అన్నయ్యా నాకు చాలా భయంగా వుంది’’.జీవితంలో మొదటిసారి ముకుంద గొంతులో అంతటి బేలతనం.‘‘ఏమయిందమ్మా సుధాకర్‌ను పిలవనా?’’ అన్నాను.‘‘వద్దు వద్దు ఆయన గురించి మాట్లాడదామనే నీకు ఫోన్‌ చేశాను’’ అంది గాభరాగా.క్షణకాలం నాకేమీ అర్థం కాలేదు.తల తిప్పి చూశాను. ఫైల్స్‌ సర్దుతూ వెళ్ళడానికి తయారవుతున్నాడు సుధాకర్‌.‘‘చెప్పమ్మా ఏంటీ విషయం?’’‘‘ఫోన్‌లో చెప్పేది కాదు. రేపొకసారి ఇంటికి రాగలవా ప్లీజ్‌’’ అంది బతిమాలుతూ.‘‘అలాగే’’ అనేసి ఫోన్‌ పెట్టేశాను.ఇటు తిరిగి సుధాకర్‌ను పలుకరిద్దామనుకునే సరికి వెళ్ళిపోతూ కనిపించాడు.‘‘ఏరా సుధా ఇంటికేనా, నేనూ వస్తాను’’ అన్నాను.‘‘వద్దు. దారిలో నాకు వేరే పనులున్నాయి’’ అనేసి నా మాటకోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు.నాలో క్యూరియాసిటీ.వాడికి తెలియకుండానే నా బైకుపై వాడిని ఫాలో అయ్యాను.వాడి స్కూటర్‌ సరాసరి వెళ్ళి ఆగిన చోటును చూసి షాకయ్యాను.అది బార్‌ షాపు.ఆల్కహాల్‌కు ఇరవై కిలోమీటర్ల దూరముండే సుధాకర్‌ బార్‌షాపులోకి వెళ్ళడం పెద్ద షాకే నాకు.నిత్యం పూజలు పునస్కారాలతో గడిపే మా సూపర్నెంట్‌ స్వామిపాదం గారి భార్య మంగళ, ఆదివారాల్లో మందు కొడుతూందని తెలిసినపడు కూడా అంత షాకవ్వలేదు.

సమ్‌థింగ్‌ రాంగ్‌.ఇంటికి వస్తూ ఆలోచించసాగాను.ఇట్లాంటి సందర్భాలలో నా మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంటే మిగతా సందర్భాలలో చురుగ్గా పనిచేయదని కాదు. ఏదైనా సమస్యను సాల్వ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడినపడు దాని మూలాలను వెతకడంతో నా అన్వేషణ మొదలవుతుంది.మా ఆఫీస్‌ స్టాఫ్‌ నుండి మొదలుకుని స్నేహితులు చుట్టాలు అందరికీ నా అన్వేషణలపైన పరిశోధనలపైన చాలా నమ్మకం. ఏమాత్రం నమ్మకంలేని ఏకైక వ్యక్తి మా ఆవిడ సందిత ఒక్కతే. ఎపడైనా తాను పుట్టింటికి వెళితే కందిపప డబ్బా కూడా ఎక్కడుందో తెలియక వెతికీ వెతికీ తిరిగి తనకే ఫోన్‌ చేసి తెలుసుకునే నా తెలివితేటలపైన చాలా తేలికభావం.ప్రతిరోజూ టి.విలలో వచ్చే సీరియల్స్‌లో తరువాత ఏం జరగబోతోంది? ఫలానా పాత్ర చివరకు ఏమవుతుంది? ఫలానా సీరియల్‌ ఎన్ని ఎపిసోడ్స్‌లో ముగుస్తుంది లాంటి ప్రశ్నలడుగుతూ కనీసం వీటికి సమాధానాలు కూడా ఊహించడం చేతకాని మీరు బయటమాత్రం పెద్ద అపరాధ పరిశోధకునిలా ఫోజుకొడతారు అని నా పరిశోధనను గంజిలో ఈగలా తీసిపారేస్తుంది.‘‘వాటికి సమాధానాలు ఆ కథ రాసిన రచయితకే కాదు అతని మెదడును కసాపిసా పిసికి వుండలా చేసి అతని బుర్రలో కూరిన ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదే’’ అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోదు.అందుకే ఇంటికి వచ్చి నాలో నేనే సుధాకర్‌ విషయం ఆలోచించుకుంటూ వుండిపోయాను గానీ సందితతో మాత్రం చెప్పలేదు.నాకున్న అతికొద్దిమంది విశ్వసనీయ స్నేహితులలో సుధాకర్‌ ఒకడు. నమ్మకానికి, మంచితనానికి, ఆర్ద్రతకు చిరునామా వాడు. ముకుంద వాడికి తగిన జోడి. వారిద్దరి మధ్యన బేధాభిప్రాయాలకు తావే లేదు. పుట్టింటి వాళ్ళంతా వ్యతిరేకించినా అన్నింటినీ అందరినీ వదులుకుని బాబా గుడిలో సుధాకర్‌ను వివాహం చేసుకుంది.