పదకొండు గంటలు దాటి నలభై నిముషాలకు, మా అమ్మ ఎలక్ర్టిక్‌ పొయ్యిలోకి వెళ్ళిపోయింది. శ్మశాన వాటికలో పనిచేసే పురోహితుడు చెప్పినట్టే, నెయ్యి వేయటం, పిండ ప్రదానం, అగ్నిచుట్టూ తిరగడం, అంత్యక్రియలకు సంబంధించిన పనులన్నీ శాంతంగా చేసుకుంటూ వెళ్లాను.మా అన్నయ్య, వదినె, పెదనాన్న, యింకా శ్మశానంలోని వాళ్ళ దృష్టంతా నా చుట్టూతా తిరగటం - నేను గమనిస్తూనే వున్నాను. నిజానికి యీ క్షణంలో నేను ఒక్కసారిగా ఏడుస్తానని వాళ్ళంతా అనుకుని వుండవచ్చు. కానీ నాకు ఏడుపే రావటం లేదు. ‘ఆడపిల్ల యీ పనులన్నీ చేయటమేంటి?’ ‘పది రోజులు మైల పాటించాల్సిందే!’ యిలా చుట్టుపక్కల వాళ్లంతా మాట్లాడుకుంటూనే వున్నారు. నాకు దూరపు చుట్టం - మరో అన్నయ్య, వదినా అంటున్నారు - ‘పెళ్లయిన కూతురు కదా! మూడు రోజుల్లోనే అన్ని పనులూ అయిపోవాలి, తనకి మూడు రోజులేగా మైల మరీ!’ అని. మళ్ళీ మాటలు.‘ఈ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకోవాలి? తన దగ్గర డబ్బెంత వుందో?’’ ఇలా.. ఇప్పటిదాకా ఖర్చంతా నేనే పెట్టుకున్నాను. ఇంకా జరగవలసిన కార్యక్రమానికి చాలానే అవుతుంది. దశాహ్ని రోజున ఎంత ఖర్చు తగ్గించాలనుకున్నా, దగ్గరి బంధువులు, ఆత్మీయులు, యిరుగుపొరుగు వాళ్లు, యిలా అందరినీ పిలవాలా? కుటుంబ మర్యాద అంటూ ఒకటుంది కదా!చిన్నవదినె అంటూంది - ‘‘మూడు రోజుల్లోనే ముగిస్తే మంచిది బాబూ! పది రోజులంటే మహాకష్టం. తిండితిప్పల్లో అంటూ అవీ వున్నాయి మరి! అదీకాక తనతో ఎవరికి పడుతుంది కనుక? ఎవరి మాటైనా వింటుందా ఏమన్నానా?’’ఎంత గొంతు తగ్గించి మాట్లాడుతున్నా, నాకా మాటలన్నీ వినిపిస్తూనే వున్నాయి. అయినా, నిర్వికారంగా గంగాతీరాన, స్మశాన వాటికను చూస్తూ నిలబడ్డాను.ఒకటి రెండు గంటల్లో పనంతా అయిపోయింది.

 నేను చాలా మంచి బట్టలు వేసుకుని వున్నాను, కానీ వాటిని వదిలివేయాల్సి వచ్చింది. చాలా బాధనిపించింది. నిజానికి నిన్న ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తరువాత బట్టలు మార్చుకోలేకపోయాను. రాగానే అమ్మతో తర్కవితర్కాలు మొదలయ్యాయి. కోపంలో యిద్దరూ ఆవేశం పట్టలేకపోయాం. ఉన్నట్టుండి అమ్మకు వాంతి రావటం మొదలైంది. ముఖమంతా ఎర్రగా మారింది. నాకు భయం వేసింది. అమ్మను తొందరగా సోఫాపై పడుకోబెట్టి, చల్లని నీళ్లతో ముఖం తుడిచాను. అమ్మ మెల్లిగా సోఫాపైనే పడుకుంది. తన ముఖం వంకరపోయింది. తడబడుతూనే అంది - ఎవరినైనా పిలవమని! మళ్ళీ ఓసారి వాంతి చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలో ఆమెను ఒంటరిగా వదిలి బైటికెలా వెళ్ళేది! కాసేపైన తరువాత నేను తాపసి యింటికెళ్లాను. నేనింట్లో లేకపోతే, అమ్మ వాళ్లింట్లోనే ఎక్కువసేపు వుంటుంది. తాపసిని అమ్మ దగ్గరుంచి నేను మా పినతండ్రి కొడుకుల దగ్గరికి వెళ్లాను. మేమంతా దగ్గర దగ్గర యిళ్లలోనే వుంటాము. చలి పెరుగుతూ వుంది. అందరి తలుపులూ మూసి వున్నాయి. రాత్రి పది గంటలైపోయింది. ఒకరు అప్పటికే నిద్రపోయారు. యింకోరు భోజనానికి కూర్చున్నారు అపడే! మరొకరు యింకా యింటికి రానేలేదు. ఇటీవల నేను వాళ్లెవరితోనూ మాట్లాడలేదు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మ గురించి యెంత చెప్పగలనో అంతా చెప్పి యింటికి వచ్చేశాను. డాక్టర్‌కు ఫోన్‌ చేశాను. టాలీగంజ్‌కీ, మానిక్‌ తల్లా పిన్నికీ కూడా చేశాను. అన్నదమ్ములంతా వచ్చేస్తున్నామనే అన్నారు కానీ మాటల్లో ఆ బాధ కనిపించలేదు మరి! అప్పటికి అమ్మకు మరోసారి వాంతి అయింది. గురకలాంటి శబ్దం వస్తూంది. తెలివితప్పి పడివుంది. చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేశారు. సోనా పెద్దమ్మ - చిన్నవదినెతో అంటూంది. ‘ఇలాంటి శబ్దం వస్తే యిక అయిపోయినట్టే’ అని! రకరకాల మనుషులు - రకరకాల మాటలు! డాక్టర్‌ వచ్చేటప్పటికి, అమ్మ మరింత డీలాపడిపోయింది. డాక్టర్‌ చెకప్‌ చేసి, యింజక్షన్‌ యిచ్చి గంభీరంగా అన్నయ్యలతో అంటున్నారు - ‘సెరిబ్రల్‌ అటాక్‌.. కండిషన్‌ బాగాలేదు. హాస్పిటల్‌లో చేర్పించవచ్చు కానీ పెద్ద లాభమేమీ వుండదేమో! పైగా యీ పరిస్థితిలో అటూయిటూ కదిలించటమూ మంచిది కాదు!’ అని. ఫీజ్‌ యివ్వబోతే తీసుకోలేదు. మంచి మనిషి! మమ్మల్ని చూసి ‘అనవసరంగా ఖర్చుపెట్టటం - నాకు యిబ్బంది’ అని గ్రహించారు!