లావణ్య ఇంట్లోకి విసురుగా వచ్చి విడిచిన చెప్పులు ఎగిరి చెరో మూల పడ్డాయి. వెళ్ళి తండ్రి పక్కన సోఫాలో కూచుంది. ఆమె కళ్ళు వర్షిస్తు న్నాయి. ఆమె దుఃఖం తెల్సిన తండ్రి వేణుగోపాల్‌ కూతుర్ని ఓదార్చలేదు సరికదా! చదువుతున్న పుస్తకంలోంచి దృష్టి కూడా మరల్చ లేదు.ఆ ఉదాసీనత రెండు నిమిషాలు భరించిన లావణ్య, ముక్కు ఎగబీలుస్తూ, తండ్రి చేతిలో పుస్తకం లాగి, టీపాయ్‌ మీద పడేసింది.కూతురి వేపు కూల్‌గా చూశాడతను. కళ్ళు, ముక్కు ఎర్రబడ్డ లావణ్యని చూసి నవ్వొచ్చింది. ‘పండూ! ఏమైందిరా?’’ అన్నాడు అనునయంగా. సీరియస్‌గా చూసింది లావణ్య. ‘‘ముందెళ్ళి మొహం కడుక్కురా’’ అనడంతో లోపలికెళ్ళింది లావణ్య.ఫఫఫవేణుగోపాల్‌ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌. అతడి ఏకైక కూతురు లావణ్య. ప్రేమ, గారాబంతో పాటు భయం, వినయంతోనూ పెంచారు. మాష్టారు కదా! మాట తేడా వస్తే సహించేవాడు కాదు.ఇంజనీరింగ్‌ చదివిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగస్థురాలు లావణ్య. తన కొలీగ్‌ శ్రీరాంని ఇష్టపడింది. తన కంటే రెట్టింపు సంపాదిస్తున్నాడని తండ్రితో చెప్పింది.విషయాలన్నీ విని, ‘‘మీలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు?’’ అన్నాడు వేణుగోపాల్‌.‘‘ఉయ్‌ ఆర్‌ ఇన్‌ డీప్‌లవ్‌ అంతే’’ అంది.‘‘అదేరా! ఎందుకడుగుతున్నానంటే... లవ్‌లో కాలిక్యులేషన్స్‌, ఈక్వేషన్స్‌, ఇంటెన్సిటీ, ఇంటిమసీ, వాల్యూస్‌... ఇలా చాలా ఉన్నాయి అంటూండగా..అంతలో భార్య ఫోన్‌ చేసింది.‘‘మా కొలీగ్‌ వాళ్ళబ్బాయి బర్త్‌డేకి వెళ్ళొస్తాను’’ అంది.‘‘అమ్మ లేటుగా వస్తుందట. నేను బజారెళ్ళి కూరలు తెస్తాను. నువ్వు రిలాక్సవు’’ అంటూ వేణు గోపాల్‌ బయటకు వెళ్ళాడు.లావణ్య ఒంటరిగా కూచుని ఆలోచిస్తోంది.తండ్రికి ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలి? తల్లికి ప్రేమంటేనే... మంట. వాళ్ళన్నయ్య కొడుకుని చేసుకోమని అడుగుతోంది’’.ఇంతలో వాట్సప్‌ మెసేజ్‌.. తీసి చూసింది. ‘‘స్పీకింగ్ లిఫ్ కెన్ రెడ్యూజ్ ఎనీ ప్రాబ్లమ్.. క్లోజ్డ్ లిప్స్ కెన్ అవైడ్ సమ్ ప్రాబ్లమ్. బట్ స్మైలింగ్ లిప్ కెన్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్ ఫారెవర్’’ .శ్రీరాం మెసేజ్‌ చదివాక మనసు తేలిక పడింది. అతనికి ఫోన్‌ చేసింది.‘‘ఫ్రెండ్స్‌తో ఉన్నా. కాల్‌ యు.. లేటర్‌’’ కట్‌ చేశాడు.

ఆ ఒంటరితనంలో లావణ్యకు శ్రీరాం కళ్ళ ముందు మెదిలాడు.ఆమె మనసు గతంలోకి వెళ్ళిపోయింది.ఫఫఫక్యాంపస్‌ ఇంటర్వ్యూలో సెలక్టయి జాబ్‌కెళ్ళిన మొదటిరోజు ఇంట్రడక్షన్‌ మీటింగ్‌ జరిగింది. కంపెనీ లక్ష్యాలు, నేచర్‌ ఆఫ్‌ వర్క్‌ గురించి చెబ్తున్న శ్రీరాం సూటులో, ఎత్తుగా, అందంగా హుందాగా హీరోలా కనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్‌ లావణ్యకి బాగా నచ్చింది. ‘కంగ్రాట్స్‌’ అంటూ చెయ్యి కలిపి అభినందిస్తుంటే అతన్ని మరింత దగ్గరగా చూసింది.వర్క్‌ నేర్పటంలో అతని సహనం, ‘‘యాఁ.... ఐసీ; ష్యూర్‌.. ఆసమ్‌; యు ఆర్‌ రైట్‌’’ వంటి మాటలంటున్నప్పుడు అతని ముఖ కవళికలు... మళ్ళీ మళ్ళీ అతన్నే చూడాలన్పించేలా చేశాయి లావణ్యని.