చిన్నిగాడు నేల నుంచి ఎంత ఎత్తున్నాడో, అంతెత్తు వాడి చేతుల్లో ప్లేట్లు ఆకాశంలో ఉన్నాయి.వాడు సర్కస్‌లో తన శక్తియుక్తులు ప్రదర్శించేవాడు కాదు. హోటల్‌ సర్వరు. పన్నెండేళ్ళుండవు. ఉంటేవయస్సుకు తగ్గ పెరుగుదల లేదు. ఎందుకు లేదు? చెప్పలేం! ఆరోగ్యం బాగానే ఉంది. బహుశా కవులు చెబితే, జీవితం బరువు మోయలేక కుంగిపోయాడంటారు కాబోలు.చలికాలం - డిసెంబర్‌ నెల చలిలో పొద్దున్నే లేచి చన్నీటితో స్నానం చేసి, పూజ చేసి, తల నున్నగా దువ్వుకొని, బొట్టు పెట్టుకొని, ఉతుక్కొన్న చొక్కా నిక్కరూ వేసుకొని ముచ్చటగా ఉన్న చిన్ని ముద్దుగా ఉన్నాడు.ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క కష్టమరు ముందు పెడుతూ వాడు సందేహించలేదు, అడగలేదు, సర్దలేదు. ఆరుటేబుళ్ళ మీద ఇరవై నాలుగు మందికి, వాళ్లేమి ఆర్డరు చేశారో అదే ఇచ్చి, చేతులకు అంటుకొన్న పుణ్యం ఇంతవద్దు అనుకొన్నాడేమో తుడుచుకోసాగాడు.నీళ్ళు అంటే ఇచ్చాడు. చట్నీ అంటే తెచ్చాడు. సాంబారు అంటే వేశాడు. ఏడు కాఫీ, మూడు బ్రూ అన్నాడు. క్షణంలో తెచ్చాడు. అరక్షణంలో అందించాడు. తెచ్చేటప్పుడు గాని, ఇచ్చేటప్పుడు గాని, కాఫీ గాని బ్రూ గానీ తొణకలేదు. చుక్క జారలేదు. పడలేదు. పది కప్పు సాసర్లు ఒకేసారి తెచ్చాడు. కాఫీ అడిగిన వాళ్ళకు కాఫీ, బ్రూ అడిగినవాళ్ళకు బ్రూ ఇచ్చాడు.స్ఫూన్‌ అంటే ఇచ్చాడు. చెక్కెరంటే వేశాడు. డికాక్షన్‌ అంటే తెచ్చాడు. పాలంటే పోశాడు. బిల్లంటే రాశాడు, చించాడు. నీటిచుక్క అంటించాడు. టేబిల్‌కి అతికించాడు.చిన్ని ఎందుకో కస్టమర్లను పాసెంజర్లు అంటాడు.

 వచ్చే వాళ్ళు వస్తున్నారు. తోవ ఇస్తున్నాడు. పోయేవాళ్ళు పోతున్నారు. తోవ చూపుతున్నాడు. పోయేవాళ్ళకూ నమస్కారం ‘రేపు రండిసార్‌’! వచ్చే వాళ్ళకు నమస్కారం ‘లోపలికి రండి సార్‌!’నవ్వు, వాడూ కలిసే పుట్టారో, వాడు పుట్టగానే, వాడి ముఖం మీద నవ్వు పుట్టిందో, నవ్వును చొక్కా నిక్కరులాగా ఉతికి ఆరేసుకొని, పొద్దున్నే ముఖానికి వేసుకున్నాడో తెలియదుకాని, వాడి ముఖం నిండా నవ్వు ఉంది. అది శరీర మంతా వ్యాపించింది. వాడు నడుస్తుంటే నవ్వు నడుస్తున్నట్లుంటుంది. ఉండదు మరి! కవి ప్రవేశించాడు.‘కవిగారూ! నమస్కారం - రండిసార్‌. ఇవాళ ఆలస్యం అయిందే! గురూగారూ పొద్దున్నే నిద్ర లేవలేక పోయినట్లున్నారు. నిద్ర మత్తు వదిలినట్లు లేదు అని మీతో అనకూడదు. నిద్రాదేవి పరిష్వంగ సుఖం వదులుకోలేక దాన్ని వాటేసుకుని హోటల్‌కి వచ్చినట్లున్నారు. దానికి వేడివేడిగా ఏం తినిపిస్తారు? మీరేం తింటారు.కవి చిన్ని భుజం తట్టి, బుగ్గ నిమిరి, వంగి నుదురు ముద్దాడి నిద్రను భుజాల మీదికి లాక్కుంటూ, ఆవులిస్తూ ‘పొద్దున్నే నీ ముఖం చూస్తే సర్వపాపాలు గాలిపటాలై ఎగిరిపోతాయిరా చిన్ని’ అని ఆవులింతను కొనసాగించాడు.