ఒరే పెద్దయ్యా! రా. రా. దమ్ముంటే యీ సర్పంచీ ఎలస్సన్లో సూసుకొందాం...’’అదే మా పెద్దయ్యతో ఆకరిగా నేను మాట్టాడిన మాట. కేక. టీ కొట్టు దగ్గరున్నోల్లంతా నావేపు నోరువిప్పి సూత్తున్నారు. చేతుల్లో ‘టీగాసులు’ పచ్చవాతం వచ్చినట్టుగా బిగుసుకుపోయాయి. గాసులు కడుగుతున్న సీతాలు కదలకుండా ఉండిపోయింది. ఒక్కస్సెనం పాటు అంతా నిస్సద్దం. ఈ నిస్సద్దం కేవలం నేను అరిసిన అరుపువల్ల వచ్చింది కాదు. గత రెండేల్లుగా సాపకింద నీరులా పాకుతూ వచ్చింది. అసెంబిలీ ఎలస్సన్లో ఈ దూరం మొదలయ్యింది. పాల సంగం, నీటి సంగం, సహకార సంగం ఎలస్సన్లో దూరం మరీ మరీ పెరిగింది. మండల ఎలస్సన్లో దూరం అగాదంగా మారింది.ఇపడు మా ఊల్లో రోడ్డు ఉత్తరం వైపు ఉన్నోల్లంతా తెలుగుదేశం. రోడ్డుకి దచ్చినాన ఉన్నోల్లంతా కాంగిరేసు. సుట్టుపక్కల ఉన్న ఊల్లన్నిటిలో మా ఊరే పెద్దది. డబ్బులో కూడా మా ఊరిదే పైచేయి. నాయుడు మాయ్యకాడ రెండొందలెకరాలూ, పెదబాబుగోరు కాడ రెండొందలెకరాలూ! రోడ్డుకి ఉత్తరంగా ఉన్న ఊరు కొత్తగా పెరిగింది. ఈ కొత్త ఊల్లోని ఎక్కువ యిల్లు తెలుగుదేశం అయాంలో కట్టినియ్యే. ఈ కొత్త యీదికి పెత్తందారు పెదబాబుగోరే. పెదబాబుగోరు మా ఊల్లో పుట్టలేదు. ఇల్లరికానికి వచ్చి, రాజకీయంగా ఎదిగేడు. మొదట్లో కుర్రోల్లనీ, పెద్దోల్లనీ కలిపి నాటకాలు ఏయించేవోడు. పండుగలు సేయించేవోడు. 

తెలుగుదేశం పార్టీకి సేయూతగా సుట్టుపక్కల ఊల్లంనిట్లో పట్టుగొమ్మయ్యాడు. కొత్తీదిలో సాలా యిల్లు ఈయనగోరు పలుకుబడితో కట్టినియ్యే. పంటలకు యిత్తనాలు, లోన్లు... అన్నింట్లో తన మాటను పలికించాడు. అందుకే యియ్యాల కొత్తీదిలో ఆయనకు ఎదురులేదు. ఆయనకోసం పేనాలొడ్డెయ్యడానికి సిద్దంగా ఉన్నారు పెజలు.రోడ్డుకి దచ్చినంగా ఉన్న ఊరు పాతూరు! ఒక సెట్టుకు పెరిగిన కొమ్మల్లా దగ్గిరి దగ్గిరిగా యిల్లు. ఒకరి కొంప నుంచి మరొకరి కొంపలోకి రాకపోకలు జరుగుతుంటాయి. అమ్మన్నక్క ఒంకాయ కూర సేత్తే మా యింటికి పంపిత్తాది. మాయమ్మ సేసిన కొబ్బరికాయ పచ్చడి నాయుడి మాయ్యింటికి ఎల్తాది. అమ్మలూ, అక్కలూ కలిసి ఒరిపిండి ఒడియాలు పెడతారు. ఆవకాయలో తీపీకారంలా ఒకరింటి పిల్లలు, మరొకరింటి పిల్లలతో కలిసిపోతారు. మా గేదెలకు గడ్డికోసం అయ్య నాయుడు మాయ్య సేలోకి ఎల్తాడు. వాల్ల టాకటేరు దుక్కుదున్నడానికి సాయంగా వత్తాది. వాల్ల సేను నూరుపుకి సాయంగా అందరం ఎల్తాం. మా మద్దిన దాపరికాల్లేవు. కుల్లిబోత్తనాలంతకన్నా లేవు. ఎచ్చుతగ్గుల తేడాలు మచ్చుకన్నా లేవు. కస్టసుకాల్లో ఒకలికొకలం. ఇదే.. ఈ పాతూల్లో పెద్దలదగ్గిరి నుంచీ వత్తున్న ఆచారం. అందుకే ఇక్కడ నాయుడు మాయ్యే నాయకుడు. .ఆయన పలుకంటే బెమ్మపలుకు. ఆయన మొదటినుంచీ కాంగిరేసు పాట్టీనే నమ్ముకున్నాడు.