‘ఇదిగో వింటున్నారా... నిన్న కొత్తపేటలో ఓ ముసలావిడను ఎవరో గొంతుపిసికి చంపేశారట. ఆమె భర్త ఉద్యోగానికి వెళ్లినపుడు ఇదిజరిగిందట’ సీతారామయ్యకు కాఫీ ఇస్తూ చెప్పింది జానకమ్మ.‘పోనీలేవే ఇకనైనా ఆ ముసలాడు ప్రశాంతంగా బతుకుతాడు’ కొంటెగా అన్నాడు సీతారామయ్య.‘ఆ పరాచికాలే వద్దనేది. అసలు నేను చెప్పినదేమైనా గుర్తుందా...’ అందామె.‘ఆ అదెలా మర్చిపోతానే... ఇవ్వాళ సాయంత్రం మంచి నేవళంగా వున్న వంకాయలు తెస్తే రేపు నాకిష్టమైన గుత్తొంకాయ చేస్తానని నిన్న చెప్పావుగా’అన్నాడు సీతారామయ్య.‘అయ్యో రాత... తిండి తప్ప మనకు ఇంకేం గుర్తుంటుందిలే. అయినా నన్ననాలి. మీరిట్లా డొంకతిరుగుడుగా మాట్లాడతారని తెలిసీ మీతో నాగోడు చెప్పుకుంటున్నానుగా’ కుర్చీలోనుంచి లేచి వంటింట్లోకి వెళ్లడానికి సిద్దమైంది జానకమ్మ.‘అదికాదు జానకీ... ఇల్లు అద్దెకివ్వడానికి మనకేం అవసరమే.. వచ్చేవాళ్లు ఎలాంటి వాళ్లు వస్తారో... వాళ్లతో లేని పోని పేచీలు. ఇవన్నీ మనకు ఈ వయసులో ఎందుకు చెప్పు. మనం అద్దె ఇంట్లో ఎన్ని అగచాట్లు పడ్డామో మర్చి పోయావా... ఇకనైనా ప్రశాంతంగా బ్రతుకుదాం’ అనునయంగా అన్నాడు సీతారామయ్య.‘ఆ.. ఆ... అప్పుడు మనం ఇంటి ఓనర్ల వల్ల ఇబ్బందులు పడ్డాం. మనమేమీ ఇబ్బంది పెట్టలేదుగా... మనం అట్లా ఇబ్బంది పెట్టకపోతే చాలు.. అయినా వున్న ఇద్దరు పిల్లల్నూ ఆ పాడు అమెరికా లాక్కుపోయింది. మీరేమో దుకాణం అంటూ పొద్దున వెళ్లి రాత్రికి తిరిగొస్తారు. 

లంకంత ఇంట్లో బిక్కు బిక్కుమంటూ వుండాల్సింది నేనే... నేను పడుతున్న అవస్థలేవీ మీకు పట్టనే పట్టవు. ఆ మూలనున్న మూడుగదులూ ఎవరికైనా ఇస్తే నాక్కాస్తా కాలక్షేపమంతే... అంతేగానీ అద్దెకోసమేమీ కాదు’ కోపంగా అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది జానకమ్మ.పడక్కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు సీతారామయ్య. ‘జానకి చెప్పిందీ నిజమే.. ఆమెకేం తోస్తుంది పాపం. అద్దెకిస్తే పోయె. నచ్చకపోతే ఖాళీ చేయమని చెపితే సరిపోతుంది’. ఆ మూడు గదుల్నీ అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడాయన.అనుకున్నదే తడవుగా ఓ అట్టముక్క మీద ‘టు లెట్‌’ అని రాయడం మొద లెట్టాడు.ఏదో పనిపైన వంటింటినుంచి బయటకు వచ్చిన జానకమ్మ ఈ దృశ్యం చూసింది. ఆమెలో సంబరం మొదలైంది.‘ఏమండీ ఎక్కువమంది వున్న వాళ్లకు ఇద్దామండీ. పిల్లలుంటే మరీ మంచిది. ఆడుకోవడానికి వాళ్లకు మన ఆవరణ అంతా సరిపోతుంది. సందడిగా కూడా వుంటుంది. కాస్త నా వయసువాళ్లూ వుంటే కబుర్లాడుకోవచ్చు’ పురాణం మొదలెట్టింది.‘అబ్బా రానివ్వవే.. ఎవరికి పడితే వాళ్లకు ఇల్లు ఇస్తే ఇల్లు గుల్లవుతుంది. ఎవరో ఎలాంటివారో చూసుకుని మరీ ఇవ్వాలి. అంతేగానీ వచ్చిన వాళ్లకంతా ఇల్లిస్తామని మాత్రం చెప్పద్దు’ హెచ్చరించాడాయన.