అనూహ్యంగా కర్ణుడు ప్రయోగించిన ఆయుధం నా ఛాతీ నుండి దూసుకెళ్ళి వీపును చీల్చేసింది. నా చావు ఖాయమైపోయింది. దుర్యోధనాదులకు నిద్రాహారాలను దూరం చేసి వారిని మృత్యుకుహరం వరకు తీసుకెళ్ళగలిగాను కానీ, నా పితృదేవులైన పాండవులను పూర్తిగా విజయలక్ష్మి వరించకుండానే అవశుడనై నేలకూలాను. అదే నా బాధ! నా శరీరం అవనిని తాకి క్రమంగా నిశ్చల స్థితికి చేరుకుంటోంది. శత్రు సైన్యంలో హర్షాతిరేకాలు, పాండవ సైన్యంలో హాహాకారాలు.నాకు నా తల్లి, భార్య గుర్తుకొస్తున్నారు. ఇక వారికి దిక్కెవరు? ఇప్పటికే ఈ యుద్ధంలో కొడుకుని పోగొట్టుకున్న నా భార్య ఇప్పుడు నన్ను కూడా పోగొట్టుకుంటోంది. నా తల్లికి భర్త ఉన్నా లేనట్టే! నా జననంతోనే ఆమె వివాహబంధం తెగిపోయింది. అప్పటి నుండి ఆమెకు అన్నీ నేనే. నా తండ్రి జ్ఞాపకాల్ని నాలో చూసుకుంటూ బతుకుతోంది. తన ఆత్మీయులందర్నీ పోగొట్టుకుని అభాగ్యురాలిగా నిలబడిన ఆమెకు నా తండ్రి అండగా ఉంటాడా? ఒకవేళ అండగా ఉండాలని తలచినా ఇంతకాలం తర్వాత ఆమె అందుకు సమ్మతిస్తుందా? ఆమె ఆత్మాభిమానం అటువంటిది మరి!నా జనకుని పిలుపుతో నేను యుద్ధానికి బయలుదేరినపుడు తనకు ఇష్టం లేకపోయినా నన్ను మనసారా ఆశీర్వదించి పంపింది ఆ పిచ్చితల్లి. ఆశీర్వచనంలోని కంటతడి నా కంటపడకపోలేదు. తన పవిత్ర ప్రేమకు గుర్తుగా నిలిచిన నేను తనకు దూరమౌతానేమోనన్న భయమేమో? ఇప్పుడిప్పుడే అది నాకవగతమౌతోంది. యుద్ధంలో మరణిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందంటారు.

 కానీ నా ప్రాణం ఇంకా శరీరంలోనే కొట్టుమిట్టాడుతోందేమిటి! ఏదీ... ఆ స్వర్గం? అయినా నా పిచ్చిగాని, అత్యంత ఆత్మీయులైన తల్లి, భార్యాపుత్రుల దగ్గర దొరకని ప్రేమ స్వర్గంలో దొరుకుతుందా!ఎక్కడ చూసినా మృతదేహాలు, తెగిపడిన తలలు, ఇతర అవయవాలు. అక్కడక్కడా మాంస ఖండాలు. రక్తం ఏరులై పారుతోంది. ఆ వాసన ముక్కుపుటాలను గాఢంగా తాకుతోంది. కొందరు వీరులు తీవ్ర గాయాలతో నేలకొరిగినా వారి ప్రాణాలు తీసుకుపోకుండా యముడు దాగుడుమూతలాడుతున్నాడు. మరణయాతన భరించలేక వారు పెట్టే అరుపులు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. యమధర్మరాజు కెందుకింత నిర్దయ! నా ప్రాణాన్ని కూడా నా శరీరాన్నుండి వేరు చేయకుండా ఆయన ఆటలాడుకుంటున్నాడెందుకు?నా కళ్ళు మూతపడీ పడనట్టున్నాయ్‌. అప్పటికే సోదర సమేతంగా నా తండ్రి, కృష్ణ మామ, ఇంకా స్వపక్షంలోని చాలామంది యోధులు నా చుట్టూ చేరారు. అందరి కళ్ళల్లో నీళ్ళు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. విచార వదనాలతో కొందరు యోధులు తన వీరత్వాన్ని గుర్తుచేసుకుని బాధపడటం వినబడుతోంది.ఇంతలో పాంచజన్య ఘోష వినబడింది. బలవంతంగా కళ్ళు తెరిచేందుకు ప్రయత్నించాను. పూరించిన పాంచజన్యాన్ని రథంపై పెట్టి అత్యంతుల్లాసంతో నృత్యం చేస్తున్నాడు కృష్ణ మామ. ఏమిటీ వింత! ఆశ్చర్యంగా ఉంది. నా అంతం అతనికి అంత సంతోషాన్నిస్తోందా! ఒక్కసారిగా నేను దిగ్భ్రమకు గురయ్యాను. నా పితృదేవుల పరిస్థితీ అదే! ఇక శత్రుసైన్యాల పరిస్థితి మాకంటే అగమ్యగోచరంగా ఉంది. పాండవ సైన్యాలను తన కనుసైగలతో నడిపించే అనధికార సైన్యాధ్యక్షుడాయన. స్వపక్షంలోని ఒక వీరుడు నేలకొరిగితే ఆయనకు అంత సంతోషం ఎందుకు?