‘‘నాకు ఉద్యోగం వచ్చింది’’ చెప్పింది సునీత.‘‘నాకూ ఉద్యోగం వచ్చింది. కాని ఇక్కడ కాదు, హైదరాబాద్‌లో’’ సంతోషంగా చెప్పాడు సుధీర్‌.‘‘ఏం ఉద్యోగం అని అడగవేం?’’ అని చేత్తో నెమ్మదిగా సుధీర్‌ చేతిమీద తట్టింది సునీత.‘‘ఓహ్‌, ఏం ఉద్యోగం?’’ సునీత వైపు తిరిగి అడిగాడు సుధీర్‌.‘‘కె.కె. బ్రదర్స్‌ బట్టల షాపులో సేల్స్‌గర్ల్‌ ఉద్యోగం’’.‘‘డిగ్రీ చదివి ఈ ఉద్యోగమా?’’‘‘భలేవాడివే, పీజీలు కూడా వచ్చారు తెలుసా?’’‘‘సర్లే. ఎంతిస్తారు?’’‘‘పది వేలు’’‘‘నాకు ఇరవై వేలు. అయినా సుఖం లేదు. సెలవులు, గిలవులు ఉండవు. ఒకటే తిరుగుడు. సంవత్సరం పనిచేస్తే, ఇక్కడ వైజాగ్‌ బ్రాంచికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు’’.‘‘అంటే మార్కెట్‌ జాబా?’’‘‘అవును. అలాంటిదే’’.‘‘ఎలాగూ వచ్చే సంవత్సరం కదా మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తాం’’ అంతదాకా ఇలా కానిచ్చేద్దాం’’.‘‘నీకేం, నువ్వు ఎలా అయినా సర్దుకుంటావు. నా పరిస్థితే’’.‘‘చాల్లే. నాన్న పోయారు. అమ్మ మంచంపట్టి ఉంది. ఆపరేషన్‌కు మూడు లక్షలు కావాలి. అందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పటికి నేను ఆ డబ్బు సంపాదించి అమ్మని బ్రతికించుకుంటానో’’ కళ్ళ నీళ్ళు తిప్పుకుంది సునీత.‘‘బాధపడకు. తొందర్లో నీ కష్టాలు తీరిపోతాయి. 12 నెలలు గడిచిపోతే నేనూ ఇక్కడికి వచ్చేస్తాను. నా వైపు నుంచి నేనేం చెయ్యాలో అదీ ఆలోచిస్తాను. ఐ లవ్‌ యు సునీత’’ అన్నాడు ఉద్వేగంగా సుధీర్‌. ఆ మాటలకు ఎంతో ఆనందించింది సునీత.‘‘మంచి మాటలు చెప్పావు సుధీర్‌. ఐ లవ్‌ యు’’ అని అతడికి దగ్గరగా వెళ్లింది సునీత.  సుధీర్‌ ఆమెను ప్రేమగా హగ్‌ చేసుకున్నాడు. ఆ మరుసటిరోజే సుధీర్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. సునీత వైజాగ్‌లో కె.కె.బ్రదర్స్‌ షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది.

సునీతకు మనసంతా తల్లి గురించి ఆలోచనలే. ఆపరేషన్‌ చెయ్యకపోతే తల్లి బ్రతకదని డాక్టర్లు చెప్పారు. డబ్బు కావాలి. రోజురోజుకీ తల్లి రోగం ముదిరిపోతోంది. డబ్బు కావాలి! ఏం చెయ్యాలి? ఎలా సంపాదించాలి? ప్రతిరోజు సుధీర్‌తో ఫోన్లో మాట్లాడుతోంది. కాని సుధీర్‌ మాత్రం ఏం చెయ్యగలడు? ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. ఈ సమయంలో సునీతకు షాపులో తనతోబాటు పనిచేసే లక్ష్మి పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులయ్యాక తన బాధలు ఆమెకు చెప్పింది.