రాత్రి పదకొండుగంటలు దాటి ఉంటుంది. వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. విద్యుద్దీపాలకాంతి చీకటిని పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసి ఓడిపోయి నందువల్లేమో మసకచీకటిగానే ఉంది. గంట క్రితమే వర్షంపడి వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. మెల్లగా సైకిల్‌ తొక్కుతూ ఆలోచనలో పడ్డాను. ఓ స్నేహితుడి పెళ్ళికి వెళ్ళి వస్తున్నాను. ముహూర్తం తొమ్మిదీ నలభైకి ఉండటంవల్ల భోజనాలుచేసి బయల్దేరేటప్పటికి ఈ సమయమైంది. అతను బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. నేనే నిరుద్యోగిలా మిగిలిపోయాను.నాకూ పెళ్ళీడు వచ్చింది. రూపాయి సంపాదనలేని నాకు పిల్లని ఎవరిస్తారు? చదువుకునే రోజుల్లో ఎంత అశ్రద్ధ చేశానో. ఇప్పుడు పశ్చాత్తాపపడటంవల్ల చదువు రాదుగా. నాన్న మున్సిపాలిటీలో పారిశుద్ధ్యకార్మికుడిగా పని చేసేవాడు.

నలభైనాలుగేళ్ళకే అనారోగ్యంతో అకాల మరణంపాలైతే ఆ ఉద్యోగం అన్నకిచ్చారు. అన్నకు పెళ్ళయింది. ఓ పాప కూడా.అన్న మంచివాడే. నాకు ఏదో ఒకపని ఇప్పించటం కోసం మున్సిపాలిటీలో చాలామంది కాళ్ళు పట్టుకున్నాడు. కాని ఫలితం దొరకలేదు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రోడ్లు ఊడ్చే పని దొరికినా చాలు. సంతోషంగా చేసుకుంటా. వాళ్ళ పెద్దసార్‌ ఇంట్లో పనులేమైనా ఉంటే తనే అన్నీ తన నెత్తిమీద వేసుకుని చేస్తుంటాడు. ఎప్పటికైనా కరుణించి నాకో చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడని ఆశ.కుక్కల అరుపులు వినిపించి ఆలోచనల్లోంచి బైటపడ్డాను. రోడ్డుకి ఎడంవైపు చెత్తకుండీదగ్గర మూడు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. నాకు కుక్కలంటే చాలా భయం. 

అనాలోచితంగానే సైకిల్‌ ఆపి ఓ కాలు నేలకి ఆనించి ఆ కుక్కలవైపు చూశాను. చెత్తకుండీ బైట ఎంగిలి విస్తరాకులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కుక్కలు మూడూ ఒక దానిమీద ఒకటి భీకరంగా అరుచుకుంటున్నాయి. నేను ఇంటికెళ్ళాలంటే ఆ చెత్తకుండీ దాటుకునే వెళ్ళాలి. మరో దారిలేదు. కానీ కుక్కలు మీదపడి కరుస్తాయేమోనని భయం.కొద్దిసేపు వేచిచూస్తే కుక్కలు వెళ్ళిపోతాయన్న ఆశతో కదలకుండా అక్కడే నిలబడ్డాను. నాకు పదేళ్ళ వయసున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి భయంతో ఒళ్ళు జలదరించింది. ఆ రోజు అమ్మ జ్వరంతో పడుకుంది.

అన్న స్కూలుకి వెళ్ళాడు. అమ్మకోసమని మందుబిళ్ళలు తీసుకుని, తినడానికి బన్నురొట్టె కొనుక్కుని ఇంటివైపు నడుస్తున్నాను. నా వెనక అలికిడైంది. తలతిప్పి చూశాను. ఓ కుక్క చొంగ కార్చుకుంటూ నా వెనకే వస్తోంది. దాన్ని అదిలించాను. ఆగిపోయింది. మళ్ళా నేను కదలగానే నా వెంట రాసాగింది. నాకు భయమేసి పరుగెత్తాను. అదీ పరుగెత్తింది. ఒక్క గెంతుగెంతి నా చేతి లోని బన్నురొట్టె లాక్కునే ప్రయత్నం చేసింది. నేను కిందపడిపోయాను. అది తన కోరలు కన్పించేలా నోరంతా తెరిచి భీకరంగా మొరిగింది. నా మీదపడి భుజం కొరికింది. నొప్పితో అరచి బన్నురొట్టె వదిలేశాను. దాన్నినోట కరుచుకుని నావైపు ఉరిమిచూసింది. ఈ లోపల మనుషులు రావడం గమనించి అక్కడినుంచి పారిపోయింది. భుజం నిండా గాయం. రక్తం కారిపోతోంది.