హరిజనవాడ తగలబడుతున్నది.ఏ భూస్వామి నిప్పంటించమని చెప్పలేదు. ఆర్నెల్ల నుంచి తగలబడుతోంది. గాంధీ మహాత్ముడు దిగిరాలేదు.అరుంధతి తప్పు చేస్తోంది.పెద్ద దొరతో ఆర్నెల్ల నుంచి తప్పు చేస్తోంది. రాత్రిళ్ళు కొడుకు దీపం చూపుతూ పెద్దదొర కొష్టానికి తల్లిని చేరుస్తాడు. పెద్దదొర అప్పుడే భోంచేసి కొష్టం దగ్గరికొస్తాడు. అరుంధతి సిగ్గుపడుతుంది. అలవాటయిన పనికి తొందరేమిటన్నట్లు మాటల్లోకి దిగుతాడు పెద్దదొర. అరుంధతి కొడుకు తలవంచుకు దూరంగా నిలబడతాడు. తెల్లవారగానే అరుంధతిని వెంట బెట్టుకుని హరిజనవాడకు వస్తాడు.ఇది ఆర్నెల్ల నుండీ జరుగుతున్న కథ.ఊరికి దూరంగా శపించబడ్డ మునుల్లా వున్నాయి హరిజనవాడలోని గుడిసెలు. నాగరిక ప్రపంచం తిని పారేసిన ఎముకల్లా వున్నారు - అక్కడి మనుష్యులు. ఇప్పుడిపుడే సూర్యచంద్రుల్నే కాకుండా అన్యాయాన్ని, నిజాన్ని తెలుసుకుంటున్నారు.సూర్యుడు రాలేదు. బ్రాహ్మణవీధిలో అవధాన్లగారింటి మీద స్వాతంత్య్ర గీతం పాడుతోంది మాలకాకి. కోటీశు ముందు నడుస్తున్నాడు. అరుంధతి వెనక వస్తోంది. పెద్దదొర బద్ధకంగా లేచి అంటరానిదాన్ని తాకిన చేతులు, పెదాలు, బావి దగ్గర కడుక్కుని బయలుదేరాడు ఊళ్ళోకి.మాలపల్లి బావిలో నీళ్ళు ఎండిపోతే, ఊరి చెరువులో నీళ్ళు ముంచను ప్రయత్నించిన తన తండ్రిని కొట్టిన దెబ్బలు అరుంధతికి ఇంకా గుర్తున్నాయి.రాత్రి పెద్ద దొర తన బుగ్గమీద ఎంగిలి రాసినప్పుడు తను కసితీరా తన ఎంగిలి పెద్దదొర బుగ్గకు అంటించింది. రాత్రి లేని అంటరానితనం పగలు ఎక్కడ్నించి వస్తుందా అనుకున్నాడు కోటీశు.పల్లెలో ముసలి ముత్తడు ఎదురొచ్చాడు. 

‘‘సిగ్గులేని బతుకు,’’ వుమ్మేశాడు.వెలివేసిన వాళ్ళలో చెడిపోయిన వాళ్ళను ఎలా ఎక్కడ మళ్ళీ వెలివేయాలో అర్థం కాలేదు ముసిలోడికి.మాలపల్లి బావి దగ్గర సుబ్బాయి అంది, ‘‘ఇప్పుడు కొడుకు సేత పక్కలేయించుకుంటున్నదీ - రేపు ఆడ్నే పక్కలోకి రమ్మంటది’’.కోటీశు తల్లి వైపు చూశాడు. అరుంధతి కళ్ళ నీళ్ళలో రక్తం కనిపించింది.తల్లీ కొడుకులు గుడిసె దగ్గరకు చేరారు. భోరున ఏడ్చింది అరుంధతి. ‘‘అమ్మా’’ అన్నాడు కోటీశు. తండ్రిలా చేరదీశాడు. కొడుకు చేతిలో బిడ్డలా కన్నీళ్ళు కారుస్తూ విలవిలలాడింది అరుంధతి.‘‘నీవు తప్పు సేయడం లేదమ్మా. నీవు పతివ్రొతవే’’.అరుంధతి కన్నీళ్ళు తుడుచుకుంది.ఆ గ్రామంలో గాలీ, నీరు, దేవుడు, సత్యం, ధర్మం, న్యాయం తప్ప మిగిలినవన్నీ పెద్దదొరవే. తనకోసం... భగవంతుడు పదకొండవ అవతారం ఎత్తకుండా వుండడు, గ్రామంలో దేవుడి ఉత్సవాలు చాలా గొప్పగా చేస్తాడు - ఆయన గొప్ప ధర్మకర్త. తనకున్న జబ్బులు, వస్తాయని చెప్పిన జబ్బులు, తన ప్రాణానికి హామీ ఇవ్వవని తెలిసినప్పుడు తన అవసరానికి వీలుగా ఊళ్ళో చిన్న హాస్పిటల్‌ పెట్టించాడు - ఉదారశీలుడు.