ఇలా పోస్టుమన్‌ కవరు యివ్వడం ఏమిటి. దాని పొట్టచించి కాగితం పైకి లాగి చదవడం మొదలెట్టాడు రమణమూర్తి-‘‘ప్రియమయిన... శ్రీవారికి... ప్రేమతో వ్రాయుముచ్చట్లు...’’ ఈ ముక్కలు చదివి ఎంత వేగిరం కవరు విప్పాడో... అంతవేగిరం ఆ కాగితాన్ని ఆ చిరిగిన కవర్లో పెట్టేసి ఎడ్రసు చూశాడు.... అతనిపేరే?.... కాని అతనికలాటి వుత్తరం ఎవరు వ్రాస్తారు?... అతనిపేరు గలవాడే యింకెవడయినా వుంటే అతనిదవాలి... ఎంతపని జరిగిపోయింది? అతనిదే అనుకుని పోస్టుమన్‌ యిచ్చేశాడు. చూసుకోకుండా అతనూ చింపేశాడు... ఇప్పుడెలా? అతకడానికి వీల్లేకుండా చిరిగి పోయిందాయె... వాలకం చూస్తే పాపం!... ఏ కొత్త పెళ్ళామో! తన భర్తకి వ్రాసిన వుత్తరంలా వుంది.పోనీ ఆ ఆసామిని కాస్త వెతికి అతని చేతిలో పెడితే ఏమనుకుంటాడో? పరాయివాడి వుత్తరం చూసుకోకుండా చింపి చదివినవాడిని ఏమన్న మనిషివయ్యా? అని అడిగేస్తే.. పుణ్యానికివెళితే పాపం వచ్చినట్లవుతుంది... పొరపాటయింది - నీ తోడు నే చదువలేదు - అని ఒట్టు వేసుకున్నా నమ్ముతాడా?ఏం చేయడమా అని ఆలోచించుకుంటూ ఆ కవర్ని తిరిగి పోస్టుమన్‌కే యిచ్చేదాం అన్న వుద్దేశ్యంతో జేబులో పెట్టుకున్నాడు రమణమూర్తి. కాని జేబులో, ఆ వుత్తరం... ఏదో చెబుతున్నట్టు అనిపించింది. ఆ ఒక్క వాక్యమే అంత రుచిగా వుందికదా యింక ఆ వుత్తరం అంతా చదివితే ఎలా వుంటుందో? అందులోనూ ఒక చిన్నది తన ప్రియుడికి వ్రాసిన ఉత్తర విశేషం! రమణమూర్తి బుద్ధి చలించింది. అదేమిటో చదవాలని అతృత లావయింది. పరాయి ఉత్తరం. అందులోను భార్యాభర్తలు వ్రాసుకున్న వుత్తరం చదువుతావా? చదవచ్చునా? అని మనసు ఒక మూలనుండి పీడిస్తూనే వుంది. కొంతవరకు నిగ్రహించుకున్నాడు.

 ఏమవుతే అదేకాని, ఆ ఆసామిని వెతికి యిచ్చేద్దామని బయలుదేరి ఆ పరిసరాల్లో వాకబుచేసి లేడనిపించుకొని వచ్చేశాడు.ఈ మాత్రం దానికోసం కాళ్ళు పీకేట్టు ఎందుకు పోనిస్తూ తిరుగుతావు? ఈ ఉత్తరం అందకపోతే చూసిచూసి మరో వుత్తరం వ్రాసుకుంటుంది. ఏం కొంప ములిగిపోయింది? పద ఇంటికి అని అనుకొని వచ్చేస్తూంటే... జేబు బరువెక్కిపోయింది. మరి వుత్తరాన్ని జేబులో వుంచలేకపోయాడు.పైకి తీశాడు. ఆ చినిగిన కవర్లోంచి ఆడదాని అందమయిన అక్షరాలు జలజలా క్రిందికి రాలిపోతున్నాయనిపించింది. ఆ వుత్తరం క్రిందపడి పోకుండా పట్టుకొన్నాడు... మళ్ళీ.‘‘ప్రియమయిన శ్రీవారికి... ఆ వాక్యం అవుపించింది. ఆహా, ఏమీ అదృష్టవంతుడా ప్రియుడు అనుకున్నాడు’’. ఇంకా ఏం వ్రాసిందో, చూద్దూ కొంప ములిగిపోయిందేమీలేదు. ఆ మాత్రంలో నీదనుకొని కవరు చింపేశావు... అందులో విచిత్రం వుంది. చూస్తే ఏంతప్పు? కావాలని చూశావా ఏం? కాదూపోదూ అంటే ఎవరితోనూ చెప్పకు ఆ రహస్యం. పోతే ఈ వుత్తరం ఎలాగూ ఆ వ్యక్తికి చేరలేదు కదా! నువ్వు చూడకపోతే మాత్రం ఆ విషయాలు వాడికి తెలిసేడిచాయా ఏం?.... చూడు... ఫరవాలేదు!’’ అని వెధవకోర్కె తినేస్తుంటే... మెల్లిగా ఒణుకుతున్న చేతులతో ఎవరూ చూకుండా చదవడం మొదలెట్టాడు. రమణమూర్తి.