నేను, పాలేరు రామారావు, సోంపల్లి సూరి, రామబ్రహ్మం.. మేం దొంగబీడీలు కాల్చడంలో ఒక జట్టు. మాదీ ఒకే క్లాసు. నాకు బీడీలు కాల్చేది ఎలా అలవాటు అయ్యిందో చెబుతా.మా అమ్మ పొయ్యిమీద ఏ కూరో, అన్నమో పెట్టి , ఆపని ఈపని చేసుకుంటా ‘‘ఒరేయ్‌ మంట బయటకు వచ్చినట్టుంది. పుల్లలు ఎగదోసిరారా’’ అనేది.పొయ్యింటిలోకి వెళ్ళి పుల్లలు ఎగదోసి చూద్దునుగదా- మిరప పుల్లలు కాలతావుంటే కొన్నింటికి వెనక నుంచి పొగ రైలింజన్‌ మాదిరిగా బయటకు వస్తా వుండేది. నేను గబుక్కున ఒక పుల్లతీసి నోట్లో పెట్టుకుని రెండు పీల్పులు పీల్చేవాణ్ణి. మంటగా కారంగా వుండేది. ఇట్టా అపడపడు చేస్తావుండేవాణ్ణి. ఎపడూ మిరపపుల్లలేనా, బీడీకాల్చితే ఎట్టావుంటదో అనుకున్నా. అదిమా కిట్టయ్య మావయ్య ద్వారాతీరింది.మా నాయనమ్మకు ఈయన తమ్ముడు. మాయటపూట ఆరేడయితే మా అత్త, మాకిట్టయ్యమావ మా నాయనమ్మ దగ్గరకు వచ్చి ఆ కబుర్లూ ఈకబుర్లూ చెపకుంటూ మధ్యలో ‘‘ఒరే పొయ్యిలో నిపందేమో చూసి బీడీ కాల్చుకురారా’’ అనేవాడు. జేబులో బీడీలు వుండేయిగని, అగ్గిపెట్టి ఎపడూ పెట్టేవాడుగాదు.నేను పొయ్యింటిలోకి వెళ్ళి నిపలో బీడీని కాల్చి, బీడీకి తడి అంటకుండా రెండుమూడుదమ్ములు లాగి, మామావ కి తెచ్చి ఇచ్చేవాణ్ణి.‘‘ఏందిరా బీడీ కాల్చుకు రమ్మంటే సొగంకాల్చుకు వచ్చావ్‌’’ అంటూ లబలబలాడేవాడు పాపం.

నేను బీడీ కాల్చాననే అనుమానం మాత్రంరాలా. రెండుమూడుసార్లు ఇట్టా చేసాక బీడీ మొత్తం కాల్చానిపించింది. ఈ సంగతి రాముడికి సూరికి, బెమ్మానికి చెప్పా . వాళ్లుకూడా మిరప పుల్లలు తాగే బాపతే.మాలో ఎవడిదగ్గరా నయాపైసా వుండేది కాదు. మేమంతా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు జేబులో పట్టినన్ని బియ్యం పోసుకొచ్చేవాళ్ళం. వాటినన్నిం టిని కలిపి కొట్టులో అమ్మి, ఒక అగ్గిపెట్టె, మిగతా మొత్తానికి బావుటా బీడీలు తీసుకునేవాళ్ళం. అవితీసుకుని మావూరి చిన్నాగయ్యగారి రెండు వాముల సందులో దూరి మొత్తం బీడీలు కాల్చాక గాని బయటకు వచ్చే వాళ్లంకాదు. మావూరి చిన్నాగయ్యకు ఎనభై ఎకరాలదాకా పొలం వుంది. ఆయన కొట్టంలో పాతిక ముప్పైదాకా ఆవులు, ఎద్దులు, బర్రెలు వుండేవి. వాటి మేతకోసం కొండంత రెండు వాములు వేసేవాడు. ఆవాముల సందులో దూరామంటే నరమానవుడికి కనపడం.ఒకసారి మా నాన్న జేబులో బీడీ కొట్టేసి మా కొట్టందగ్గర వున్న పంపుదిన్నెను చాటుచేసికుని బీడీ కాలుత్తా వున్నా.ఎట్టచూసేడో ఏమో, నాగేశ్వరావు మావ ఒక్క కేకేసాడు ‘‘ఒరేయ్‌ విష్ణాయ్‌ బీడీకాలుత్తున్నావా.. మీ నాన్నకు చెబుతానుండూ’’ అనంగానే నాగుండెగుభిక్కుమంది.