ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉత్తరాన్ని చూస్తున్నాను. స్మార్ట్‌ఫోన్లు, ఈ-మెయిల్స్‌, వాట్సా్‌పలు, వీడియోకాల్స్‌ పెరిగిన తర్వాత, ఉత్తరాలు మరుగున పడిపోయాయి. గొలుసుకట్టు రాతతో నాన్ననుండీ వచ్చిన ఉత్తరం మా ఊరి మట్టి వాసనను నింపుకుని వచ్చింది.

నాన్న ఉత్తరాన్ని ఇష్టంగా నిమిరి మళ్ళీ చదవటం మొదలు పెట్టాను.చిరంజీవి శంకరానికి,ఆశీస్సులు. ఉభయ కుశలోపరి. మనవరాలు ప్రవీణ పెళ్లి కుదిరిందని నీ నుండి తెలిసిన వార్త విని అమ్మా, నేనూ చాలా సంతోషించాం. పెళ్ళికొడుకు వాళ్ళు మనవైపు వాళ్ళే, మనవాళ్ళే అని తెలిసి ఇంకా చాలా సంతోషించాం. అమ్మాయి ఇంకా పసిదానిలాగానే అనిపిస్తోంది అమ్మకీ, నాకూ. అప్పుడే పెళ్ళి కూతురవుతోంది. మా శుభా కాంక్షలు పిల్లకీ, కోడలికి కూడా చెప్పు నాన్నా!నాన్నా! మా వయసు అయిపోయింది. అంతేకాక అమ్మకి మోకాళ్ల నొప్పులు. ఆ దేశంలో చలి కూడా బాగా ఎక్కువ. ఈ వయసులో అమ్మా, నేనూ అంతదూరం ప్రయాణం చేసి దేశాంతరాలు రాలేము తండ్రీ. మా ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయ్‌.ఏదో మనసు ఊరుకోక ఇలా రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. అమ్మాయి పెళ్ళి మన ఊళ్ళో, మన ఇంట్లో, మన సంప్రదాయం ప్రకారం చెయ్యొచ్చు కదా! తరాలుగా మన తాత తండ్రులు సుఖదుఃఖాలు పంచుకున్న ఇల్లు మనది. ఈ ముంగిట మనవరాలి పెళ్ళి జరిగితే అమ్మా, నేనే కాదు, మన పెద్దలందరూ ఏ లోకాన ఉన్నా సంతోషంగా పిల్లల్ని దీవిస్తారు. నీ కెరీర్‌ కోసం విదేశాలకు వెళ్ళావు బానే ఉంది. కనీసం పిల్ల పెళ్లయినా నువ్వు పుట్టిపెరిగిన ఈ గడ్డ మీద చేస్తే చాలా బాగుంటుంది నాన్నా.ఆడపిల్ల పెళ్ళికి మన ఇంట ఒక ఆచారం ఉంది. మంగళ సూత్రానికి అయ్యే ఖర్చులో కనీసం ఒక రూపాయి అయినా, కొక్కిలిగడ్డలో మండవ వారి నుండీ, చలసాని వారి నుండీ తీసుకోవటం మన ఆచారం. వాళ్ళింటి పెళ్ళిళ్ళకి మన మంత్రం, మన ఇంటి ఆడపడుచు పెళ్ళికి మంగళ సూత్రం ఖర్చు కొంచెం వాళ్ళు భరించటం రివాజుగా వస్తోంది. మన మంత్రంలో వాళ్ళింటి పెళ్ళి జరిగితే వాళ్ళ ఆడపడుచులు సుఖసంతోషాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో హాయిగా ఉంటారని వాళ్ళ నమ్మకం. మంగళ సూత్రం ఖర్చులో వాళ్ళ డబ్బు పడితే మన పిల్లలకి మాంగల్యబలం. ఇది తరాలక్రితం చేసుకున్న ఒప్పందం. మన పౌరోహిత్యాన్ని అడుసుమిల్లి వారికి అప్పచెప్పేసినా, ఇలా మంగళసూత్రానికి వారి నుండీ కొద్దిగా డబ్బు తీసుకోవటం మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. వాళ్ళు మనింట ప్రతి పెళ్ళికీ వాళ్ళకి తోచిన సహాయం చేసి ఆ రివాజుని కాపాడుతున్నారు.

నీకు గుర్తుందో లేదో, అక్కపెళ్ళికి కూడా మనం వాళ్ళింటికి వెళ్ళాం. మన ప్రవీణ పెళ్ళి ఇక్కడ నా మాటని మన్నించి జరిపితే, వాళ్ళ సహాయం తీసుకుందాం. ఇక్కడ డబ్బు ముఖ్యంకాదు. తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆచరించటం. అది మనకి శ్రీరామరక్ష. వారికి అది యశస్సు. ఇక్కడే పెళ్ళి చెయ్యటానికి నువ్వు ఒప్పుకుంటే, నేనే అన్ని ఏర్పాట్లుచేసి అంగరంగ వైభోగంగా మనవరాలి పెళ్ళి జరిపిస్తాను. నాన్నా! పెద్దవాణ్ణి. ఏదో నాకు తోచిన సలహా ఇచ్చాను. నీకు ఎలా వీలయితే అలా చేసుకో. నీ వీలే ముఖ్యం. ఇక్కడ కాదన్నా నేను నీ కష్టం అర్థం చేసుకుంటాను. నువ్వు ఫీలవ్వద్దు.