భగవంతుడు నా కళ్ళకు ప్రసాదించిన చూపులో అంధత్వశాతమే అధికంగా ఉండటం నా దురదృష్టం.పుట్టుకతోనే జన్యుపరమైన లోపాలు నాలో ఉన్నాయి.వినికిడి జ్ఞానం కూడా అంతంత మాత్రమే. దానికి హియరింగ్‌ ఎయిడ్‌ వేయించుకున్నాను.చూపులో లోపాన్ని సవరించుకోవడం కోసం ఎంతమంది డాక్టర్లని కలిసి చూపించుకున్నా ఫలితం మాత్రం కనిపించలేదు.వాళ్ళు నాకు అనేక పరీక్షలు చేసిన పిమ్మట నాది వంశపారంపర్యంగా వచ్చిన జబ్బని తేల్చారు.నా తాతా, తండ్రులకూ ఇలాంటి లక్షణాలే ఉన్నందున నేను మానసికంగా బాధపడ్డం మానేసి, కొంత స్థిమిత పడ్డాను. సోడాబుడ్డి కళ్ళద్దాలు లాంటివి నా ముఖానికి అలంకారంగా అమిరాయి.చదవడం అంటే నాకు చచ్చేంత ఇష్టం.పుస్తకాలు చదవడం వల్ల కలిగే ఆనందం ఈ ప్రపంచంలో మరేదీ లేదని... ఏదీ కలిగించలేదని నేను పుస్తకాలు చదవడం ద్వారా గ్రహించాను.బాధల్లో... నిరాశా నిస్పృహల్లో... కష్టాల్లో... వేదనలో ఉన్నప్పుడు, అవమానాలు, అన్యాయాలు ఎదురయి నపుడు, ఎవరిమీదైనా కారణంతోనో, అకారణంగానో కోపంతో రగిలిపోతున్నప్పుడు ఆ సమయంలో పుస్తకాలు చదవడం ద్వారానే మొత్తంగా అలాంటి భావాలన్నీ నాలోంచి దూది పింజల్లా ఎగిరి, తొలగిపోవడాన్ని నేను గ్ర హించగలిగేను.అప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉన్న భావన కలిగేది.చదవడం మీద ఇష్టం, ప్రేమ ఉన్నందువల్ల ఉన్న చూపుతోనే ఒకపక్క తరగతి పుస్తకాలు చదువుకుంటూనే... నాలో విజ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనని నింపే పుస్తకాలు ఎన్నిక చేసుకుని మరీ చదివేవాడిని.ఇలాంటి ఆసక్తి, అలవాటు... ఎప్పుడు, ఎలా, ఏ సందర్భాన నాలో అలవోకగా ప్రవేశించాయో తెలీదుగానీ, ఆ క్షణాలకు నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.నేను బాగా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాకు లభించిన పిల్లల కథల పుస్తకాలను ఆసక్తిగా చదివేవాడిని. 

ఆ కథలు ఎంతో నీతివంతంగా ఉండి, నేను నీతి, నిజాయితీ పట్ల ఎల్లప్పుడూ విధేయునిగా ఉండేలా... ఆ విధంగా ప్రవర్తించేలా చేసేవి.నేను కొంత శాతం బ్లయిండ్‌, పూర్తిశాతం చెవుడు లక్షణాలు ఉన్నవాడిని కావడం వల్ల మా ఇంట్లో గానీ, ఇరుగు పొరుగున ఉండేవాళ్ళు గానీ ముఖ్యంగా నా ఈడు పిల్లలు గానీ ఇష్టంగా నా దగ్గరకు చేరేవాళ్ళు బహుతక్కువ.వాళ్ళ తాలూకు ఆటలు... అల్లర్లూ... వేరుగా ఉండేవి!ఇలాంటి పరిస్థితుల్లో జాలితోనో, సానుభూతితోనో ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడే సందర్భాలు ఎదురైనప్పుడు నేను చాలా ఉత్సాహపడి పోయేవాడ్ని.నాకున్న పుస్తక పరిజ్ఞానంతో, నా అవగాహన మేరకు ఆ కథలను వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు చెప్పడానికి సిద్ధపడేవాడిని.నేను చెబుతున్న కథలను కొందరు ఆసక్తిగా వింటే, మరికొందరు అసహనంగా వినేవాళ్ళు.కథని వినేప్పుడు..... ముఖ్యంగా వింటూ వాళ్ళు ‘ఊ’ కొడుతున్న పద్ధతిని బట్టి, వినడంలోని వాళ్ళ వైఖరులను నేను గ్రహించేవాడిని.