రేడియోలో ఎవడో ఫ్రాన్స్‌మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. ఫ్రెంచి వాళ్ళు ఎందుకూ పనికిరానిదద్దమ్మలంటున్నాడు. పిరికిపందలంటున్నాడు. పోయిన ప్రపంచయుద్ధంలో మన సైన్యం వాళ్ళ దేశాన్ని ఆదుకోకపోయి నట్లయితే అసలు ఫ్రాన్స్‌ అనే దేశం లేకుండా పోయేదని అంటున్నాడు.ఐక్యరాజ్యసమితిలో మనకు వ్యతిరేకంగా వాదిస్తున్నందుకు ఫ్రెంచి వైనూ, ఫ్రెంచి చీజూ, అసలు ఫ్రెంచి వస్తువులేవీ వాడవద్దంటున్నాడు.ఫ్రాన్స్‌తో అమెరికాకి విరోధం మొదలయినప్పటి నుంచి నాకు సంధ్యతో పరిచయమైనప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆరోజుల్లో నేనుడిట్రాయట్‌లో వుంటుండే వాణ్ణి. పటేల్‌ బ్రదర్స్‌ వాళ్ళ దుకాణంలో పార్ట్‌ టైమ్‌ క్లర్క్‌గా పనిచేస్తుండేవాణ్ణి. ఒక శుక్రవారం మధ్యాహ్నం ఒకామె దుకాణానికొచ్చింది. దాదాపు ముఫ్ఫై సంవత్సరాలుంటాయి. అలాగే చూస్తూ ఉండాలనిపించేటంత అందమైన ముఖం.ప్రశాంతంగా, వెలుగు చిమ్మే ముఖం. చూడగానే ఆమెలో ఏదో ప్రత్యేకత వుందనిపించింది.దుకాణంలోకి వచ్చి, ‘హలో’ అంటే సమాధానంగా చిరునవ్వు నవ్వి, షాపింగ్‌ కార్ట్‌ ఒకటి నెట్టుకుంటూ షాప్‌ వెనుకభాగానికి వెళ్ళింది. ఆమెను చూస్తూ కూర్చున్నాను. పప్పులు, ఒక పచ్చడి సీసా తీసుకుంది. రెండు ఇన్‌స్టెంట్‌ ఇడ్లీ పేకెట్లు తీసుకుంది. కూరగాయల రిఫ్రెజిరేటర్‌ దగ్గర ఆగింది. పుస్తకం చేతుల్లో ఉన్నా ఆమెనే చూస్తూ కూర్చున్నాను. 

ఇంతలో ఏదో అడగాలన్నట్లు ఇటు తిరిగిందామె. నేను వెంటనే పుస్తకంలోకి చూపు మార్చాను. ఆమె ఏమీ అడగలేదు. పది నిముషాల తర్వాత షాపింగ్‌ కార్ట్‌ నెట్టుకుంటూ కేషియర్‌ కౌంటర్‌ దగ్గరకొచ్చింది.ఆమె తెచ్చిన సరుకులన్నీ చెకవుట్‌ చేస్తే 43.54 డాలర్లయింది. ఆమె చెక్కు రాసిచ్చింది. చెక్కు మీద పేరుచూసి, ‘‘మీరు తెలుగువారా?’’ అని అడిగాను.‘‘ఫరవాలేదే! ధైర్యంగానే అడిగేశారే,’’ అంది ఆమె నవ్వుతూ ‘‘మిమ్మల్నెప్పుడూ చూడలేదే ఇంతకుముందు. ఆ పటేల్‌ ఉంటుండేవాడు నేను వచ్చినప్పుడల్లా’’.‘‘అవునండీ. నేనిక్కడ చేరి మూడు రోజులయింది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొరికింది. సోమవారం, శుక్రవారం ఇక్కడ పని చేస్తాను’’.‘‘వెరీగుడ్‌. అయితే ప్రతివారం కనబడతారన్నమాట’’.‘‘మీరు వారం వారం ఇక్కడ షాపింగ్‌ చేస్తారా?’’‘‘శుక్రవారం కూరగాయలు కొనటానికి వస్తుంటాగా’’‘‘అలాగా, మీకు శుక్రవారం సెలవా?’’‘‘అబ్బే, మీ పటేల్‌ గురువారం నాడు ఫ్రెష్‌గా కూరగాయలు తెస్తాడుగా. శుక్రవారం సాయంత్రం లోగా వస్తే మంచి సెలక్షన్‌ దొరుకుతుంది. నేను మధ్యాహ్నమే వస్తుంటాను. కస్టమర్స్‌ ఎక్కువగా వుండరు. తీరిగ్గా కూరగాయలు ఏరుకోవచ్చు’’.‘‘మంచిది మీరు ప్రతి శుక్రవారం కనిపిస్తే బాగుంటుంది’’ అన్నాను అనాలోచితంగా.సమాధానంగా చిన్నగా నవ్వి ‘‘ఫ్రాన్స్‌ గురించి చదువుతున్నారు. వెకేషన్‌కి వెళ్తున్నారా?’’ అంది, డెస్క్‌మీదున్న నా పుస్తకం వైపు చూస్తూ.‘‘లేదండీ... అవును... వెకేషన్‌కి వెళదామనే ఒకప్పుడు ఈ ట్రావెల్‌గైడ్‌ కొన్నాను. పరిస్థితులు మారటం వల్ల వెకేషన్‌కి వెళ్ళలేదు. ఈ మధ్య మళ్ళా చదవటం మొదలు పెట్టాను. ఊరికే’’.