కుసుమకి చాలా భయంగా ఉంది. మరి ఉండదా? కొత్తగా పెళ్ళై అత్తవారింట అడుగు పెడుతోంది.తనదా ప్రేమ వివాహం! ఏరి, కోరి ఇంకా మాట్లాడితే, వెంట తిరిగి తిరిగి, ఫోన్లు చేసిచేసి, గోపాల్‌ని బ్రతిమాలి తనతో పెళ్ళికి ఒప్పించింది.ఈ కాలంలో ఆడపిల్ల అడిగితే ఎవరు పెళ్ళి చేసుకోరు? అని అనకండి. ఏ అబ్బాయి అయినా చేసుకోవచ్చును. కానీ గోపాల్‌ లాంటి అబ్బాయి చేసుకోవడమే గొప్ప.ఎందుకంటారా? గోపాలుడి లాగ ఈ గోపాల్‌ కూడా ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు. కన్నది చెల్లెలే అయినా పిల్లలులేని అక్కగారు గోపాల్‌ని తీసికొని వచ్చి పెంచుకుంది. అతడు ఇలాగ అనసూయమ్మ దగ్గరికి వచ్చాడో లేదో, ఏడాది గడిచేటప్పటికి ఆవిడ కడుపు పండి... కడుపు పండటం ఏమిటి అని పిచ్చి ప్రశ్నలు వద్దు... ఆవిడ పూజలు ఫలించి, గర్భవతి అయింది.దాంతో గోపాల్‌ని నెత్తిమీద పెట్టుకుని ఊరేగింది. మా గోపాల్‌ వచ్చాడు, నన్ను అపకీర్తి నుండి తప్పించాడు అని ఊరూ వాడా చెప్పుకుంది. సరోజ పుట్టినా గోపాల్‌ ముద్దు ముచ్చటలు పెరిగాయి గానీ తగ్గలేదు.‘‘నాయనా! గోపాల్‌’’ అనో ‘‘నా బంగారం’’ అనో ‘‘చిన్నతండ్రీ!’’ అనో తప్ప అనసూయమ్మ మామూలుగా పిలిచి ఎరుగదు. అలాగ అపురూపంగా, అరచేతిలో పెట్టుకుని పెంచిన గోపాల్‌ గురించి ఆవిడ ఎన్నో కలలు కన్నది.మరి అలాంటివాడు తల్లికి చెప్పాపెట్టకుండా, గుడిలో పెళ్ళి చేసుకొని, కుసుమతో ఇంటికి రావడం గొప్ప కాదా? వింత కాదా?అనసూయమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యల దగ్గర, తనకు కాబోయే కోడలు గురించి చాంతాడంత కోరికల చిట్టా విప్పుతోంది.

 గోపాల్‌కి అది తెలిసి, సాహసించాడంటే, కుసుమ మీద ప్రేమ ఎంత ఉందో తెలుస్తోంది.కుసుమ ఇల్లు సమీపిస్తోంటే భయంగా అంది. ‘‘ఏవండీ, నాకు చాలా భయంగా ఉంది. మనల్ని చూసి మీ అమ్మగారు ఏమంటారో? అసలు గడపలోకి రానిస్తారో, లేదో?గోపాల్‌కీ మనసులో భయంగానే ఉంది. కానీ అమ్మ ప్రేమ చటుక్కున గుర్తు వచ్చేసింది. పైగా పెళ్ళాం దగ్గర తను పిరికివాడుగా ఉండకూడదు కదా? ఆనక అది అలుసుగా తీసికొని ఏడిపించవచ్చును. అందుకే గంభీరంగా అన్నాడు. ‘‘ఛ... మా అమ్మ దేవత. అందరిలాంటిది కాదు. నువ్వే చూస్తావుగా!’’కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వరండాలో కూర్చుని పేపర్‌ రెండవసారి మళ్ళీ చదువుకొంటున్న ఆనందరావు గారు గోపాల్‌ వాళ్ళు కారులో నుండి దిగడం చూశారు.‘‘అదేమిటి? గోపీగాడేమిటి? ఎవరో అమ్మాయితో ఇలాగ పెళ్ళి దండలతో రావడం ఏమిటి?’’ అని కాసేపు ఆశ్చర్యపోయారు.తర్వాత భార్య గుర్తు వచ్చింది. ‘‘అమ్మో! వాడి పెళ్ళి గురించి ఈ పిచ్చిది ఎన్నో ఆశలు పడుతోంది. ఏమంటుందో!’’ అని భయపడ్డారు.