అరవై ఏండ్ల చంద్రమ్మ చూడడానికి డెబ్భై ఏండ్ల కొడవలిలా కనిపిస్తు వుంది. ముసురుకు తడిసి ఎండిన పత్తి పూవులాంటి తల, జీవకళ లేని చూపు తగ్గిన గవ్వ కళ్లు, ఎముకలకు అంటుకుపోయి ముడుతలు పడ్డ చర్మం. వెలిసిన అదోమాదిరి నలుపు రంగు. ఏదో పని చేస్తేనే కాని పూట గడవని పరిస్థితి. సర్కారు వారి సహాయం ఆమెకు అందనే అందలేదు. మాలవాడలో నివసిస్తున్న మట్టి మనిషి ఆమె.అది వరి కోతల కాలం. కొడవళ్లు పట్టుకొని జనం బావుల వైపు నడుస్తున్నారు. వాళ్లల్లో చంద్రమ్మ ఒకటి. పొద్దు బారెడెక్కింది. అందరు బావి దగ్గర నిలుచున్నారు.గుత్తకు యివ్వమని కూలీలు-లేదు కూలీకే పని చెయ్యమని రామిరెడ్డి కొడుకు శీన్‌రెడ్డి పనగలి దగ్గర నిలుచోని పనిచేయగలిగిన వాళ్లను పొలం లోకి పంపిస్తు వుంది శీన్‌రెడ్డి భార్య సుశీల.మొదట రెండు మళ్లు కొయ్యంగానే మైదను పక్కకు పెట్టిస్తే రాలిన రాగి ఆకులను పనికిరాని గడ్డి పోచలను ఏరేస్తే కళ్లం చెయ్యొచ్చు అని భార్యతో చెప్పి కూలీల వైపు నడిచాడు.మందిలో ఆకర్న వచ్చిన చంద్రమ్మను ఆపి -‘‘నీకేం చేతనైతదే. రెక్కాడిచ్చి కోయలేవు. కొట్టలేవు’’ అంది.అదేం దొరసాని ఈయాలేం కొత్తంగా కోస్తున్నానా? కలుపు, కోత, కల్లం - అన్నీ సేసి ముసల్దాన్ని అయినా’’ వేలితో కొడవలి పదును తాకి చూస్తూ అంది.‘‘చేసినన్ని రోజులు చేసినవు చేతగాకుంట అయినంక యింకా చేస్తవా’’‘‘మరి పూట ఎట్లా ఎల్‌తది. 

నీ కాల్మొక్తా’’.‘‘నీవు కొయ్యలేవు. జరసేపు అట్ల కూర్చో’’ అంటు తడిక వేసుకుని వరి మళ్ల వైపు నడిచింది. సుశీలకు పాతికేండ్లు వయస్సు లక్షణమైతే నేమి ఉన్న యింట్ల పుట్టిన ప్రభావం అయితేనేమి సుశీలలో ఓ మాదిరి నిర్లక్ష్య వైఖరి, ఆమె మాటల్లోను నడకలోను కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంది’’.పనికొద్దనగానే చంద్రమ్మ మనస్సు చిన్నబోయింది. గుండెలో కదిలిన నిరాశను బరువైన శ్వాస ద్వారా వొదులుతూ, మౌనంగ వెళ్లి పక్కనే ఉన్న రావి చెట్టు మొదలును అనుకుని కూర్చుంది.చంద్రమ్మ కొడవలితో భూమి మీద కాట్లు పెడుతూ ‘‘భూదేవి నీకింత సాకిరి సేస్తే ఏం మిగిలింది?బావితోడితే ఏమొచ్చు-పొలం అచ్చుకడితే ఏమొచ్చు-సేనుకాస్తే ఏమొచ్చె-పంట ఎవరి గరిస జేరే-పాడి ఎవరి యిల్లు జేరె-ఐదేండ్ల పిల్లప్పుడు ఈ వూరికి కోడలై వచ్చిన నాటినుండి నేటి వరకు ఈ వూరి అన్ని బావుల దగ్గర నాటేసి, కోసి, కొట్టి పుట్లకు పుట్లు పోగుసేస్తే ఏ పూటకు ఆ పూటే నాయె - ఏం బతుకులు ఈ ఆకలి బతుకులు. సేసుక బతికే వయసులనే సస్తే బాగుండు. అనుకుంటు బావి వైపు చూసింది. ఒకప్పటి రోజులు గుర్తొచ్చి గతంలోకి వెళ్లింది.