‘‘మా అమ్మాయికి విడాకులిప్పించండి’’ అనే సరికి అక్కడున్న లాయర్‌ రంజని ఉలిక్కిపడింది.ఎవరయినా కన్నబిడ్డలు విడాకుల దాకా రానివ్వడానికి తల్లులు అంగీకరించరు కదా ఇదేమిటి ఈవిడ ఏకంగా నా బిడ్డకు విడాకులిప్పించమంటోంది అనుకుంది రంజని. ఎంత ఆధునికంలో ఉన్నా మనసు మనసే కదా మరి! ఒక్కసారిగా రంజనికి తన అమ్మ గుర్తుకొచ్చింది.‘‘మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా’’ అంది లాయర్‌ రంజని.‘‘చెప్పండి కానీ మీ అమ్మాయికి విడాకులు ఎందుకిప్పిస్తున్నారు? ఆడపిల్లకు భర్తే కదా దైవం. కాస్త సర్దిచెప్పి సంసారాన్ని సరిదిద్దండి! అని తప్ప ఇంకేమయినా చెప్పండి’’ అంది దురుసుగా అరుణమ్మ కోపంతో...ఇక చెప్పడానికి ఏముంటుంది లాయర్‌కు మాత్రం? ‘‘అలాగే మీరు ఇంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారంటే కారణమేదో బలంగానే ఉంటుందని నేను ఊహించగలను. కానీ నేను లాయర్‌ ను కదా! పైగా మీ తరపు నుంచి వాదించాలి కూడా! కనుక కారణం చెబితే...’’ అంటూ ఆగింది. మళ్ళీ దురుసుగా ఏమంటుందో అని...రంజని.‘‘చెబుతాను అందుకు భయమేముంది? మా అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, నా అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇద్దరికీ సమానంగా జీతాలు కూడా. నా కూతురికి డెబ్భైవేలు అయితే, అల్లుడిది ఇంకా అరవై వేలే! అంటే ఒక విధంగా నా కూతురు కంటే అల్లుడికే పదివేలు తక్కువన్నమాట. ఇద్దరూ ఉదయమనగా ఉద్యోగానికి వెళ్ళి రాత్రి ఏ తొమ్మిదింటికో ఇల్లు చేరుతారు. రాగానే ఏది వీలయితే అది తింటారు. లేదా బయట నుండే తినేసి వస్తారు. వారికేం లోటు లేదు కదా!’’ అది ఒకసారి తన మెడలో గొలుసును సరిచేసుకుంటూ దర్పంగా. హాండ్‌బ్యాగ్‌ లోంచి అద్దం తీసి ఒకసారి తేరిపార చూసుకుంటూ...అది గమనిస్తున్న రంజని ‘‘మరి విడిపోవడానికి ఏముంది..బాగానే ఉన్నారుగా’’ అంది ఆమె కేసి చూస్తూ‘‘ఉండమ్మా! నీ కంత తొందరయితే ఎలాగు? నాకా ఏసీ అలవాటు. చెమట పట్టింది. మేకప్‌ చెదిరిపోతుందేమోననే కంగారు. 

మీ లాయర్లకు అన్నీ తొందరే! ఏదో చేసి వారిద్దరినీ కలిపేయాలని’’ అంది.ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయింది రంజని.‘‘తర్వాత ఒకరోజు శనివారం త్వరగా ఇంటికి రావడంతో వంట చేసింది మా అమ్మాయి. పప్పు, కూర, ఇంకా వారికిష్టమయినవేవో వండుకున్నారు. కాస్తంత మిగిలితే మా అమ్మాయి అంతంత నూనె వేసి వండాక పారేస్తామా అనుకుని అవన్నీ ఫ్రిజ్‌ లో దాచింది. తెల్లవారేసరికి ఆదివారం. ఆలస్యంగానే లేచారట. ఇక ఇద్దరూ లేచేసరికి పదకొండు అయ్యేసరికి కూడా మా అమ్మాయే లేచి అన్నం వండిందట. రాత్రివి ఉన్నవి తిందాములే అని. తీరా రాత్రివే మళ్ళీ పెడతావా అని కోప్పడ్డాడట. ఏమ్మా నాకు తెలియక అడుగుతాను. అల్లుడు కంటే పదివేలు ఎక్కువే సంపాదిస్తుంది నా కూతురు. అయినా వంట చేస్తోంది. అప్పుడప్పుడు పని పిల్ల రాకుంటే ఇల్లు తుడుస్తోంది. అంట్లు, బట్టలు అన్నీ తనే చేస్తోంది. ఎందుకు చేయాలమ్మా ఇవన్నీ.. అల్లుడుకంటే అనేలోగానే కాస్త ఆపి...