‘అన్నా!... ఫోను... అరడజన్లు సార్లు మోగింది. అంత మొద్దు నిద్ర ఏంటీ, లే’’ అని సెల్‌ తీసుకువచ్చి చేతిలో పెట్టింది శిరీష.‘‘చెప్పరా బాసూ...’’ అన్నాడు మిత్రా.‘‘జయకు జ్వరం. రాదట...’’‘‘ఏంటీ? వేషాలేస్తోందా? ప్రోజెక్ట్‌ అవక్కర్లేదా!’’ చాలా ఆవేశంగా లేచి కూర్చుని తిట్టడం మొదలెట్టాడు.‘‘ఇలా తిడతావనే నీకు చెప్పలేదు..’’‘‘నీకు తెలియదా! టైమ్‌ అయిపోతుందని....’’ అన్నాడు దిగులుగా‘‘ఏం చేస్తాం మరీ...!’’‘‘సర్లే నేనే తొందరగా పోతాను. చూస్తాలే.. 9.30కి కస్టమర్‌ కాల్‌ఉంది. మోర్గా తినేస్తుంది... ఉంటా....’’ అని ఫోను పెట్టి ఆలోచనలో మునిగిపోయాడు రెండు నిమిషాలు.మిత్రా గబగబా బాత్రూమ్‌కి వెళ్లి కాలకృత్యాలు ముగించి స్నానం చేసి బయటకు వస్తూనే ‘‘అమ్మా కాఫీ... మమ్మీ కాఫీ...’’ అన్నాడు గట్టిగా.తువ్వాలు కట్టుకొని డివోడ్రెంట్‌ వొళ్లంతా స్ర్పే చేసుకొన్నాడు. కాఫీ పట్టుకొని వచ్చిన చెల్లి ‘‘అబ్బబ్బ ఎందుకురా అంతవాడతావు. వాసన చిరాకొచ్చేస్తుంది. నీ జీతం అంతా దీనికే పోతుందేమో!’’ అంది.‘‘ఊరుకో ఏ.సిలో చెమట వాసన వస్తే చచ్చిపోతారు. భరించలేక... అయ్యో మరచిపోయా- హాపీ బర్తే డే టూయూ’’ అని చెయ్యి ఇచ్చాడు.‘‘సాయంత్రం త్వరగా రా...’’‘‘అబ్బే, కుదరదు’’ అంటుండగానే’’‘‘దాని పుట్టిన రోజు అనే మేము అంత దూరం నుండీ వస్తే నువ్వు లేకపోవడమేమటిరా...’’ అన్నాడు మావయ్య.‘‘బాబూ, నాది నీలా గవర్నమెంట్‌ ఉద్యోగం కాదు’’‘‘గవర్నమెంటు ఉద్యోగానికి ధరఖాస్తు చెయ్యవు. అపుడే రెండు కంపెనీల్లో ఉద్యోగం మారావు. అర్ధరాత్రి వస్తావు.’’ అంటున్న తల్లి మాటలకి అడ్డుపడుతూ-‘‘మమ్మీ కడుపులో చల్ల కదలకుండా ఉండాలనుకొనే మీ తమ్ముళ్ల లాంటి వారి కోసం మాత్రమే గవర్నమెంటు ఉద్యోగాలు...’’‘‘టెంక్షన్‌తో ఏ నరం తెంపుకుంటావో అని భయం...’’‘‘ఏం కాదు. టెంక్షన్‌లో థ్రిల్‌ ఉంది.

 టెంక్షన్‌తో వర్క్‌ చేస్తే అది ఫలిస్తే వచ్చే మజాయే వేరు నన్ను వదిలేయండి’’ అని గబగబా కాఫీ తాగి కప్పులోపల పడేసి వచ్చి-‘‘శిరీ.....’’ అని రెండు చేతులు పట్టుకొని ఊపుతూ ‘‘చెల్లాయి పుట్టిన రోజూ...’’ అని పాట మొదలెట్టాడు.‘‘బాబోయ్‌, తెలుగు సినిమా అన్న ప్రేమ వద్దు నాయనా...’’ అని చేతులు విదిలించింది... నవ్వుతూ 5000 రూ. తీసి చేతిలో పెట్టి ‘‘కాళ్లకి దండం పెట్టుకో. పెద్దవాడ్ని దీవిస్తా’’ అన్నాడు.‘‘పెద్దరికం నీకు వచ్చాక పెడ్తాలేరా’’‘‘అంటే, ఏయ్‌, ఊరుకొంటున్నాననా? చూడు అమ్మా!’’నవ్వి ‘‘ఏవన్నా తిని వెళ్లరా!’’ అంది తల్లి.‘‘ఏం వద్దు రాత్రి తింటాను... 9.30కి అక్కడ తింటాలే టిఫిన్‌..’’‘‘మావయ్యా, వీడికి అక్కడ పెద్ద హోటల్‌లో నుండి అన్ని తెప్పిస్తారు’’ అంది శిరీష‘‘వాడిపొట్టే చెప్తోంది గదా!’’‘‘మావయ్యా! సిరిబొజ్జ. ఈ జానెడు బొజ్జ కోసమే కదా ఇన్ని పాట్లూ.. దీన్ని ఎవరూ ఏవీ అనకూడదు.’’ అని కుడి చెయ్యి బొజ్జ మీద ప్రేమగా ఆనించి - ‘‘530 కి కేక్‌ వస్తుంది. రాకపోతే ఫోను చెయ్యి... బై... ’’ అంటూ