మా చిన్న బాబాయి హన్మంతరావును మావూరు వాళ్లే కాక మా తాలూకూ జనాలంతా ‘‘మిలిట్రీ దొరవారూ’’ అనే పిలుస్తారు. ఆయన కాక మా నాన్నకు మరో తమ్ముడున్నాడు. ఈయన్ను రంగయ్య దొర అని పిలుస్తారు. మా మిలిట్రీ బాబాయికీ ఒక్క ఆడపిల్లా, ఒక పిల్లవాడు మాత్రమే సంతానం. మా రంగారావు బాబాయి వ్యవసాయపనులూ, లానాదేనా వ్యవహారాలు చేసుకునేవాడు. మా నాన్న తాసిల్దార్లకు, తాలూక్దార్లకు, పోలీసు ఆఫీసర్లకు ఎప్పుడెప్పుడు నజరానాలు పంపాలో, వాళ్లతో ఏమేమి పనులు సాధించాల్సివుందో చూసుకొనేవాడు. మా మిలిట్రీ బాబాయి మాజీ సైన్యాధ్యుక్షుడు. జీతగాళ్ళంతా ఆయన అదుపాజ్ఞల్లో ఉండేవారు. మా ఇంటి ముందు నుంచి ఎవడైనా చెప్పులు వేసుకుని వీధిగుండా వెళ్ళాడో వాడు చచ్చాడన్నమాటే. మిలిట్రీ బాబాయి కేకతో మా జీతగాళ్ళు చెప్పులతో వెడుతున్న ఆసామిని పెడరెక్కలు విరిచి లాక్కొచ్చేవాళ్ళు. వాడికి మా మిలిట్రీ బాబాయి జుర్మానా విధించేవాడు. ఆ ఆసామి తాలూకు వాళ్ళు ఎవరో వచ్చి డబ్బు కట్టి అతన్ని విడిపించుకోవాలని. అది డిసిప్లీన్‌.మేము దేశ్‌ముఖ్‌లం ఏడువూర్లకు దొరలం మా ఆరువేల నియోగులకు కొంత మందికి మాత్రమే దొరతనం వుండేది. ఇదెలా జరిగిదంటే మా మిలిట్రీ బాబాయి చెప్పినదాని సారాంశం. 

నిజాం నవాబుగారి తాతో, ముత్తాతో ఒకాయన నాసిరుద్దాలా అని వుండేవాడు. ఆయన హయాంలో భూమి శిస్తు వసూళ్ళ హక్కును వేలం వేసేవారు. కొంతమంది నియోగులు కూడా వేలంలో ఆ హక్కు సంపాదించి, నవాబుకు కట్టవల్సిందానికంటే ఎక్కువే వసూలు చేసి ఆ డబ్బుతో సొంత భూములు పెంచుకొనేవారు శిస్తు కట్టలేని వాళ్ళ భూముల్ని కూడా తామే దఖలు పర్చుకునేవారు. దీన్ని ‘‘సర్‌బరస్తా’’ పద్ధతనేవాళ్ళు. మా తాతముత్తాతలు అప్పటి తాలూక్దార్లకు లంచాలిచ్చీ, దావతులిచ్చీ మూడువేల ఎకరాల భూమీ, దొరతనం సంపాదించుకొన్నారు. అయితే సాలార్‌జంగు అని ఒకాయన నిజాం దగ్గర ప్రధానిగా వచ్చి ఈ వేలం పద్ధతి రద్దుచేశాడు. దానికి బదులుగా, దేఖ్‌ముఖ్‌ దేశ్‌పాండ్యా, సర్దేశాయి, వంటి బిరుదులిచ్చి మమ్మల్ని కూడా శిస్తు కట్టమన్నాడు.మా నాన్నకు మా పెద్దబాబాయికి ఉర్ధు, తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం వుండేది. వేల సంఖ్యలో పద్యాలు ధారణలో వుండేవి. మా మిలిట్రీ బాబాయికి ఇవన్నీ గిట్టవు ఆయన ‘డిసిప్లిన్‌ - క్రమశిక్షణ’’ అంటూ అరుస్తుండేవాడు. వూళ్ళో తగాదాలు ఆయన పరిష్కరించాల్సిందే, క్రమశిక్షణ తప్నినవాళ్ళను చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టేవాడు.ఊరంతా మమ్మల్నీ మా మిలిట్రీ బాబాయిని ‘‘దొరవారూ’’ అని సంభోదించేది. పొరపాటున మా బాబాయిని ‘‘హన్మంతరావు సాబ్‌’’ అన్నాడనుకొండి వాడు చచ్చాడన్నమాటే. వాడికి మర్యాద మప్పితాల గురించి పెద్దవుపన్యాసం యిచ్చేవాడు. ‘‘ఏటండీ బ్రిటిషు ఇండియాలో స్వాతంత్రపోరాటం జరిగింది. రాజులు పొయ్యారు రాజ్యాలు పొయ్యినయి. కాలం మారినా కనిపెట్టరేమండి’’ అని మా హెడ్మాష్టరు ఒకమారు విసుక్కున్నాడు. దాంతో మా మిలిట్రీ బాబాయి చెలరేగిపొయ్యాడు. ‘‘ఏంటి కాలం మారిందా! ఎక్కడ మారింది సూర్యుడు తూర్పు వైపునే పుడుతున్నాడా? మారాడా? అమావాస్యలు, పౌర్ణాలు మారాయా? పుజూల్‌ మాటలు మాట్లాడకు పంతులూ’’ బాబాయి గట్టిగా జవాబిచ్చాడు.