‘‘ఈయన వ్యవహారం ఎవరికీ కొరుకుడు పడ్డం లేదండీ! ఏ క్షణం చూసినా సరే లలితా నామ జపమే!’’ చిరాగ్గా అన్నాడు హిందీ పండితుడు సత్యనాగ్‌.‘‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు వచ్చిందగ్గర్నుంచీ ఆ పిల్ల ఊసేనా! పైగా లలితలాంటి అమ్మాయే లేదని ఒకటే ఆకాశానికేత్తేస్తున్నారు.’’ రుసరుసలాడాడు లెక్కల టీచర్‌ శివానంద్‌.‘‘పెద్దరికం ముసుగండీ బాబూ! ఆపండి బాగోదు..’’పక్కాయన్ని గోకాడు సైన్సు మాస్టారు వెంకటేశం.ఎనిమిదో తరగతి గదిలోంచి బయటకు వచ్చాడు సోషల్‌ మాస్టారు బాలభాస్కరం. ఆయన వెనకాలే లలిత జలపాతంలా తుళ్ళుతూ గలగల నవ్వుతూ వస్తోంది.సరిగ్గా అప్పుడే బెల్‌ అయింది. ఆటలకొదిలారు. బాల భాస్కరం తన వెంట ఆరుగురమ్మాయిలను వెంట పెట్టుకొని ప్లే గ్రౌండులోకి దారితీసాడు. స్కిప్పింగు రోప్సిచ్చాడు. చివరవరకూ నిలిచి ఆడుతున్నది లలిత.బొద్దుగా బొండుమల్లెలాగ ఉన్న లలిత పరువాలు యూనిఫాంలో కొట్టొచ్చినట్లు కదులుతున్నాయి.‘‘చూసావయ్యా! వాడి చూపులు! లలిత చేత కావాలనే ఆడించి లొట్టలేస్తున్నాడు’’. అన్నాడు వెంకటేశం.చివరికి అలసిసొలసి ఆగిపోయి రొప్పుతూ బాలభాస్కరం భుజంమీద వాలిపోయింది లలిత.‘‘అయినా అలా పట్టుకొని హత్తుకోడానికి సిగ్గులేదా!’’ కళ్ళెర్రజేస్తూ అన్నాడు శివానంద్‌.‘‘దక్కినవాడికి దక్కినంత మహదేవా అని.. అదృష్టం అంటే ఈయనగారిదే!’’ నెత్తిన చేయేసుకున్నాడు సత్యతాగ్‌.్‌్‌్‌కొత్తగా అప్‌గ్రేడ్‌ అయిన ఆ స్కూల్లో ప్రమోషన్‌ వచ్చిన బాలభాస్కరం గురించి.. 

ముఖ్యంగా లలితతో కలుపుగోలుతనంపై గుసగుసలు మొదలైనాయి.లలిత బాలభాస్కరం అభిమానపాత్రురాలవటానికి ప్రధాన కారణం ఆమె తెలివితేటలు, చురుకుతనంతో అన్నింటిలో ప్రథమ స్థానంలో ఉండేది. అమాయకమైన, స్వచ్ఛమైన ముఖకవళికలు ఆయన్ని కట్టిపడేసేవి.. కారణమేదైనా సరే ఆయనపై తావులేని ఊహాగానాలు! ఆస్కారాన్నిచ్చే కుశంకలు.పీరియడ్‌ కీ పీరియడ్‌ కీ మధ్యన.. ఇంటర్వెల్‌లో లంచ్‌లో వీలైనప్పుడల్లా ఇదే చర్చ!... జల్లేందుకు ఇష్టమొచ్చినంత బురద!‘‘అతగాడలా టీనేజ్‌ కుర్రాడిలాగ విజృంభిస్తూంటే నోరువాయిలేనివాళ్ళలా అలా గుడ్లు మిటకరిస్తున్నారేమిటయ్యా!’’ అని వడివడిగా వచ్చి నాలుగు చీవాట్లేసారు. మహేశ్వరా చార్యులు.‘‘మీ ముక్కుకేమైనా మసాలా వాసన తగిలిందా సార్‌?’’ శివానంద్‌ అడిగాడు కంగారుగా.‘‘మసాలావాసనేం ఖర్మ! మల్లెలగుబాళింపే! బొబ్బిలిలో ఏకపాత్రాభినయ పోటీలున్నా యిట! దానికి లలితచేత ‘రుద్రమ దేవి’ వేయిస్తున్నాడు. ఇక ఒకటే తయారీ! నిన్న సాయంత్రమేమోవచ్చీ ఆ పిల్లతో రిహార్సల్సు పేరుతో చీకటి పడేదాకా ఇక్కడే ఉండిపోయాట్ట! అదీ మన నైన్తు కుర్రాడు.. అదే సుబ్బుగాడు రూమ్‌లోకి చూసాట్ట!అంతే! ఒకటే ఇకఇకలు, పకపకలూనట!’’ కడుపుబ్బు తీర్చుకోవటానికి కక్కేసాడు మహేశ్వరాచార్యులు.