రోట్లోవేసి దంచితేగానీ మామిడికాయ తొక్కుడు పచ్చడికి రుచిరాదు’’ అని నా కర్మానికి నోరుజారి అన్నాను.ఇకంతే! ఇంట్లోని పిల్లబొందలందరూ రోలంటే ఏంటీ, రోకలంటే ఏంటీ అని సవాలక్ష ప్రశ్నలు వేసి, రకరకాల వ్యాఖ్యానాలు చేసి నన్ను ఎగతాళి పట్టించారు.పాతికేళ్ళు వచ్చినా పెళ్ళీపెటాకులూ వద్దని సాఫ్ట్‌వేర్‌ వెలగబెట్టుతున్న నా చిన్నకూతురు ఈ పిల్ల గ్యాంగుకంతా గ్యాంగులీడరు.‘‘యు డోంట్‌ నో రోల్‌? రియల్లీ? రోల్‌ మీన్స్‌ రాక్‌ అండ్‌ రోల్‌... రోల్‌ రోల్‌...’’ అని వూగడం మొదలుపెట్టింది.దాంతో మా పెద్దోడి చిన్నకూతురూ, మా చిన్నోడి పెద్దకూతురూ, వీడియో గేమ్స్‌ ఆడుకోవటానికొచ్చిన కాలనీలోని పిల్లలందరూ మా సాఫ్ట్‌వేర్‌దాన్తో వూగటం మొదలుపెట్టారు.నాకు కోపం ముంచుకొచ్చింది. నిజంగానే యిపడు ఆ రోలూ రోకలీ వుంటేనా వీళ్ళందర్నీ ఆ రోట్లో వేసి కసితీరా దంచివుండేదాన్ని.నాకేడ్పు వచ్చినంతపనయింది. చేతిలో పని అవతల పారేసి టెర్రస్‌లోకి వచ్చి, ఒక కుర్చీ లాక్కుని కూలబడ్డాను.వీళ్ల మొగాలు మండా, ఈ కాలం వాళ్లకు రోలంటే తెలియదు. రోకలంటే తెలియదు. వీళ్లకే కాదు. వీళ్ల మమ్మీలక్కూడా తెలియదు.మొన్నగాక మొన్న మా చిన్నకోడలు, ‘రోలంటే ఏంటి అత్తయ్యగారూ?’’ దీర్ఘంతీస్తూ అడిగింది.నాకేడ్వాలో నవ్వాలో తెలియలేదపడు. రోళ్లూ రోకళ్ల రోజులు పోయాయి. ఇపడన్నీ మిక్సీలు, గ్రయిండర్లూ వచ్చిపడ్డాయి. రోలంటే వీళ్లకెట్లా తెలుస్తుంది పాపం!నాకెందుకో తెలియదుగానీ చిన్నప్పట్నుంచీ రోలంటే ఒకవిధమైన అభిమానమూ, అనుబంధమున్నూ!మా పుట్టింట్లో నా చిన్నపడు మా యింటి గోడకు ఒక పెద్ద చిత్రపఠం వుండేది.

 అల్లరి చిన్నికృష్ణయ్యను వాళ్లమ్మ యశోదమ్మ రోలుకు కట్టేసిన చిత్రమది. చిత్రం కాకపోతే, ఆ జగన్నాటక సూత్రధార్ని రోటికేసి బంధించటమేంటీ? ఆ చిన్నిబాలుడు దాన్ని లాక్కుంటూ వెళ్లి, వాళ్ల దొడ్లోని పెనువృక్షాలను పడేయటమేమిటీ? వృక్ష రూపంలో వున్న శాపగ్రస్తులకు శాప విమోచనం కలిగించటమేమిటీ?నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యం. మరెంత నిగూఢమైన సన్నివేశం!శ్రీకృష్ణభగవానుడ్ని కట్టేసిన ఆ రోలును చూస్తూ నాలో నేను నవ్వుకునేదాన్ని.‘‘ఆ ఫోటోలో ఏం వుందే, ఎపడూ దాన్నే అంత యిదిగా చూస్తుంటావు?’’ అనేది మా నానమ్మ.అట్లా మొదట్నుంచీ రోలంటే ఒకవిధమైన యిష్టం ఏర్పడింది. అందులోనూ మా దొడ్లోని రోలంటే మరీ యిష్టం.మా యింటి రోలుకూ, నాకూ ఏదో చిత్రమైన అనుబంధం వుంది. ఆ రోలు ‘రోల్‌’ నా జీవితంలో ఎంతో వుంది.మా యింటి రోలు ఏం చిన్నదీ చితకదీ కాదు. ఇంత ఎత్తున వుండేది. దాదాపు మూడూ, మూడున్నర అడుగులు వుండేది. గుండ్రంగా, గుమ్మటంగా వుండేది.అది తెల్లరాయి రోలు. ఎండలో తళతళా మెరుస్తూ అందంగా వుండేది. మా బాదంచెట్టు ఆకుల నీడలు దానిమీద కదుల్తున్నపడు మరీ అందంగా వుండేది.