సాయమ్మకు నిద్రపడుతలేదు. చిన్నబిడ్డ దేవ యాది కచ్చి కడుపు చెరువయింది. కన్నీళ్లతో మెత్త సగం నానింది. ‘బిడ్డ ఒకలకు చెయ్యి జాపకుంట బతుకాలని అప్పసప్పజేసినా ఉన్నఇంటికిఇత్తి. పిల్లలు అయిత లేరంటే భూమండలం మొత్తం తిరిగితి. సల్లగ ఒక కానుపు జేత్తి. ఇపడు నేను కనవడుతలేనా..అవ్వారాయో అని తోలుక పోరా! మల్లా పొద్దులు నిండినయి. కానుపుకు ఎట్ల తోలుకరావాలె. నాకు చేతులు ఎట్లత్తయి’ అనుకుంది.అపడే బయట బలబల చపడు. చిన్నగా అరుపు.ఆలోచనల్లోంచి తేరుకుని చెవులు రిక్కించి విన్నది సాయమ్మ. చపడు పెద్దదయింది. సాయమ్మ ఉల్కిపడ్డది.‘‘అనుమానం లేదు. ఏ ఎద్దో పోతో ఎనుగు దుంకి అనుప చేన్లకు వచ్చినట్టుంది. చేనుపాడుగాను. ఏ గడియలపెట్టినమో గాని పలారంగావట్టె’’ అనుకుంది.ఎంటనే భర్తకు కేకేసి ‘ ఔ..ఉన్నవా? ఒకసారి గట్ల సూడుపో..అనుప చేను పెట్టుడేమోకాని కావలి గాయలేక సత్తున్నం. రాత్రిలేదు. పగలు లేదు.’ గులిగినట్టు అన్నది సాయమ్మ.సాయన్నకు అపడే కన్నంటుకుంటంది. భార్య పిలుపునకు లేచిండు. ‘‘దీనిపాడుగా ను. 

ఇంత రాత్రిపూట ఏమచ్చే! బర్లు గిట్ల వచ్చెనాంటే పొట్టు పొట్టు తొక్కుతయి.’’ అంటూ చేతికట్టె కోసం చూసిండు.‘‘ఏమాయె నువ్వు గోశి సదిరేవరకు అది సగం మడి తొక్కుతది. నడువు’’ గదిరిచ్చింది సాయమ్మ. చేతికట్టెను టార్చ్‌ లైటును అందుకుని తలుపు తెరిచి బయటకు వచ్చిండుసాయన్న.పల్లె మొత్తం కన్ను మగ్గింది. పల్లెకు దూరంగా ఉన్న ఇల్లు అది. అనుపచేను మాగిన వాసన గపమంది. చేను నిండా ఎన్నీల పరుచుకుంది. వాసన పసిగట్టి ఎక్కడెక్కడి పశువులో వత్తున్నయి. రోజుకొక్క పంచాది.బయటకు అడుగుపెట్టిన సాయన్న పెరడంతా చూసిండు. మొదటి మడిలో నల్లటి ఆకారం కనిపించింది. లైటు కొట్టి చూసిండు. పాణం దస్సుమంది. అతడు బయపడ్డట్టు అది బర్రెనే!‘‘నీగత్తర్రాను గదనే! నువ్వు వాసన వట్టినవంటే ఇడుత్తవా!.. ఎద్దోపోతో ఐతే ఒకటే వత్తది. నువ్వు మందకు మంద ఎంటవెట్టుకత్తవు.’’ అంటూ మట్టిపెల్లను అందుకుని బలంగా ఇసిరికొట్టిండు.అది కొమ్ములకు తాకింది. అయినా బర్రెకదల్లేదు. తీగెల్ని మజ్జెడ మజ్జెడ తొక్కుతుంది.సాయన్నకు తిక్కలేసింది. ‘అరే..దీని కత జూసినవా..అడుగు జరుగుతలేదు.’ అనుకుంటూ చేతిల కట్టెను ఇసిరిండు. కట్టె అంత దూరంపోలేదు. నాలుగు అడుగులేసి కట్టెను అందుకుని బర్రెమీదికి ఉరికిండు.అపడే బయటకు వచ్చింది సాయమ్మ. ఎన్నీల సాలులో బర్రెను గుర్తువట్టింది. దబదబ నాలుగు అడుగులేసి బర్రెదగ్గరికి వచ్చింది. కొట్టబోతున్న సాయన్నను ఆపింది. అప్పటికీ బర్రె కదులతనే లేదు.ఆమెడ దూరం గోజకనవడితే ఉరికురికి తరిమే సాయమ్మ తనను ఎందుకు ఆపిందో అర్థం కాలేదు సాయన్నకు. అతడు అడిగేలోపే గొంతు తగ్గించి ‘‘అది మన గొంగి బర్రెగదా! వంగు కొమ్ములు కనవడుతలెవ్వా...’’ అన్నది.