తాపీగా రెండో కప్పు కాఫీ తాగి, పేపర్లో మునిగిపోయాడు జేకేఆర్‌.‘‘మళ్లీ పేపర్లో తల దూర్చారా? సరుకుల లిస్టు రాయమన్నాను గదా’’ కోప్పడింది భారతి.‘‘రోట్లో తల పెట్టొద్దంటారు గానీ పేపరు విషయంలో అలాంటి రూలేమీలేదే’’ ఏ అంశాన్నైనా సరదాగా తీసుకునే జేకేఆర్‌, భార్య సహనాన్ని మరింతగా దెబ్బతీశాడు.ఆమె ఉరిమి చూసేసరికి కలం, కాగితం చేతు ల్లోకి తీసుకుని ‘‘ఇక చెప్పవోయ్‌’’ అన్నాడు.‘‘ముందు ఓం రాయండి’’ అందామె.‘‘ఓమా! అలాంటి వస్తువేదీ సూపర్‌ మార్కెట్లో దొరకదే?’’ సీరియస్‌గా అన్నాడు జేకేఆర్‌.‘‘జోకార్లేగానీ, చెప్పింది చెయ్యండి’’ ఆయన వెటకారానికి ఉప్పు దట్టించటం ఆమెకు అలవాటే.ఆయన ‘ఓం’కారం చుట్టి, ‘‘తర్వాత..’’ అన్నాడు.‘‘పసుపు, కుంకుమ రాయండి’’.‘‘అవి మనింట్లో రెండు డబ్బాలనిండా ఉన్నాయ్‌ కదోయ్‌!’’‘‘అబ్బా, శుభకార్యానికి ఓం ప్రథమం పసుపు కుంకుమలు రాయడం సంప్రదాయం’’ విసు క్కుందామె.‘‘ఓహో... అలాగా...’’‘‘ఏమిటీ, అలాగా అని దీర్ఘాలు తీస్తున్నారు’’ అంటూ అప్పుడే లోపలికొచ్చాడు మాధవయ్య. ఆయన అదే అపార్టుమెంటులో పై అంతస్తులో ఉంటాడు.‘‘రండి రండి. మీ చెల్లెమ్మ డిక్టేషన్‌ ఇస్తోం దిలే’’ అన్నాడు జేకేఆర్‌ నవ్వుతూ.

‘‘రండన్నయ్యా, తెల్లవారితే కావ్య ఎంగేజ్‌ మెంటు. ఈయనకి చీమ కుట్టినట్లయినా లేదు. పూజాసామగ్రి, చిల్లరసరుకులు తెమ్మని నిన్నటి నుంచీ పోరుతుంటే, ఇదుగో ఇప్పటికి తీరింది ఈయనకి’’ భారతి ఫిర్యాదు.వారం క్రితం హైదరాబాదులోని బీహెచ్‌ ఈల్‌ దగ్గర్లో ఉంటున్న జేకేఆర్‌ ఇంటిని వెతు క్కుంటూ ఓ కుర్రాడొచ్చాడు. డైరెక్టుగా విషయం లోకి వచ్చాడు. తనలాగే సరదాగా మాట్లాడు తున్న ఆ కుర్రాడితో పది నిమిషాల్లో స్నేహం కుది రింది జేకేఆర్‌కు. భారతికి కూడా అర్జంటుగా నచ్చేశాడు.బయటికెళ్లిన కావ్య అప్పుడే ఇంటికొచ్చింది. పెళ్లిచూపులు అనే తంతు లేకుండా అమ్మాయి, అబ్బాయి మనసులు విప్పుకున్నారు. ఒకరికొకరు నచ్చారు.మరుసటిరోజే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. అన్నీ మాట్లాడుకున్నారు. పెళ్లికి పచ్చ జెండా ఊపారు.‘‘చిత్రంగా ఉంది వదినగారూ. పెళ్ళికోసమని మావాడు నెల రోజులు సెలవుపెట్టి అమెరికా నుంచి వచ్చాడు. మూడు సంబంధాలు చూసి ఉంచాం. వాడికి ఒక్కటీ నచ్చలేదు. పది రోజుల్లో వెళ్లిపోతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఈ సంబంధం’’ సంబరంగా అంది కుర్రాడి తల్లి.