వాన సద్దుమనిగింది.కొండాకోన, చెట్టూపుట్టా వానలో తడిసి చలికి గడగడా వణకతా ఎపడెపడు పొద్దు మొలిస్తిందాని ఎగమల్లుకోని వుండాయి.రాత్రంతా మేల్కోని వున్నందువల్ల దీపాల ముఖాలు నిద్దరలేక వాడిపొయినాయి. అయినా కతలు చెపకుంటా వుషారుగానే వున్నాయి.‘‘మాపటేల రెండు పదునుల వాన కురిసింది. పొద్దుగూకింది. చీకటిని ఆకాశం కాటుక దిద్దుకునింది. చుక్కలు పూసినాయి. మల్లా మబ్బులొచ్చి వాలినాయి. వాన నీటి కురులు విదిలించి గలగలా ఆడింది. పలపలా పాట పాడింది. కొంచేపట్లో కోడి కూస్తుంది. ఆపైన పొద్దు మొలిస్తుంది. నిపలు చిమ్ముతా ఎండ కాస్తుంది. ఈ కాలచెక్రాన్ని ఇట్లా ఎవరు తిపతున్నట్టు? ఏమాకత?’’ అని అడిగింది రాశింటి దీపం.‘‘కాలచెక్రాన్ని తిప్పేది కుమ్మరోడు. చావు పుట్టుకలు కావడి కుండలు. బంకమన్నుని మెత్తగా తొక్కి ముద్దచేసి, కాలచెక్రాన్ని గిరగిరా తిప్పతా ఒక్కొక్క కుండకీ ఊపిరి పోస్తాడు’’ అని చెప్పింది కుమ్మరింటి దీపం.‘‘కాలచెక్రాన్ని కుమ్మరోడు తిప్పడమేంటి? ఇచ్చిత్తరంగా!’’ అనింది రాశింటి దీపం.‘‘నీకు ఆ ఇచ్చిత్తరమేంటో తెలియాలంటే కుమ్మరి చెక్రం కత చెప్తాను. వింటావా?’’ అని అడిగింది కుమ్మరింటి దీపం.‘‘కత చెప్తానంటే ఎందుకు వినను? కత చెప్తే మనసు పరిమళించాలి’’ అనింది రాశింటి దీపం.

ఉత్తీత సంజీవిని పుల్లతో గుడ్డుని పగలగొట్టి కుమ్మరోడ్ని పుట్టించింది.వాడు పుడతానే ఉత్తీత కాళ్ళకి మొక్కి,‘‘నన్ను ఎందుకు పుట్టించినావు? నేను ఏం పని చెయ్యాలి?’’ అని అడిగినాడు.‘‘నీకంటె ముందు రైతు పుట్టినాడు. ఆ రైతు కూడు వొండుకునే దానికి కుండలు కావల్ల. నీళ్ళు తెచ్చుకునేదానికి, తెచ్చిన నీళ్ళు పోసిపెట్టుకునేదానికి కడవ, నీళ్ళ తొట్టి కావల్ల. వొడ్లు పోసి పెట్టుకునేదానికి కాగులు కావల్ల. పెరుగు చిలికేదానికి దుత్త కావల్ల. వీటన్నింటినీ చెక్రంమింద నువ్వు అరువుచేసి ఇస్తే రైతు పండించిన పంటలో నీకు ఒక భాగం పంచుతాడు. ఇట్లా నువ్వు, నీ పెళ్ళాం వొళ్ళొంచి కష్టం చేసుకుని సుఖంగా బతుక్కోండి’’ అని చెప్పింది ఉత్తీత.‘‘సరే... నువ్వు చెప్పినట్టే కుండలు చేసి బతుక్కుంటాను. కుండలు చెయ్యాలంటే కుమ్మరి చెక్రం కావల్లగదా! ఎట్లా?’’ అన్నేడు కుమ్మరోడు.