‘‘ఇదేంటండీ బాబో! పిచ్చికుక్క వుంది జాగ్రత్త అని రాశారు. కుక్కెక్కడుందో’’ లోపలికెపడొచ్చాడో తెలియకుండా అడిగాడు కుక్కుటేశ్వరం.‘‘వెరైటీగా భయపెడదామని... ఎవరో పిచ్చోడు కుక్కని ఎత్తుకెళ్లాడండీ’’ చెప్పాడు మృగశిరం.‘‘మరాబోర్డలాగే వుంచారేం’’‘‘మీలాంటి వాళ్ల కోసం’’‘‘నేనేం చేసుకుంటానండీ’’‘‘చెక్కభజన’’‘‘సర్లెండి, ఇది సొంతిల్లా’’‘‘కాదండీ వేరే వాళ్ల సొంతిల్లు’’‘‘మీ అగ్గిపుల్ల విరుపు మాటలు నాకెందుకు లెండి’’ అంటూ చెపలో కాలుపెట్టాడు కుక్కుటం. వచ్చిన పని అయినట్లుగా.‘‘ఏవండోయ్‌, అవి నా చెపలు నిన్ననే కొన్నాను’’ అన్నాడు మృగశిరం.‘‘నావీ ఇలాంటివేనే. ఇక్కడే విడిచానే’’ ఆశ్చర్యం నటించాడు కుక్కుటం.‘‘మీరు చెపలే వేసుకు రాలేదు.’’ కిటికీలోంచి చూస్తూ అన్నాడు మృగశిరం కొడుకు నాదానందం.‘‘చూసినట్లే చెపుతున్నావే’’ అన్నాడు కుక్కుటం తడబాటుని కనపడనీయకుండా.‘‘అసలు నేను చూసింది. మీ పాత చెపలు చెత్త కుండీలో వేస్తూ మీరు రావడం’’ చెప్పాడు నాదానందం.‘‘మతిమరుపండీ, ఛస్తున్నాను’’ అంటూ వెళ్లబోయాడు కుక్కుటం.‘‘ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పకుండానే వెళుతున్నారేం’’ అన్నాడు మృగశిరం.‘‘చెపలకోసమే’’ అన్నాడు నాదానందం.‘‘కాదు బాబో చెపలపకోసం’’‘‘అదేం అప’’‘‘ఏ వ్యాపారం కలిసొచ్చేట్లు లేదు. చెపల కొట్టు పెట్టి చూద్దామనుకుంటున్నాను. మీరు కాస్త అప్పిస్తారేమోనని’’ దీనంగా అన్నాడు కుక్కుటం.‘‘చెపల కోసం అప్పెందుకు చెప్పండి. చెపలు లేకుండా వెళుతూ చెపలతో తిరిగొస్తూ రోజుకో జత అమ్ముకున్నా మీకొచ్చేది మీకొస్తుందిగా. చేతికి దొరికింది నొక్కటం. నోటికి దొరికింది మెక్కడమేగా మీరు చేసే పని కుక్కుటం గారూ’’ అన్నాడు నాదానందం.‘‘ఏంట్రా అంకుల్ని నిలదీస్తున్నావు?’’‘‘నువ్వే చూడు నాన్నా! ఈయనగారి జేబులో మన రిస్టువాచ్‌లు రెండు, మన టీవి రిమోట్‌, నెయిల్‌కట్టర్‌, ఆ జేబులో ఆస్ర్టేలియా నుంచి తెచ్చిన యాష్‌ ట్రే, అవి నేను చూసినవి. చూడనివి ఇంకేం వున్నాయో చూడాలి’’ చెప్పాడు నాదానందం.‘‘అదేవిటండీ పిల్లవాడేదో అంటున్నాడు’’ అడిగాడు మృగశిరం.

‘‘ఆఁ! పిల్లకేకలు లెండి. నేనేమనుకోను. వెళ్లొస్తా’’ వెళ్లబోయాడు కుక్కుటం.కుక్క భౌ అంది!‘‘అమ్మో, పిచ్చోడు కుక్కని వదిలిపెట్టుంటాడు’’ అని కేకపెట్టి గడప కొట్టుకొని కిందపడ్డాడు కుక్కుటం. ఆ హడావిడిలో జేబుల్లో వస్తువులు బయటికొచ్చాయి.‘‘అరే! ఇవన్నీ మావేనే!’’ అన్నాడు మృగశిరం.‘‘మీవైతే మీవే అనుకోండి. కానీ కుక్కలేదని అబద్ధం ఎందుకు చెప్పారో చెప్పండి’’ ఆయాసపడుతూ అన్నాడు కుక్కుటం.‘‘నిజంగానే లేదండీ’’ చెప్పాడు మృగశిరం.‘‘మరి ఆ ‘భౌ’?’’‘‘మావాడి మిమిక్రీ లెండి’’‘‘పేరుకే మీ నాన్న మృగశిరం. జంతునాదాలు మాత్రం నువ్వు చేస్తున్నావు’’‘‘మా నాన్నగారి పేరునేం అనకండి. మా తాతగారు నరసింహస్వామి భక్తుడు. కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు.’’‘‘మరి నీ పేరేంటి తండ్రీ’’ విషయాన్ని పక్కదారి పట్టించానన్న ఆనందంతో అన్నాడు కుక్కుటం.‘‘మహిష మేష శునక వారాహ గార్దభ మార్జాల హస్తి భల్లూక నాదానందం’’‘‘ముద్దుపేరు లేదా కన్నా’’‘‘నేరెళ్ల వేణు మాధవ మిమిక్రీ శ్రీనివాస్‌’’