అవి నేను రెండో తరగతి చదువుతున్న రోజులు. మా బడి పేరు ఎమ్మెమ్‌ఎల్‌డబ్ల్యుఓ ఎలిమెంట్రీ స్కూల్‌. మా బడి పేరు చెప్తుంటేనే నాకు ఒకింత గర్వంగా వుంటుంది. ఎందుకంటే ఇంగ్లీషంతా మా బడి పేర్లోనే వుంటుందని నా కన్పిస్తది. రెండో తరగతి పూర్తయ్యింది. ఎండాకాలం సెలవులొచ్చేసినయ్‌. అపడు నా పెండు బోసోడు ఓ మాట చెప్పిండు. ‘ఒరేయ్‌. ఈసారి ఏమైనా మనం మూడో తరగతికి ఇస్కూలు బ్యాగు కొనుక్కోనెళ్ళాల్రా’ అని.ఒక్కసారి మున్సబు కొడుకు రాజుగాడి బ్యాగు నా కళ్ళముందు కదిలింది. నాక్కూడా అట్టాంటి బ్యాగే కావాలని ఎప్పట్నించో ఉంది. ఏడో తరగతి చదివే మాయన్నకే బ్యాగు లేదు, ఇహ నాకేం కొనిస్తాడు మా నాయన. ఈసారి ఏమైనా సరే మూడో తరగతికి కొత్త బ్యాగుతో రాజుగాడికి పోటీగా పోవాలనుకొన్నా. అనుకొన్నదే తడవు ఇంటికొచ్చి మా యమ్మతో చెప్పినా. ‘యమ్మా, యమ్మా, నేను రెండో తరగతి ప్యాసై మూడో తరగతికెళ్తుండా కదా. ఈసారి నాకు ఇస్కూలు బ్యాగు కావాలేయని’ అపడు మాయమ్మ చెప్పింది - ‘ఇట్టాంటి ఎదవాలోచన్లు పెట్టుకోమాక. మీ నాయన కొనియ్యడు’ అని. 

నేనూర్కుంటానా, మాయమ్మ ఎంటబడి యాడవడం మొదలెట్టినా. నా నస పళ్ళాకో ఏమో ‘ఒరేయ్‌ మీ నాయనొచ్చినాక అడగతా లేరా’ అనింది.ఆ సాయంతరంగా మా నాయనొచ్చినాడు. సానం చేసి, అన్నం తిని బయట నవ్వారు మంచమేస్కొని పండుకొన్నాడు. ఆ పక్కనే నులక మంచంమీద ఉన్న మా యమ్మ దగ్గరకెళ్ళి ‘యమ్మా, యమ్మో అడగవే’ అన్నా. అహ, అపడు మా యమ్మ ఎంత అందంగా అడిగిందంటే ఎట్టాటోడికైనా సరే కాదని చెప్పాలనిపించేంత అందంగా. ‘ఏమయ్యో, ఈడికి ఇస్కూలు బ్యాగు గావాలంట’ అని చెప్పింది.

అపడు మా నాయన అన్నాడు - ‘బ్యాగా, ఈ నా కొడుక్కి పలకే ఎక్కువ. ఇహనుంచి రోజూ పొద్దుగాలే పేడెత్తి. సాయంతరం సుదుగులు ఏర్కొని రమ్మన్జెప’ అని. నా యాశలు అడియాశలైనియ్‌. బ్యాగు లేదు కదా రెండు పన్లు మీద పడినాయి. ‘ఒరేయ్‌, బోసోడా, నిన్ను తన్నాల్రా’ అనుకొన్నా. ఆ మరుసటి రోజు ఉదయాన్నే బోసోడింటికి పోయినా. రాతిరి జరిగింది చెప్పినా. అపడు వాడు ఒక మగత్తరమైన అయిడియా జెప్పిండు. అదేంటంటే ‘‘ఒరేయ్‌ యాపకాయలు ఏరదాము, బస్తాకి అర్ధ రూపాయి లెక్కన రైతులు కొంటారు. ఈ సెలవల్లో పది బస్తాలు ఏరామనుకో, మనకు బ్యాగొచ్చేసిద్దిరా’’ అని. ఇంకంతే ఎనక్కి తిరిగి చూడలేదు. యాడాడ యాపచెట్లున్నాయో చూసేదానికి ముం దుగా ఒక రౌండేసొచ్చినం. మా యింటి ముందే రెండు పెద్ద యాపచెట్లున్నాయి. అక్కడి నుంచే మొదలెట్టాలనుకొన్నాం.