‘‘అమ్మా.. అమ్మా...’’ అంటూ సుడిగాలిలా వంటింట్లోకి వచ్చింది మాధురి.‘‘అమ్మా! చూడవే. మమత గొడవ చేస్తోంది. నన్ను తయారు కానివ్వడం లేదు’’ బుంగమూతి పెట్టి నిలుచున్న కూతుర్ని చూడగానే పార్వతి కళ్లలో అనురాగం ఉప్పొంగింది. అందంగా అలంకరించుకున్న మధుని చూడగానే ఆవిడలో ఆపేక్ష ఉప్పొంగింది. తన దిష్టే కూతురికి తగులుతుందని భయపడి చూపులు మరల్చుకుని. ‘‘ఏమిట్రా మధు నువ్వు, మమత పెద్దవుతున్నకొద్దీ చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. ఇవాళ్టితో నీకు పంతొమ్మిది నిండుతుంది, గుర్తుందా?’’ అంది మందలింపుగా. తెచ్చిపెట్టుకున్న కోపంతో.‘‘అమ్మా చూడూ, హాయి గా రెండు అల్లులు అల్లుకుని క్లిప్‌ పెట్టుకోమంటే, జడకుప్పెలు వేసుకుంటానంటోంది, ఏం బాగుం టుంది?’ అక్క వెనకాలే వచ్చిన మమత నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ అంది.‘‘నా పుట్టిన రోజు నా ఇష్టం. సరేనా’’ అంటూ మళ్లీ తన గదిలోకి వెళ్లింది, మధు ఉడుక్కుంటూ. అక్క వెనకాలే మమత పరుగెత్తింది. ‘‘సరేలే నీ ఇష్టమే, ఓకే!’’ అంటూ.‘‘భలేపిల్లలు!క్షణంలో అనుకుంటారు, మళ్లీ క్షణంలో కలుస్తారు’’ అని నవ్వుకుంటూ పనిలో పడింది పార్వతి.చిలకాకుపచ్చ పట్టులంగా, ఎర్రటి అంచుతో వున్నది సర దా పడి కొనుక్కుంది మాధురి.

 ఎర్రటి జాకెట్టు, ఎర్రటి ఓణీ వేసుకుని చెవులకు ఎర్రరాళ్ల బుట్టలు, చేతినిండా గాజులు, తలకు పాపిడి పిందే, కాళ్లకు అందంగా మెరుస్తున్న వెండి పట్టీలతో దేవకన్యలా వుంది.జడకుప్పెలు ముందుకు వేసుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని వయ్యారంగా నిలబడి, ‘‘ ఇపడెలా వున్నారు?’ అంటూ ఫోజు పెట్టింది చెల్లి ముందు.మమత వెక్కిరింపుగా ఏదో అనేంతలో, ‘‘మామయ్య వచ్చాడే’’ అన్న పార్వతి కేక విని ఇద్దరూ పరుగున హాలులోకి వచ్చారు.‘‘మామయ్యా...’’ అంటూ ఇద్దరు శ్రీనివాసరావు పక్కన చేరారు. పార్వతి ఇచ్చిన మంచినీళ్లు తాగి గ్లాసు కిందపెడుతూ, ఇద్దరు మేనకోడళ్లను దగ్గరికి తీసుకుని పలకరించాడు.‘‘మామయ్యా! ఎలా వున్నాను?’ అంది మధు ఆయన ఎదురుగా నిలబడి.‘‘నీకేమమ్మా! మహాలకి్క్షలా వున్నావు’’ అన్నాడాయన ఆప్యాయంగా మధుకేసి చూస్తూ.‘‘అమ్మా! అక్షింతలు కలపవే, త్వరగా! గబగబా దణ్ణం పెట్టి మామయ్య సంచిలో వున్న గిఫ్ట్‌ ఇచ్చేస్తే, అక్క హడావిడి తగ్గుతుంది’’ పరిహాసంగా నవ్వింది మమత.‘‘చూడు మామయ్యా!’’ గారాలు పోయింది మధు.‘‘కాస్త మా అన్నయ్యను ఊపిరి పీల్చుకోనివ్వండి, ముందు మీరిద్దరూ’’ అంటూ కసిరింది పార్వతి.శ్రీనివాసరావుగారు నవ్వుకుంటూ, బాగ్‌లోంచి చిన్నబాక్సు తీసి మధు చేతిలో వుంచాడు.‘‘థాంక్స్‌ మామయ్యా!’’ అంటూ బాక్సు తెరిచిన మధుకు అంద మైన డిజైన్‌తో వున్న నెక్లెస్‌ చూసి ఆశ్చర్యపోయింది.పార్వతి కూడా ఆశ్చర్యపోయి ‘‘అదేమిట్రా అన్నయ్యా. మధు అంటే నీకెంత ఆపేక్షో నాకు తెలియంది కాదు, అది పుట్టినప్పటినుంచి పుట్టిన రోజున ఇవాళ్టి వరకు ఒకసారన్నా వచ్చి దాన్ని దీవించకుండా, చేతిలో ఏదీ పెట్టకుండా, ఎన్నడూ వెళ్లలేదు. కాని ఇదేమిటి, ఇంత ఖరీదైనది ఎందుకు?’’ చిరుకోపంగా అడిగింది.