మా తాతకి ఎనభైయ్యేళ్లు నిండాయి. మా తాత శరీర భాగల్లో బాగా చురుగ్గా వుండే ది నోరే... శరీరంలో అన్ని భాగాలు పని చెయ్యమని మొండికేసినా మాతాత నోటికి దడిసి ఏదో అలా లాక్కొస్తున్నాయి ముసలాయిన్ని. ఆయన ఐఎయస్‌ ఉద్యోగం కూడా నోరు మరింత పదునెక్కడానికి దోహదపడింది. తాత పేరు జోగయ్య... ఐఎయస్‌ అధికారి కాగానే జోగిరావు అనిపేరు మార్చుకున్నాడు. ఆపేరును మరింత షార్ట్‌ కట్‌ చేసి ‘‘జోగా, ఐఎయస్‌’’ అని నేమ్‌ బోర్డు మీద రాయించుకున్నాడు. వారం రోజుల్నుంచి మంచం మీద నుంచి లేవడంలేదు. మంచానికి అతుక్కుపోయి వుండే నాన్న తాతగారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాడు. ‘‘డాక్టరుగారు ఏమన్నారు తాతా?’’ హాస్పిటల్‌ నుంచి తాతగారు ఇంటికి వొచ్చేక అడిగాను. ‘‘మరో మూడు వారాల కంటే బతకనురా...కిడ్నీలు పనిచెయ్యడం లేదు ఎడమ కాలులోని ఆర్టరీస్‌లో బ్లడ్‌ క్లాట్‌ అయ్యింది... గాంగ్రీన్‌ వొచ్చే ప్రమాదం వుంది..కాలు తీసేస్తారేమో! అయిన వాళ్లందరికి ఫోను చెయ్యి.. అందరూ వచ్చి చూసివెళ్తారు... నా అంతిమ యాత్ర సింపుల్‌గా వుండాలి రా... ఆర్భాటం వద్దు... నవ్వుతూ పంపించండి...పేపర్లో సంతాప ప్రకటనలు వొద్దు... నాట్‌ ఎ స్టోన్‌ షుడ్‌ టెల్‌ ఐయామ్‌ బర్రీడ్‌.. ఐషుడ్‌ గో అన్‌ లామెంటెడ్‌’’ అన్నాడు తాత.

తాత చనిపోతాడనే ఊహే భరించలేకపోయాను. ‘‘నీకేం కాదు తాతా! మూడేళ్ళ క్రిందట డాక్టర్లు ఇలాగే అన్నారు... వారం రోజులకంటే బ్రతకవని చెప్పారు... అయినా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ బాగానే చేస్తున్నావ్‌ తాతా!’’ అన్నాను తాత చెయ్యి నిమురుతూ.‘‘అదికాదురా బాబు! నిజంగా నేను చనిపోతాన నుకున్నావా? అందరినీ ఏడిపించిగాని వెళ్ళను... నేను చనిపోయే స్థితిలో వున్నానంటే అందరిలో సానుభూతి పెరుగుతుంది... అందరూ జాలిగా నావైపు చూస్తుంటే నాకు నవ్వువొస్తుంది.. నాకు ఇష్టమైన వంటకాలు, పుస్తకాలు తెచ్చియిస్తారు..’’ అన్నాడాయననా మనస్సు మాత్రం స్థిమిత పడలేదు. తాత చివరిరోజులు తలచుకునేసరికి దుఃఖం పొర్లుకు వొచ్చింది.‘‘నవ్వుతూ బ్రతాకాలిరా వెధవాయ్‌ చివరిక్షణం వరకూ... నేనన్నానని నిజంగా పేపరు ప్రకటన ఇవ్వకుండా వుండేవు...రాష్ట్రం అంతా నేను చనిపో యానని తెలియాలంటే ప్రకటన ఇవ్వాల్సిందే కదా... మా తాత గారికి ఇటువంటివి ఇష్టం లేదు అయినా ఇస్తున్నాను- అని పేపర్లో ప్రకటించాలి’’ అన్నాడు మాతాత నవ్వుతూ.డాక్టరూ వచ్చాడు చెకప్‌ చెయ్యడానికి‘‘ఎడమకాలు పూర్తిగా పాడయ్యింది... కాలు కదపలేరు...పెద్ద వయస్సు కదా!’ ఆర్టరీస్‌లో బ్లడ్‌ కాట్స్‌ ఏర్పడటం సహజం... వయస్సు మీదపడే కొద్ది శరీరం డికేయింగ్‌ ప్రాసెస్‌లో వుంటుంది’’ అన్నాడు డాక్టరు