సముద్రం ఒడ్డునుంచీ నింగివంక చూస్తే అంతా నీలవర్ణ వైభవమే. ఆకాశం, నేల కలిసిన అర్ధనారీతత్వం. మధ్యలో ఓ మెరుపు మెరిస్తే విశాలమైన కాన్వాస్‌పై అదృశ్య చిత్రకారుడెవ్వరో వెలుగుల కుంచెతో దిద్దుతున్న ఫీలింగ్‌. ఇసుకతిన్నెలమీద కూర్చుని సముద్రం మీదుగా వచ్చే నీటిగాలి స్పర్శను అనుభూతిస్తూ ఆకాశం నేలకు అతి దగ్గరయ్యే ఆ చోటునుంచీ చూపు తిప్పకుండా ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు కిషోర్‌.అంతెత్తులో ఉన్న ఆ నింగిని అలా చూసినపుడల్లా... ఎక్కడో కిందనున్న నేలను అది మృదువుగా తాకి చుంబిస్తున్నట్లనిపిస్తుంది. ఆ అపురూప కలయికలో అరుణారుణ రాగాలు స్వరాలు సవరించుకుని అమర గాంధర్వాన్ని వినిపిస్తుంటే అలౌకికానందానుభూతితో పులకింతలకు లోనవుతున్నాడు. కలిసున్నట్లు కనిపించే ఆ నింగీనేల సహజీవన సౌందర్య రహస్యాన్ని విప్పి చెప్తున్నట్లుంది.అదే సమయంలో కిషోర్‌లో చిన్న డౌట్‌. నిజంగా, నింగీనేలా కలిసున్నాయా? లేక, విడివిడిగా ఉంటూ కలిసున్న భ్రాంతి కలిగిస్తున్నాయా? ఎంత తర్కించుకున్నా కిషోర్‌కి జవాబు తట్టడం లేదు.విలీనంలో నింగీనేలా నీలవర్ణంతో ఒకటిగా కనిపిస్తూ... తాము ఒకటనే భ్రాంతి కలిగిస్తుండడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడతను. అలా ఆ రెండింటినీ కళ్లార్పకుండా చూస్తున్నపుడే... అతనికి హరిత గుర్తొస్తుంది.హరిత- అందనంత ఎత్తున అచ్చం అంబరంలా.ఆమె పక్కన తాను... చేతులెంత సాచినా అందుకోలేని అట్టడుగు నేలలా...బీచ్‌లో ఇసుక తిన్నెలమీద కూర్చుని... అలలతో పోటెత్తుతున్న నీలి సంద్రాన్ని చూస్తూ ఇపుడూ హరిత గురించే ఆలోచిస్తున్నాడు కిషోర్‌. 

ఎందుకో తెలీదుగానీ ఒక్కసారి అతని కళ్లు చెమర్చాయి. ఆ చెమర్చిన కళ్లవాకిళ్లలో పోటెత్తుతున్న కడలి కెరటాలు చెక్కిలి చెలియలికట్ట దాటేందుకు యత్నిస్తున్నాయి.‘హరిత’-అతని ప్రణవం, ప్రణయం, సర్వం.అతనెపుడూ పఠించే వేద మంత్రం.కిషోర్‌ అర్ధభాగం హరిత.సమాజం దృష్టిలో వారిద్దరూ దంపతులు.అయితే, తలుపులు మూసిన ఏకాంతసౌధంలో-చేరువలోనే ఉన్నా చేరువకాని దూరం.కలుసుకోవాలనుకున్నా కలవలేని భారం.‘ఎవరికివారే... యమునాతీరే!’పెళ్లంటే గాలివానలో పూరిగుడిసెలాంటిదని... లోనున్నవాళ్లు వెలుపలికీ, వెలుపలున్నవాళ్లు లోనికీ రావాలనుకుంటారనీ... ఎక్కడో చదివింది ఇపుడు గుర్తొచ్చింది కిషోర్‌కి. తానూ అంతే... పూరిగుడెసెలో తలదాచుకుందామని లోనికి వెళ్లి బయటకు రాలేని పంజరంలో ఇరుక్కున్నాడు. హరితతో పరిచయం, స్నేహం, ప్రణయం, పరిణయం... ఒక్కొక్కటీ కిషోర్‌కి గుర్తొస్తున్నాయ.పెళ్లంటే హరితలాటి అందమైన కలే. ఆ కలలో... కష్టంలో, సుఖంలో, కలతల్లో, కన్నీళ్లతో చేదోడువాదోడుగా, సగం సగంగా... అర్ధభాగం నిలుస్తుందని ఎంతగానో ఉవ్విళ్ళూరాడు.కన్నీరై తడిసినపుడు చేరుమాలై, ఆనందమై ఎగిసినపుడు చిర్నవ్వయి అలరారుతుందనీ ఊహించాడు. అలసిపొలసి ఇంటికి వచ్చిన వేళ తన చీరకొంగుతో తడి స్వేదాన్ని తుడుస్తుందని భావించాడు.అంతేకాదు, సాయం సమయ మసక చీకట్లో... పెరట్లో చుట్టుముట్టే సన్నజాజి పరిమళాల మాటున ఎదచాటు గుసగుసలు చెప్తుందని, అర్ధరాత్రి ఆదమరిచిన నిదురలో అక్కున చేర్చుకుని చీరకొంగులో చిన్నికృష్ణుడిలా దాచేస్తుందని... ఎన్ని అందమైన కలల గూళ్లు కట్టుకున్నాడో..?