‘‘ఎవరికివాళ్లు కాదంటే, పాపం ఆ అమ్మాయి ఏమైపోతుంది?’’ ... ఆ మాట అన్నది ఎవరో కాదు - మా పురుషోత్తం బాబాయి.మా బంధువర్గంలో కల్లా మా బాబాయి పెద్ద తలకాయ. నలుగురికి చెప్పగలిగిన వాడు. బాగా చదువుకున్నవాడు. పెద్దస్థాయి మనిషి. స్థితిపరుడు. ఆయన అంటే మా బంధువులు అందరికీ గౌరవం. ఆయన మాట కందరూ విలువ యిస్తారు.ఇకపోతే, ‘పాపంఆ అమ్మాయి’ అన్న అమ్మాయిపేరు మంగమ్మ.నిండా పందొమ్మిదేళ్లు కూడా లేవు. ఏడ్చీఏడ్చి కళ్లు వుబ్బిపోయి వున్నాయి. జుట్టు రేగిపోయి వుంది. మూర్తీభవించిన శోకదేవతలాగా, వంటింటి తలుపు గుమ్మాని కానుకొని నిలబడి వుంది. చౌకరకం చీటిగుడ్డ లంగావోణీలో సాదాసీదాగా వుంది. పల్లెటూళ్లో పెరగడం వల్ల కాస్త మోటుగా వుందిగానీ, చక్కటి కనుముక్కు తీరు. చామనచాయే అయినా, అందగత్తే అని చెప్పాలి.మంగమ్మ చిన్నప్పుడే తల్లి పోయింది. మేనమామ ఇంట్లో ఆ పల్లెటూర్లోనే పెరిగింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆడమనిషినొకదాన్ని పెట్టుకొని బాపట్లలో వుంటున్నాడు. చిన్నాచితకా వ్యాపారాలు చేశాడు గానీ, దేంట్లోనూ కల్సిరాలేదు. పైగా తాగుడు అలవాటొకటుంది. 

హార్ట్‌ఎటాక్‌ వచ్చి పది రోజుల క్రితం చనిపోయాడు. ఇవ్వాళ పదకొండో రోజు. పెద్దదినం. తండ్రి కర్మాంతరాలకు బంధువులందరూ వచ్చారు.ఆ సందర్భంలోనే దగ్గరి బంధువులందరి ముందూ మంగమ్మ తన మనస్సులోని మాట మెల్లగా బయటపెట్టింది.తనకు చదువంటే యిష్టం. మేనమామల భార్యలకు మంగమ్మ చదవటం ఇష్టం లేదు. వాళ్లది వ్యవసాయదారుల కుటుంబం. ఇంట్లో మగా, ఆడా అందరూ పొలం పనిపాట్లు చేయవల్సిందే. మంగమ్మకు మాత్రం పొలం పన్లు చేయడం యిష్టం లేదు. ఎంతవరకూ చదువుకోవాలనే. అత్తలకిష్టం లేకపోయినా, ఎలాగో కష్టపడి ప్రక్క వూరి మండలి హైస్కూల్లో టెన్త్‌వరకు చదివింది. కాలేజీ చదువు చదవాలని వుంది. బాపట్లలోనో, ఒంగోల్లోనో హాస్టల్‌లో వుంటూ కాలేజీలో చదువుకోవాలని మంగమ్మ అంటుంది. అది ఆమె అత్తలకు సుతరాం యిష్టం లేదు. ఆ పల్లెటూళ్లోనే ఎవడో ఒకడ్ని చూచి ముడిపెట్టేయాలని వాళ్ల ఆలోచన. మేనమామలు వాజమ్మలు. పెళ్లాల నోళ్లకు దడిచి ఏం మాట్టాడ్డం లేదు.