వివేక్‌ ప్రధాన్‌ సంతోషంగా లేడు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఏర్‌కండిషన్డ్‌కంపార్ట్‌మెంట్‌లోని సౌకర్యవంతమైన సీట్‌ కూడా అతనికి ఆనందాన్నిఇవ్వలేకపోయింది. అందుకు కారణం అతనికున్న మానసిక ఆందోళన.అతను ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.ఆఫీస్‌ పని ముగించుకుని బెంగుళూర్‌ వెళ్తున్నాడు.అతనికి విమాన ప్రయాణానికి అర్హత లేదు. విమాన ప్రయాణం చేస్తే, సమయం ఆదా అవుతుందని, తన కంపెనీ అడ్మినిస్ర్టేషన్‌ వారితో చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. వాదించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో రైౖల్లో వెళ్ళక తప్పలేదు. తను క్లయింట్‌కి సబ్మిట్‌ చేసిన ప్రాజెక్ట్‌ తాలూకు స్పందన వస్తే కానీ అతనికి ఆ ఆందోళన తగ్గలేదు.వివేక్‌ తన లాప్‌టాప్‌ బేగ్‌ని తెరిచి, లాప్‌టాప్‌ని బయటికి తీసాడు. సమయాన్ని వృధా చేయదల్చుకోలేదతను. ఇంటర్నెట్‌ అంత తేలిగ్గా కనెక్ట్‌ కాలేదు. టవర్స్‌ దగ్గర లేవనుకుని, ప్రాజెక్ట్‌ఫోల్డర్‌ని తెరిచాడు.‘‘మీరు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారా?’’ వెనకనించి హిందీలో ఓ కంఠం వినిపించింది వివేక్‌కి.వెంటనే తలతిప్పి వెనక్కి చూసాడు. 

తన ఒళ్లోని లాప్‌టాప్‌ వంక ఆరాధనగా చూస్తున్న ఒకతను కనబడ్డాడు.‘‘అవును’’ జవాబు చెప్పాడు వివేక్‌.ఇపడతనికి విమాన ప్రయాణంలో కోల్పోయిన కొంత ప్రెస్టేజి అక్కడ దొరికినట్లుగా ఫీలయ్యాడు.అతనివంక పరిశీలనగా చూసాడు వివేక్‌. కండలు తిరిగిన శరీరం. దారుఢ్యంగా వున్నాడు. అతనొక్కడే ఆ కంపార్ట్‌మెంట్‌కి చెందనివాడుగా కనిపించాడు. పైన తను చూసిన, ఆర్డినరీ సెంకడ్‌క్లాస్‌కి చెందినదిగా కనిపించిన ఏర్‌ బాగ్‌ ఎవరిదో అతనికిపడు అర్థమైంది. బహుశా రైల్వేశాఖలో పనిచేసే స్పోర్ట్స్‌ మేన్‌ అయివుంటాడు. ఫ్రీ పాస్‌తో ఈ కంపార్ట్‌మెంట్‌ ఎక్కివుండచ్చు.‘‘ఐటి ఇండస్ర్టీలో పనిచేసేవారంటే, నా కెంతో గౌరవం. మీరు ఆఫీస్‌లో కూర్చుని, కంప్యూటర్‌లో ఏదో రాస్తారు. కానీ అది బయటి ప్రపంచంలోని ఎన్నో పెద్ద పనులని చేస్తుంది’’వివేక్‌ గర్వంగా నవ్వి చెప్పాడు.‘‘ఇది మీరు చెప్పినంత తేలికైన విషయం కాదు మిత్రమా! ఏదో ఒకటి రాయడం కాదు. నిజానికి అది రాయడం వెనక చాలా మెదళ్లు పనిచేస్తాయి’’కొద్ది క్షణాలపాటు సాఫ్ట్‌వేర్‌ పని చేసే విధానం గురించి అతనికి వివరించాలని కూడా వివే క్‌కి అనిపించింది.

అయితే అతను కూడా తనలా అమెరికన్‌ ఈ గిల్‌ బ్రాండ్‌ టీషర్ట్‌. లీ జీన్స్‌ పేంట్‌ వేసుకుని వుంటే, బహుశా చెప్పేవాడేమో.‘‘చాలా కష్టమైన పని మాది’’‘‘అవును అందుకనే మీకు ఎక్కువ జీతాలిస్తారనుకుంటా’’‘‘అంతా మాకు వచ్చే జీతాన్నే చూస్తారు తప్ప, మేము ఆ పని చేయడానికి పడే కష్టాన్ని చూడరు. మన దేశంలో కష్టపడి పనిచేయడం మీద గౌరవం లేదు. దాని విలువ కూడా చాలా మందికి తెలియదు. మేము ఏర్‌కండిషన్డ్‌ గదుల్లో కూర్చుంటాం కాబట్టి, సుఖపడతాం అనుకుంటారు. కాని, కొన్నిసార్లు మాకు చెమటలు పట్టే సందర్భాలు అనేకం వస్తూంటాయి. మీరు కండలతో పని చేస్తే, మేము మెదడుతో పనిచేస్తాం. ఇది కూడా తక్కువ కష్టమేం కాదు. నిజానికి ఎక్కువ మిత్రమా’’.