య. పాత నులకమంచం. పిస్సులు ఒదులైనాయి. దొర్లినపడంతా కిర్రుకిర్రుమంటుంది.‘‘ఏంది...ఒకేమైన పొర్లుతుండవ్‌? నిద్రపో. మళ్లపొద్దన్నె లేయాలె కదా!’’ అంటూ ఉంది పక్కన వేరొక మంచం మీద మూడేండ్ల బిడ్డతో పడుకున్న భార్య, మొగుడి మీద మిక్కిలి కనికరంతో.పగలంత పొలం పనిచేసి రెక్కలు ముక్కలు చేసుకుని వస్తాడు. రాత్రయినా బాగా నిద్రపోకుంటే ఒళ్లు అలిసిపోతుందని ఆమె బాధ.రంగయ్య మధ్యమధ్యలో తల కొంచెం పైకెత్తి పిట్టగోడవైపు ఆతృతగా చూస్తున్నాడు. ప్లాస్టిక్‌ కవర్‌లోచుట్టి పూలదండ పెట్టాడక్కడ. కవర్‌లో ఏముందోనని పిల్లి చించి దండ పాడు చేస్తుందేమోనని భయం. తాకితే పూలరేకులు రాలిపోతాయని చాలా గోప్యంగా పెట్టాడు. సాకుడు పిల్లి ఎక్కడో మూలన నక్కి పడుకుంది.రెండంకణాల పూరిల్లు అతనిది. ఒక అంకణం మధ్యలో పిట్టగోడ. అటువైపు పొయ్యీ పొంతా. అక్కడే వాళ్ల వంటావార్పు. బైటి వాకిలికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండు మంచాలు వేసుకున్నారు. పిట్టగోడ మీద కిరసనాయిలు బుడ్డి. కరెంటు పోయినపడు వెలిగించుకోడానికి. పైన నిట్టాడుకు ఒకే ఒక కరెంటు బల్బు వేలాడుతూంది. వాకిలికి ముందు చిన్న వసారా. అక్కడే ఎద్దుల్ని కట్టేస్తాడు రంగయ్య.‘‘మ్యావ్‌..మ్యావ్‌’ అంటూ ఒళ్లు విదిలించుకుంటూ పిట్ట గోడ వద్దకు వచ్చింది పిల్లి. బహుశా బైట షికారుకు పోయే టైమయ్యిందేమో!ఒక్క ఉదుటున ఉలిక్కిపడి లేచాడు రంగయ్య. తటాలున మూలనున్న ముల్లుకర్ర తీసుకున్నాడు. మంచంపట్టెకేసి దబాదబ కొట్టాడు. ‘ఛెయ్‌..పోవే!’ అంటూ గుడ్లురిమి బెదిరించాడు దాన్ని. 

ప్రేమగా ‘రా!రా!’ అని ముద్దు చేస్తూ ముద్ద వేసే రంగయ్య కట్టెత్తుకొని కసురుకుంటూ ఉంటే పిల్లికేమి పాలుపోలేదు. దీనంగా రంగయ్యవైపు చూస్తూ ‘మ్యావ్‌!మ్యావ్‌!’ అంది, ‘నేనేం తప చేశాను’ అని అడుగుతున్నట్లు. కాని రంగయ్య ఇదేమీ ఒంటపట్టిచ్చుకోలేదు. ఈరోజు రాత్రి అది ఇంట్లో ఉండడం సుతరామూ అతనికి ఇష్టం లేదు. నిర్దయగా కట్టెతో కొట్టబోయాడు. పిల్లి భయపడి వాకిలి దబ్బల్లో నుంచి దూరి బైటికి పరుగెత్తింది. రంగయ్య వాకిలి దబ్బలు దగిర్గికి జరిపి హమ్మయ్య అనుకొని వచ్చి నిశ్చింతగా పడుకున్నాడు.కళ్లు మూసుకున్నాడే గాని బొత్తిగా నిద్ర పట్టడం లేదు. ఎపడెపడు తెల్లవారుతుందా అని ఒకే తొందర. ‘ఏందీ.. పాడు రాత్రి ముందుకు జరగనే జరగదు..’ అపడపడు విసుక్కుంటున్నాడు.భార్య గురకలు పెడుతూ గాఢ నిద్రలో మునిగిపోయింది.ఆవూళ్లో రంగయ్య మేనమామ ఉన్నాడు. పక్క వీధిలోనే వాళ్ల ఇల్లు. తన భార్య తర్వాత ఇద్దరూ ఆడబిడ్డలే. ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు రంగయ్య. అతని సొంతవూరు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరం.