గడియారాల ముళ్ళన్నీ ఇంచుమించు ఒంటిగంట దగ్గర కల్సుకుంటున్నప్పుడు....అవతల ఎండ దంచేస్తోంది! చక్రపాణి పనిచేస్తోన్న ఆఫీసులోపల వేడి దంచేస్తోంది.చక్రపాణి కడుపులో ఆకలి అరగంట సేపైంది - దంచేస్తోంది!లంచ్‌! టైమైంది ఆఫీసులకుఇండ్ల దగ్గర్నుంచి చిన్నసైజు కారియర్‌ గిన్నెలూ, పొట్లాలూ, రంగు రంగుల ఫ్లాస్కులూ - తెచ్చుకున్నవాళ్ళు ఆవురావురంటూ అవి విప్పుకుని అర్జంటుగా తినేస్తున్నారు. మధ్య మధ్య అవతల ఎండ మండిపోతున్న సంగతి తమకు తెలుసునున్నట్లు ఉస్సురుస్సురంటున్నారు.ఈ దృశ్యాన్ని చూస్తూ ఇరవై సంవత్సరాల సర్వీసు నలభై నాలుగేళ్ళ వయసు వున్న చక్రపాణి - రెండు మూడు నిమిషాలకన్నా ఎక్కువసేపు తన సీట్లో కూర్చోలేక పోయాడు.‘‘లాభం లేదు. ఏదో యింతలోపల పడేసుకురావా’’లనుకుంటూ లేచాడు.ఆఫీసు వేడిలో నుంచి బయటి ఎండలోకి నడిచాడు చక్రపాణి.రోడ్డు కవతలివేపు ఎడంగా వుంది కాఫీకేఫే. ప్రక్కనే వుంది నాగయ్య అండ్‌ సన్‌ కిల్లీల దుకాణం.ఎండలోపడి గబగబా అంగలువేసి అవతలివేపు పుట్‌పాత్‌ మీదకు గెంతాడు చక్రపాణి.కాఫీ దుకాణం అధునాతనమైనది. అద్దాల తలుపులున్నది. దాని గుమ్మంలో వేడి వేడి పదార్ధాల బోర్డున్నది.‘‘నాగయ్య అండ్‌ సన్‌ కిల్లీకొట్టు లోపల తొట్టిలోపల వేణ్ణీళ్ళల్లో వున్న ‘కూల్‌ డ్రింక్‌’లను వేడిగా వున్నాయంటూ అయిష్టంగానే తాగుతున్నారు. 

అవి త్రాగడానికి జేబుల్లో చాలినంత ‘తడి’ ఉన్నవాళ్ళు.అలా ఎండ మండిపోతోంది!అలాగే చక్రపాణి కడుపులో మండిపోతోంది!ఇడ్లీ పావలా...వేడి వేడి పదార్థాల బోర్డు మీద - నల్లని బోర్డుమీద తెల్లని అక్షరాలు - ఇడ్డన్‌లలాంటి అక్షరాలు - తార్రోడ్డ మీద ఎండలాగ మెరిసిపోతున్నాయి.(కారప్పొడి కూడా వేయడు. సాంబార్‌కు అదనంగా పది పైసలిమ్మంటాడు అని దుఃఖ పడ్డాడు చక్రపాణి)కాఫీ కూడా పావలా!సాదా దోశె పావలా!సింగిల్‌ గారె పదిహేను పైసలు.మిగతావి మరి మనకక్కర్లేదు అనుకున్నాడు చక్రపాణి.నాగయ్య చెమటలు కక్కుతూ పని చేస్తున్నాడు. సంతర్పణకు విస్తళ్ళు పరిచేసినట్లు తమలపాకులు పరిచేసి, కిల్లీలు కట్టేటందుకు - వాటిమీద రంగురంగుల సీసాలు చిలకరిస్తున్నాడు.చౌదరిగారూ సిగరెట్లు - నాగయ్యగారూ పాన్‌, నాగయ్యగారు పాన్‌ - అంటూ కేకలు - తాపీగా వింటున్నాడు - జ్రాగత్తగా డబ్బులు లెక్కపెట్టి అందుకున్నాడు నాగయ్య.‘‘మిఠాయికిల్లీ పది పైసలు!’’‘‘సిగరెట్లుకు మరో పదిహేను పైసలు!’’చక్రపాణి తొడుక్కున్న టెరిలీన్‌ అమెరికన్‌ షర్టుకు రెండు జేబులున్నాయి. వైట్‌ డ్రిల్‌ ప్యాంట్‌కి మూడు జేబులున్నాయి.టెర్లీన్‌ షర్ట్‌ కాలర్‌ చెమటకు తడిసి, త్వరగా చివికి శిధిలమైపోకుండా తన చేతిరుమాలును తన మెడకీ, చొక్కామెడకీ మధ్య పెట్టుకున్నాడు చక్రపాణి.అది తడిసి ముద్దయిపోయింది.మొత్తం జేబుల్లోని చిల్లరంతా తడిమి చూసుకుని లెక్కపెట్టి - కూడి - మొత్తం యాభైయి మూడు పైసలని తేల్చుకున్నాడు చక్రపాణి.మళ్ళీ కూడాడు. ఏభై మూడే వున్నాయి.