‘‘స్వాతి ఇంట్లోంచి వెళ్ళిపోయిందిరా’’ అవధాని ఫోను ఎత్తగానే రామశర్మ కంగారుగా అన్న మాటలివి.‘‘ఎక్కడకెళ్తుంది? ఏ ప్రక్కింటికో వెళ్ళుంటుంది. అనవసరంగా కంగారు పడకు’’ అవధాని షాక్‌ అయినా తమ్ముడికి ధైర్యం చెప్పాలని అలా అన్నాడు.‘‘లేదురా అన్నయ్యా! చిన్న చీటిపెట్టి వెళ్ళిపోయింది’’ తమ్ముడి ఆందోళన స్పష్టంగా ఫోన్‌లో తెలుస్తోంది.‘‘ఎంత సేపయ్యింది కనకపడక?’’‘‘నీ మరదలు, నేను నర్సింగ్‌ హోంలో ఉన్నాం. మధ్యాహ్నం భోజనాన్కి ఇంటికొచ్చేటప్పట్కి టీ పాయ్‌ మీద చీటి ఉంది.‘‘ఏమని వ్రాసింది’’.‘‘రెండే ముక్కలు. ‘అమ్మా’ నన్ను క్షమించు. నాకీ పెళ్ళి ఇష్టం లేదు’’.అవధాని ఒక్కక్షణం మౌనంగా ఉన్నాడు. అక్కడి పరిస్థితులు ఊహించుకోడాన్కి కాస్త టైం తీసుకున్నాడు.‘‘కూడా ఏం పట్టుకెళ్ళింది? బట్టలు, క్యాష్‌ వగైరా....’’‘‘సెల్‌, సర్టిఫికేట్స్‌ తప్ప మరేం పట్టుకెళ్ళలేదురా..’’‘‘సరే! నువ్వేం కంగారుపడకు. అదేం అఘాయిత్యం చేసుకోదు. ఏ ఫ్రెండ్‌ ఇంటికో వెళ్ళుంటుంది. నేను, మీ వదిన ప్రొద్దున్నే బయల్దేరివస్తాం’’ అవధాని ఫోన్‌ పెట్టేశాడు. తమ్ముడికి ధైర్యం చెప్పాడేగానీ, అవధాని మనస్సంతా పాడయ్యింది.‘స్వాతి ఎందుకిలా చేసింది? ఎంతో పొందికగా, బుద్ధిగా చదువుల సరస్వతి అని పేరు తెచ్చుకున్న స్వాతి, నిండా ఇరవైఏళ్ళయినా లేని స్వాతి ఎందుకిలా చేసింది? నల్గురికి తెలిస్తే పరువేం కావాలి? మూడు నెలలక్రితం తన తండ్రి పోవడం మంచిదయ్యింది. బ్రతికుంటే ఈ విషయం తెలిసి మరింత కుమిలిపోయేవాడో!ఫోన్‌ రింగ్‌వడంతో అవధాని ఆలోచన్లు ఆపి ఫోన్‌ ఆన్‌ చేసాడు. అవతల నుంచి మరదలు లత.‘‘బావగారూ! నేను లతను. రేపు పెళ్ళివారు తాంబూలాలు తీస్కోడాన్కి బయల్దేరి వస్తారు కదా! సంబంధం కేన్సిల్‌ అయ్యింది.

 రావొద్దు అని చెప్పండి’’ అంది.‘‘అప్పుడే కంగారుపడి కేన్సిల్‌ చెయ్యొద్దు. ఏ గుడిమెట్లు మీదయినా ఏడుస్తూ కూర్చుందేమో. చూడండి. అంతగా అయితే పెళ్ళివార్కి రేపు చెబుదాం’’ అన్నాడు అవధాని.‘‘వద్దు బావగారూ, పెళ్ళి సంబంధం కేన్సిల్‌ అని చెప్పేయండి. మిగతా విషయాలు మీరొచ్చాక మాట్లాద్దాం. ఉంటా’’ లత ఫోన్‌ పెట్టేసింది.అప్పుడే వంటింట్లోంచి ఏమిటో చెంగుతో మొహం తుడుచుకుంటూ మండువా లోగిల్లోకి వచ్చింది సావిత్రి. భర్త కంగారుగా ఫోన్‌లో మాట్లాడం, తల పట్టుకు కూర్చోడం చూసింది.‘‘ఏమండీ? ఏమయ్యింది?’’ అంది కంగారుగా.‘‘స్వాతి ఈ సంబంధం ఇష్టం లేదని ఇల్లువదలి వెళ్ళి పోయిందట’’ అవధాని నెమ్మదిగా చెప్పాడు.‘‘శివ... శివ... ఇదేం పోయేకాలమండి? నిక్షేపం లాంటి పిల్ల. ఎప్పుడూ నోరుదాటి మాటైనా వచ్చేదికాదు. గడపదాటి ఎలా వెళ్ళి పోయిందండీ?’’ బుగ్గలు నొక్కుకుంటూ దీర్ఘాలు తీసింది సావిత్రి.‘‘దాని ఖర్మ. దాని మొహాన్న అలా రాసుంది’’.‘‘మీ తమ్ముడి రక్తంలోనే ఉందండి ఆ యిది. ఆ పెద్దమనిషి అప్పుడు అలాగే చేసాడు. ఇప్పుడు కూతురు అదే బాట పట్టింది’’ సావిత్రి బొత్తిగా సత్తెకాలపు మనిషి.