‘‘ఎందుకు చేస్తున్నావు ఈ పని?’’ లాఠీని వూపుతూ అడిగాడు ఎస్సై. అతను అలా అడగడం పదోసారి. ఆమె వెక్కి వెక్కిఏడుస్తున్నది. కాని సమాధానం మటుకు చెప్పడం లేదు.పద్దెనిమిదేళ్ల ప్రాయం కూడా రాలేదు. మొహంలో పసితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఎరువు వేసి పెంచినట్లు ఆమె యవ్వన సంపద పెరిగింది. కాని దానికి తగ్గట్టుగా మెదడు వికసించినట్లుకనిపించడం లేదు.‘‘ఆకలి...’’ చిన్నగా గొణిగింది.‘‘ఛీ! ఆకలి వేస్తే అన్నం తినాలి కాని ఇవ్వేం పాడు బుద్ధులు! నీకు మొగుళ్లు కావలసి వచ్చిందే! నీలాంటి వాళ్ల వలన దేశంనాశనమైపోతున్నది.’’ ఎస్సైఅసహనంగా అరిచాడు.‘‘అయ్యా! నాకు తెలియక అడుగుతాను. నా మూలంగానే దేశం నాశనమైపోతున్నదాయ్యా!’’ అమాయకంగా అడిగింది ఆమె.‘‘నిస్సందేహంగా! నీలాంటి బజారు ముండలు సకల రోగాల్ని ప్రజలకు అంటగడతారు. దాంతో వాళ్ల ఆరోగ్యం గుల్లయిపోతుంది. మన జాతీయ ఆదాయం తగ్గిపోతుంది.’’ లాఠీ టేబుల్‌ మీద కొట్టి చెప్పాడు.‘‘కానీ.. నేను అనుకోవడం వాళ్ల రోగాలు మాకు అంటిస్తున్నారని’’చిన్నగా గొణిగింది.‘‘ ఒసే... నీకు ఇపడు బ్లడ్‌ టెస్ట్‌ చేయిస్తే హెచ్‌ ఐవి పాజిటివ్‌ వస్తుందే! నిన్ను కలిసిన ప్రతి వెధవకీ ఆ జబ్బు ఫ్రీ!’’ వెకిలిగా నవ్వాడు ఎస్సై.

ఆమెకు ఆ జబ్బు గురించి తెలిసినట్లు లేదు. పెద్దగా స్పందించలేదు.‘‘అయ్యా! ఆకలికి నేను ఒళ్లు అమ్ముకుంటున్నాను. కాని వచ్చేవాళ్లు నా దగ్గరికి ఎందుకొస్తున్నారు? వాళ్లకేం ఆకలి? బొజ్జలు కుండల్లా వుంటాయి కొందరికి’’ ఆమె స్వగతంగా ఆలోచిస్తూ ప్రకాశంగా అడిగింది.‘‘నీలాంటి రంకు ముండలు ఫోజులు కొడుతూ వుంటే రాకుండా ఎలా వుంటారే? నిపల్లో పడ్డ మిడతల్లాగా నీ వల్లో పడి కాలిమసైపోతారు పిచ్చి వెధవలు!’’ కోపంగా చెప్పాడు.‘‘అయ్యా! నాకూ కడుపు నిండా పెట్టేవాళ్లుంటే ఈ ఎదవపని నేనెందుకు చేస్తాను. నన్ను చదివించే వాళ్లుంటే అన్నిపరీక్షలు ఫస్టున పాసయ్యేదాన్ని’’ ఏడుస్తూ చెప్పింది.‘‘చదువుకున్నావా?’’‘‘తొమ్మిదవ క్లాసు’’‘‘పదవ తరగతి పాసుకాలేదా?’’‘‘కాదు-నన్నూ బలవంతంగా లాక్కుచ్చేశారు ఈ ఊబిలోకి. నేనొక మరబొమ్మని. పైసలు సంపాదించాలి. కండలు కరిగించుకొని పైసలు మా వాళ్లకుపంపాలి.’’ ఏడుస్తూ చెప్పింది.‘‘ఏంటీ నీ మొహానికి అమ్మా నాన్నా ఉన్నారా?’’ ఎస్సై అడిగాడు.