తిరుపతి నుంచి గోవా వెళ్లే దారిలో లోండా అనే చిన్న స్టేషన్‌ వస్తుంది. అక్కడే నేను రైలు మారాల్సి వస్తుంది. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టినపడల్లా నాకు బాండ్‌..రస్కిన్‌ బాండ్‌ గుర్తుకు వస్తాడు. ఆయన కథల్లోలా వుంటుందా స్టేషన్‌. అక్కడి నిశ్శబ్దం అంటే నాకు చాలా ఇష్టం. ఆ నిశ్శబ్దంలో అపూర్వమైన ప్రశాంతత వుంటుంది. ఆ నిశ్శబ్దంలో నన్ను నేను మైమరచిపోతాను.ప్రొద్దున్న పదిన్నరకి హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ దిగి లోండాలో అడుగుపెట్టాను. గోవాకెళ్లే రైలు మధ్యాహ్నం మూడున్నరకి. అంతవరకూ ఆ స్టేషన్‌లోనే కాలక్షేపం చెయ్యాలి. నా బ్యాగును బరబరా లాక్కుంటూ వెళ్లి అక్కడున్న చెక్క బెంచీపై కూలబడ్డాను. కాస్సేపు నాకు పేర్లు తెలియని పచ్చటి చెట్లను చూసి బ్యాగులో నుండి ఒక పుస్తకం బయటకు తీశాను. నాకున్న రెండు వ్యసనాల్లో పుస్తకాలు చదవడం ఒకటి. నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతానని తెలిసిన కొంతమంది ‘నీలో ప్రాక్టికాలిటీ లేదు. అంతా థియరీయే!’ అని విమర్శించారు. వాళ్లని నేను పట్టించుకోలేదు.నేను పుస్తకాలు చదవడం ఎలా, ఎందుకు మొదలుపెట్టానో మీకు తెలుసా? మీరు ప్రేమిం చిన అమ్మాయి స్ర్టోక్‌ ఇచ్చి మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని పెళ్లిచేసుకొని అమెరికాలో సెటిలయితే మీకెలా వుంటుంది? నాకూ అలా వుండే పుస్తకం చదవడం ప్రారంభించాను.నేను ప్రేమిం చిన అమ్మాయి నన్ను వదిలి అమెరికా వెళ్లిందని పాఠకులు నాపై జాలి చూపించనక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం నేను సంతోషంగానే వున్నాను!! దేవతలాంటి మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను.!!

నేను కోతలు కోస్తున్నానుకుంటున్నారా? నా మంగతాయారును చూస్తే మీరూ ‘దేవత’ అంటారు!బొద్దుగా వున్న బుజ్జిగాడి బుగ్గపై దిష్టిచుక్కలా మంగలో కూడా నాకో విషయం నచ్చలేదు. పోలిక సరిగ్గా లేదా?ప్చ్‌...సరిపెట్టుకోండి! మంగ అమ్మ కొంగు చాటు బిడ్డ. తిరుపతిలో తిష్టవేసి రెండు నెలలు అయింది. గోవాకు తీసుకు వద్దామని వెళితే మరో నెల తర్వాత వస్తానంది.మంగ ఈసారి గోవా వస్తే ఎపడుపడితే అపడు తిరుపతి వెళ్లకుండా వుండడానికి గజదొంగ రాజుగారి నిధి దొంగిలించడానికి ఎలా వ్యూహం పన్నుతారో అలా పకడ్బందిగా వ్యూహం పన్నాను. మంగని డిగ్రీ కాలేజీలో చేర్పిస్తాను. మనదేశంలా ఎపడూ డిఫిసిట్‌లో వుండే నా బడ్జెట్‌లో మంగ కాలేజీ ఫీజుకు కూడా ఫండ్స్‌ అలాట్‌ చేస్తాను.శలభాల గూర్చి చెబుతూ ఏనుగును వర్ణించినట్లు నేను ఎక్కడో మొదలుపెట్టి మరెక్కడికో వెళ్లిపోయాను. స్వామి వివేకానంద గారు రచించిన పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నేను కూర్చున్న బెంచీ చివరన మరో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతని వయస్సు దాదాపు నలభై సంవత్సరాలు వుండవచ్చు. అటు పొట్టి, ఇటు పొడవు కాకుండా మధ్యలో వున్నాడు. మనిషి ఎర్రగా, బుర్రగా వున్నాడు. రింగుల జుట్టు, అందంగా దువ్వుకొని వున్న క్రాఫు. అతని చేతిలో చిన్న ప్లాస్టిక్‌ కవర్‌ వుంది. అందులో నుండి ఇంగ్లీష్‌ వార్తా పత్రిక బయటకి తీసి చదువుకోసాగారు.