‘‘అమ్మా! అక్కా బావొచ్చారే!’’ చిన్నకూతురు మానస కేక విని తడిచేతుల్ని పొడి కొంగుకు తుడుచుకుంటూ బయటికొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్దకూతురు భారతి కెదురెళ్లి గుండెలకు హత్తుకుంది. అల్లుణ్ని ఆప్యాయంగా పలుకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్‌నుఉత్సాహ పరిచింది.‘‘బావకేమమ్మా!’’ మానస అక్క చెయ్యందుకుంది. ‘‘గుండ్రాయిలాగున్నారు. మంచి ఉద్యోగం, అందాల బొమ్మ అక్క. కాని... అక్కనే చీపురు పుల్లలాగైంది’’ గలగలా నవ్వేసింది.సుధీర్‌ కెదురెళ్లి సూటుకేసందుకుంది.‘‘పాపం! ముప్పూటలా తింటూ కూచోలేక మీ అక్క అలాగై పోయింది తల్లీ!’’ మరదలు నెత్తిమీద మొట్టికాయిచ్చాడు సుధీర్‌. భార్య వైపు చూస్తూ ‘‘ఈ సిసింద్రీ పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతీ!’’ హామీ ఇచ్చాడు.‘‘మా మానస అతన్ని మూడు దేశాలు తిప్పి మూడు సముద్రాల నీళ్లు తాగిస్తుంది... జాగ్రత్త!’’ భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరి పడినై.‘‘అబ్బా! లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు గదా!’’ దేవకి.‘‘వస్తున్నా... లోపలి కొస్తున్నానోయ్‌!’’ నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలి కొచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకి నాశ్చార్యంలో ముంచెత్తింది.‘‘లోపలికి రమ్మన్నది తమరిని కాదు’’.‘‘అయితే నేను బయటి కెళ్లాలా?’’ కండువా దులిపాడు.‘‘చూడమ్మా! మీ అమ్మ మర్యాద!’’ కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు.అందరూ హాయిగా నవ్వుకని కుశల ప్రశ్నల్లోకి దిగారు.దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్‌ చేశాడు సుధీర్‌. నారాయణ సంబరం అంబరాన్నంటింది. ‘‘పిల్లలేరి అల్లుడూ?’’.‘‘ఇద్దరూ రెసిడెన్షియల్‌ స్కూలే గదా! ఎక్స్‌కర్షన్‌కు తీసుకెళ్లారు స్కూలు వాళ్లు’’.‘‘సరే గానీ... ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికెందుకు రావట్లేదు నాన్నా?’’ భారతి నిలదీసింది. ‘‘చెల్లి వద్దన్నదా’’.‘‘అదెందుకంటుందమ్మా! మీరిద్దరూ నాకు రెండు కళ్లు. మగ పిల్లలు లేరు గదా! అయినా ఈ ఊళ్లో ఓ గ్రంథాలయం ప్రారంభించాము.

 రెగ్యులర్‌ లైబ్రేరియన్‌ వచ్చే దాకా నేనే లైబ్రేరియన్ను. అంతేకాదు. ఈ ఊళ్లో ఓ జూనియర్‌ కాలేజి ప్రారంభించాలని తిరుగుతున్నాం..’’‘‘అయితే మామగారు రిటైర్డ్‌ బట్‌ నాట్‌ టైర్డ్‌ అన్నమాటా!’’ సుధీర్‌ అనేశాడు. లోలోపల మాత్రం ‘‘ఫూర్‌ ఫెలో... పట్నంలో రిటైరై పల్లెటూరు కొచ్చిండు.. ఉడుక్కుంటున్నాడు... గొణుక్కుంటున్నాడు.సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసిన నారాయణ కంతా అవగతమైంది.‘‘పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు అల్లుడూ! రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం చెట్లు, మామిడి తీగలు అనేస్తారు’’.గొల్లున నవ్వారంతా. సుధీర్‌కు గూడా తప్పలేదు.దేవకి వంటింట్లో కెళ్లింది. సోఫాలో కూచుండి కబుర్లలోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్లింది వంటింట్లోకి.ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నై.‘‘చాయగరం... చా గరం...’’ రైలు డబ్బాలో చాయవాలాలా రాగాలుదీస్తూ ట్రేతో సుధీర్‌ ముందుకొచ్చింది మానస. ముందుకు వంగి కప్పందుకున్నాడు. మరదలిని ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూర వర్ణం దేహఛాయ, అపురూపమైన అంగ సౌష్ఠవము... కుందనపు బొమ్మలాగుంది మానస.