ఏం..! రాఘవరెడ్డి మామా! ఈ సారన్నా మనూర్లో దేవర జేద్దాం. మూడేండ్లాయ జెయ్యక. ఆ గంగమ్మ తల్లి కండ్లెర్ర జేచ్చే మనం తట్టుకోలేం. నువ్వేమన్నా అనుకో ఈసారి దేవర జేసి తీరాల్సిందే’’ హనుమంతు ఉత్సాహం బట్టలేక ఊరిపెద్ద రాఘవరెడ్డికి విన్నవించుకున్నాడు.‘‘నిజమే హనుమంతూ! దేవరజెయ్యక మూడేండ్లయ్యింది. ఆ సంగతి నాకూ తెలుసు. కాని ఏంజేచ్చాం. పాతరోజులు పయనమై పోయినాయి. ఒకర్లో ఒకరు లేరు. పిల్లనాయాల్లంతా పెద్దోల్లయి మాట వినకుండా వుండారు. అందులోనూ దేవరంటే సారాయితో పని. సారాయి తాగితే నా కొడుకులు మాటకు మాట రెట్టించుకోని కలబడనైనా కలబడతారు. అందుకే ఆ సంగతి నేను పట్టిచ్చుకోడంలా’’ అంటూ రాఘవరెడ్డి మనసులో మాట జెప్పినాడు.హనుమంతుకు ఇంకా ఇద్దురుముగ్గురు తోడు పలికినారు. వీరారెడ్డి, రామచంద్రుడు, వెంగలరెడ్డి లకు దేవరజెయ్యాలని బలే సంతోసం. ఎట్టాగైనా రాఘవరెడ్డిని ఒప్పించాలని పట్టుదల.‘‘పిల్లోల్ల సంగతి మాకొదిలెయ్యి మామా. నువ్వుగానిచ్చేది నువ్వుగాని. వాళ్ళను ఎట్టా గదమాయించాలో మేం జూసుకుంటాం’’ అంటూ ముగ్గురూ గొంతు కలిపినారు.

‘‘మీరందరూ అవునన్నాక నేను గాదంటే ఏం బాగుంటుంది హనుమంతూ. కానియ్యండి. రేపు దండువారు పుల్లిగాడ్ని పిలిపిచ్చి ఊరంతా చాటింపు జెయ్యమను. ఇంటికొక మనిషి రాముల్దేలం కాడికి రమ్మనండి. మనకుండే భూముల్ను బట్టి, మడవ పారకాన్ని బట్టి ఎకరాకింత చందాలేద్దాం’’ అంటూ జెప్పాలకే వీరాడ్డి, రామచంద్రుడు, వెంగలరెడ్డి, హనుమంతులు మనసులోనే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.రాత్రికే దండువారు పుల్లిగాడు వూరంతా చాటింపు వేసినాడు. శనివారం రాత్రికి అందరూ రాముల్దేలం కాడికి రమ్మని జెప్పినాడు.దేవర జేస్తున్నారనే మాట తెలియగానే అందరిలో నవ్వు మొహాలు. ఖర్చు దేవుడెరుగు ముందు చేసే మొగోడే కరువైనాడు అనుకుంటూ ముసిలోల్లు గొణుక్కున్నారు.ఇంటికొక మనిషి వచ్చి రాములోరి గుడికాడ ఆలకూడినారు. ‘‘ఏమర్రా! చెప్పండి. ఈసారి దేవర జెయ్యాలనుకున్నాం. మరి మీ సంగతేందో జెప్పం డి’’ అంటూ అందరి మొఖాలూ జూసి అన్నాడు రాఘవరెడ్డి.ఒకరికొకరు అందరూ మొకాలు జూసుకోని ‘‘నువ్వెట్ట జెబుతే మేమూ అట్నే. మల్లా మాదొక మాటా’’ అంటూ అందరూ అన్నారు.