నేను చచ్చిపోయాను. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా. నిజమే. మీరలా అనుకోవడంలో తప్పేం లేదు. కానీ నేను మామూలుగా చచ్చిపోలేదు. నా చావు పేపర్లకెక్కింది. అంతటిదో ఆగిందా.. లేదు. నా చావు మీద పెద్ద గొడవే నడుస్తోంది. మూడు వారాలుగా నా చావు మీద ఎన్నో రకాలుగా ప్రచారం.. ఏవేవో వార్తలు..నాది లాకప్‌డెత్‌ అనీ, పోలీసులే చంపేశారనీ నా పెళ్లాం, నా బావమరిదితో పాటు కొంతమంది రాజకీయ పార్టీలోళ్లూ, ప్రజా సంఘాలోళ్లూ గొడవలు చేస్తుంటే పోలీసులేం చెబ్తున్నారనుకుంటున్నారు?నేను విషం తాగి ఆత్యహత్య చేసుకున్నానంట. అంతేకదా.. తమ కస్టడీలో ఉన్నోళ్లు ఎవరైనా చస్తే ఇట్లాంటి ఏదో కథల్లి చెప్పాలి కదా మరి.నా చావువల్ల నాకింత పేరు వొస్తుందని కల్లోకూడా అనుకోలేదు. నేను చచ్చాకే ఈ గోపాలకృష్ణ అనేవోడు వొకడుండాడని లోకానికి తెలిసింది. లేదంటే అప్పడాలు చేసుకు బతికే నేనేంది, పేపర్లకెక్కడమేంది? అంతేనా.. నన్ను పోలీసులే చంపేశారని రాజకీయ పార్టీలోళ్లూ, ప్రజా సంఘాలోళ్లూ ధర్నాలు చేస్తున్నారు. ఒకరోజైతే యాపారులంతా తమ దుకాణాల్ని మూసేశారు. నన్ను చంపిన పోలీసుల్ని అరెస్టుచేసి శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు.నేనెట్లా చచ్చిపొయ్యానో తేల్చడానికి అదేంది.. ఆ.. మెజిస్టీరియల్‌ విచారణంట.. అది చేయబోతున్నారు. విచారణ చేస్తున్నదెవరు? ఒక ఆర్డీవో. దీనికి నా చావు మీద గొడవ చేస్తున్న ప్రజా సంఘాలోళ్లూ, రాజకీయ పార్టీలోళ్లూ వొప్పుకోడంలా. రిటైర్డు హైకోర్టు జడ్జితో జుడిసియల్‌ విచారణ జరిపించాలనీ, కేసుని సీబీసీఐడీతో దర్యాప్తు చేయించాలనీ ఆళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆళ్ల డిమాండుని పట్టిచ్చుకునే వోళ్లెవరు? ఇంతకీ ఆర్డీవో చేస్తున్న మెజిస్టీరియల్‌ విచారణలో నా గురించీ, నా చావు గురించీ ఎవరేం చెబుతున్నారో వినాలని మీతో పాటు నాకూ ఆత్రంగానే ఉంది. పదండి విందాం..నాగరాణి.. అంటే నా పెళ్లాం ఏం చెప్పిందంటే..‘‘బుధవారం పొద్దున పదిగంటల టైములో మా ఆయన ప్రసాద్‌ సినిమా హాలు కాడ ఉన్న ఆయన స్నేహితుని ఇంటికెళ్లి వొస్తానని చెప్పి బయటికెళ్లాడు. ఆ స్నేహితుడు ఇంటికాడ లేడని ఆళ్లావిడ చెప్పింది. దాంతో మా ఆయన గుమ్మంలోంచి తిరిగొస్తున్నాడు. అప్పుడే ఆళ్లింట్లో బీరువా తలుపులు తెరిచి వుంటం చూసినావిడ ‘దొంగ.. దొంగ’ అనరిచింది. దాంతో చుట్టుపక్కలోళ్లంతా ఆడికొచ్చారు. ఏం జరిగిందో తెలీక కంగారుపడ్తున్న మా ఆయన్ని పట్టుకున్నారు. ఆమిచ్చిన కంప్లెయింటుతో ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు మా ఆయన్ని కొట్టుకుంటా మా ఇంటికాడకి తీసకొచ్చారు. చుట్టూ వున్నోళ్లు చూస్తుండగాల్నే ఆయన్ని కొడతా జేబులెతికారు. ఆయన చేతికున్న రెండుంగరాలు, వాచీ, కొన్ని రూపాయలు లాక్కున్నారు. ఆ తర్వాత ఆ పోలీసులు మా ఇంట్లోకొచ్చి మా పిల్లలకని మేం చేయించిన చిన్న చిన్న ఉంగరాలు, మెళ్లో గొలుసు లాక్కున్నారు. మళ్లీ మా ఆయన్ని లాఠీ కర్రలతో కొట్టుకుంటా పోలీస్‌ స్టేషన్కి తీస్కపొయ్యారు. నేనాళ్ల కాళ్లా వేళ్లా పడ్డా. మా ఆయన అట్టాంటోడు కాదనీ, ఆయన్కి ఏ పాపం తెలీదనీ బతిమలాడా. ఆ పోలీసోళ్ల గుండెలు కరగలా. అట్టాగే ఆయన్ని తీస్కపొయ్యారు. మద్యాన్నం మళ్లా వొచ్చి మా ఇల్లంతా చిందరవందర చేస్తా యెతికారు. ఏమీ దొరకలా. ఆఖర్కి మా ఆయన్ని పొట్టన బెట్టుకున్నారు..’’