తండ్రి, పెద్దకొడుకు కలసి వాళ్ళయింటి ప్రక్కనే చిన్నగుడిసెను వేస్తున్నారు. నడిపికొడుకు రంగడు దీర్ఘాలోచనల్లో మునిగిపోయి పాత గుడిసె ముందు కూర్చున్నాడు. అప్పుడే ఊళ్ళోనుండి వొస్తున్న భార్య కనిపించగానే పాలిపోయిన రంగని ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు తొణికింది. ‘‘మా అందట్లో లచ్చే నయం. అది చేసినంత పని మేమెవ్వరం సెయ్యలేం. అందానికి అందం ఉంది, తెలివికి తెలివి ఉంది.’’ కొంచం దూరాన తల్లి పొరుగింటావిడతో మాట్లాడుతుంటే విని మరీ సంతోష పడ్డాడు రంగడు. ఇందరు ఇన్నిమాటలు అంటున్నా, అందరు అన్ని పనులు చేసి పెడుతున్నా రంగని కెందుకో ఏమో బాధగానే ఉంది. ఉండదు మరీ! యిరువై ఏండ్లు ఆ యింట్లో పెరిగినాడు. వాళ్ళతో కలిసి తిరిగినాడు. ఈ రోజు వేరై పోతున్నాడు.బిచ్చగాళ్ళల్లో ఈ ఆచారం ఉంది. కోడలు కాపరానికి రాగానే కొడుకు వేరే ఇంట్లో ఉండి వాళ్ల సంపాదనమీద వాళ్లే బ్రతకాలి. అందుకే వాళ్ళల్లో పిల్లలను చిన్ననాటి నుండే వెంట తీసుకపోయి బిచ్చమెత్తడం నేర్పుతారు. పిల్లవాళ్లనే పంపి బిచ్చమెత్తక రమ్మంటారుకూడా!రంగడు కొత్తకాపరం పెట్టినాడు. లచ్చికి కాపురాన్ని గుట్టుగా నడిపించాలన్న సంగతి బాగా తెల్సు. వాళ్ళకు ఆస్తి అంటూ ఏమీలేదు. ఒక ఊరంటూ ఉంటేగా భూమి బుట్రా, యిల్లూ గిల్లూ ఉండేది. ఎక్కడ పొట్టబోసుకోవడానికి అనువుగా వుంటే అక్కడికే వెళ్లిపోతారు. రంగని పాలుకు వచ్చినవి రెండు పాతకుండలు. ఒక కమ్మకోత కత్తి, రెండు అంబలిపోసుకునే బుర్రలు, రెండు బిచ్చమెత్తుకునే కమ్మజోలెలు.

 ఈ ఆస్తితోనే రంగడు కాపురాన్ని మొదలు పెట్టినాడు. వాడు ప్రొద్దంతా ఒక్క బిచ్చమెత్తడానికే పోడు. ప్రొద్దున్నేలేచి ఈదులవైపు వెళ్ళి కమ్మగోసి తెస్తాడు. భోజనపు సమయానికి వాడి పూర్తి కూడును అడుక్కొచ్చు కుంటాడు. సాయంకాలానికి ఎండ్రికాయలో, చేపలో పట్టడానికి వెళ్లుతాడు. వాటిని ఊళ్లో అమ్ముతాడుకూడా! అప్పుడప్పుడు మందుచెట్లను త్రవ్వుకొచ్చి నాలుగు పైసలు సంపాదించి తాళ్ళల్లకు వెళ్లి కల్లు త్రాగి వొస్తాడు. పెండ్లానికి కూడా బుద్ధి పుట్టినప్పుడు ఓ బుంగడంత కల్లు తీసుకొస్తాడు. లచ్చికూడా ఒక నిమిషం వృథా చేయకుండా పని చేస్తుంది. మొగడు తెచ్చిన కమ్మతో చాపలు అల్లుతుంది. రోజుకు ఒకటి రెండు అల్లినవి అల్లినట్లు అమ్మివేస్తుంది. వేళకు వెళ్ళి తనకూ, తనమగనికీ సరిపోయేంత గంజిని, గడుకను అడుక్కొస్తుంది. వాళ్ళిద్దరికీ సరిపోగా మిగిలిన గంజిని, గడుకను అత్తకుగానీ, మరెవ్వరికిగానీ లేకపోతే కుక్కలకు గానీ వేస్తుంది.వాళ్ళ కాపురం చిలకా గోరెంకల్లా సాగిపోతుంది. లచ్చి బాగా పనిచేసి డబ్బును కూడబెట్టాలంటుంది. రంగడు ఎప్పుడయినా దుబారా ఖర్చుపెడితే కోప్పడుతుంది. అతడు ఆమెకు భయపడకున్నా తన సంపాదనతో వొచ్చిన పైసలనన్నింటినీ భార్య వద్దే ఉంచుతాడు. ఆ గూడెంలో రంగని సంసారాన్ని చూచి అందరూ సంతోషపడుతారు.