ఒంటిగంట! గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడానికి హడావుడిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరాను. రైలు బయలుదేరడానికి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే వుంది. విజయవాడకు టికెట్‌ తీసుకొని నాలుగవ నెంబర్‌ ప్లాట్‌ఫారమ్‌ చేరేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ స్థితిలో అక్కడ కనిపించిన పరిస్థితి చూసి నాకు మతిపోయినట్లు అనిపించింది. జన సముద్రం.... అన్ని ప్లాట్‌ఫారాల మీద వున్న జనం ఈ ప్లాట్‌ఫారమ్‌కి వచ్చినట్లు, అన్ని ఊర్లకు కలిపి ఇదొక రైలే వేసినట్లు అనిపించింది.కుంభమేళా లాంటిదేదో జరుగుతున్నట్లు జనం ఎడాపెడా తోసుకుంటూ తిరుగుతున్నారు. వేసవి శలవులు, పెళ్లిళ్లు కారణం కావచ్చు. అడవిలో చెట్లు, తీగలు నరుక్కుంటూ వెళుతున్న టార్జాన్‌లాగా జనాన్ని పక్కకి నెట్టుకుంటూ తోసుకుంటూ జనారణ్యంలో తప్పిపోయిన పిల్లవాడి కోసం వెతుకుతున్నట్లు ఎసి చెయిర్‌ కార్‌ కోసం చూస్తున్నాను. ఎక్కడో చివర ఉన్నట్లుంది. ప్రయాసతో చేరాను. అప్పటికే అక్కడ టిసి చుట్టూ ఒక పాతిక మంది టికెట్‌లు చేతిలో పట్టుకొని ప్లీజ్‌... ప్లీజ్‌... అంటున్నారు. పరిస్థితి అర్థం అయింది. ప్రయత్నించడం వృథా.రైలు బయలుదేరింది. చేసేది లేక అతి కష్టం మీద ప్రక్కనే వున్న జనరల్‌ బోగీలో ఎక్కాను.

 బోగీలో కాలు పెట్టడం వరకే నా పని. జనమే నన్ను తోసుకుంటూ లోపలకు చేర్చారు. కాలు చెయ్యి కదల్చడానికి లేదు. నాకే కాదు నా ఎయిర్‌ బ్యాగ్‌కి కూడా చోటు లేదు. వెనుక నుండి ముందు నుండి కూడా తోస్తున్నారు. ఈ ప్రయాణం అయ్యే సరికి నేను బ్రతికుంటానా అన్న సందేహం కూడా కలిగింది. రైలు ఊపందుకుంది. కొద్ది సేపటికి జనం కాస్త సర్దుకోవడం వల్ల ఊపిరి ఆడడం మొదలు పెట్టింది. పర్వాలేదు. నాకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని అనిపిం చింది. మానాన్న గుర్తుకు వచ్చాడు. గొంతు మీద పెట్టాడు ప్రయాణం. సాయంత్రం ఏడు ఎనిమిది గంటల మధ్య పెళ్లి చూపులట. రెండు రోజుల ముందే వెళ్లి విజయవాడ మూర్తి అంకుల్‌ ఇంట్లో తిష్ట వేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆఫీసులో పర్మిషన్‌ తీసుకోవడం కష్టం అయింది. రిజర్వేషన్‌కు సమయం లేదు. ఇంతకన్నా మార్గం లేదు. కానీ ఇపడు ఇలా అయింది. ఈ ప్రయాణం ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. నెట్టుకుంటూ వెళ్లి ఒకచోట ఆనుకొని నిల్చున్నాను. అదే ప్రస్తుతానికి ఒక లగ్జరీ. పక్కన అందరూ ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. చివర కూర్చున పెద్దావిడకు పక్కన కొద్దిగా చోటు వుంది.