తనేమిటిలా అతడిని పూలతలా పెనవేసుకుంటోంది. జ్వరం వచ్చినట్టు వళ్లంతా వేడెక్కుతోంది. సన్నటి వణకు.. గుండెలు ఎగసి పడుతున్నాయి. అతని బలమైన బాహువుల మధ్య తను నలిగిపోతోంది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వద్దు వద్దు అనుకుంటూనే అతడిని తను మరింత గట్టిగా హత్తుకుంది. ఇది తప్పు.. పెళ్లికాని తను ఇలా చేయకూడదని మనసు హెచ్చరిస్తున్నా శరీరం వినడం లేదు. అధరాలు కలుసుకున్నాయి. ఏవో మధురాలు తనలోకి ఇంకుతున్నాయి. తననలాగే ఎత్తుకుని అతను బెడ్‌మీదకు చేర్చాడు. తనపై ఒరుగుతున్నాడు. వద్దని.. కావాలని.. వద్దని..కావాలని... మనసు శరీరం.. ద్వైదీభావం.. కావాలనే కోరికే నెగ్గింది..‘‘హలో గుడ్మాణింగ్‌.. శుభోదయం.. లేమ్మా తల్లీ.. లేవరా కన్నా..’’సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసిన ఆ స్వరం అలారంగా మోగి మధురను కలలోంచి మెలకువలోకి తీసుకొచ్చింది..చటుక్కున లేచి మోగుతున్న సెల్‌ వైపు చూసింది మధుర. గది నిండా పరచుకున్న చీకటిలో సెల్‌ కాంతి పల్చగా ఆమె మొహం వరకూ వెలుగునిచ్చింది.చిన్నగా తనలో తాను నవ్వుకుని మంచం దిగింది మధుర.ఎప్పుడూ లేనిది.. ఈ ఉదయం ఎందుకో ఏవో ఆశలు మనసులో దోబూచులాడుతున్నట్టు... అవే పెదవులపై నవ్వులయినట్టు అనిపించిందామెకా క్షణంలో.గబగబా ముఖం కడుక్కుని ట్రాక్‌సూట్‌ తీసి వేసుకుంది మధుర. ఫుల్‌ స్లీవ్స్‌తో, ఒంటికి అతుక్కున్నట్టున్న ఆ సూట్‌... ఎవరో దగ్గరగా హత్తుకున్నంత వెచ్చదనాన్నిచ్చింది ఆమెకి.

 భుజాలు దాటని జుట్టుని బ్యాండ్‌ పెట్టి పోనీగా కట్టేసినా, ఇంకా ముంగురులు ముఖాన్ని ముద్దాడాలన్నట్టు ముందుముందుకు పడుతూ ఉంటే.. ఎందుకో మరోసారి చిరునవ్వొకటి విరిసింది మధుర అధరాలపై. నుదిటి పైన హెడ్‌బ్యాండ్‌ పెట్టి వాటిని కొంతలో కొంత అదుపు చేసింది. పెదవులకు పల్చగా లిప్‌బామ్‌ రాసుకుని, కాళ్లకు షూ లేసులు కట్టుకుని తలుపు తీసేసరికి చలిగాలి రివ్వున మొహాన్ని తాకింది. బైటికొచ్చి హ్యాండిల్‌ వదిలేస్తే, డోర్‌ దానంతటదే లాకయిపోయింది తన వెనగ్గా.రోజూ కన్నా ఇవ్వాళ ఎలాగైనా మరో రెండు కిలోమీటర్లు ఎక్కువ పరుగెత్తాలి.. ఇంకో నెలరోజులకల్లా బరువు మూడు కిలోలు తగ్గితే.. తను సరిగ్గా యాభై కిలోలు. ప్రపంచ అందగత్తెల కొలతల్లో ఓ వైజాగమ్మాయి! అందాల పోటీల్లో పాల్గొనకపోయినా విశ్వసుందరి కిరీటం సొంతమయినంత ఆనందంగా అనిపించిందా ఊహ మధురకి. అది ఇచ్చిన ఆనందంతో యూ ఆరే బ్యూటిఫుల్‌ గాళ్‌... రెడీ.. స్టార్ట్‌.. అని తనన్తానే ఉత్సాహపరుచుకుని పరుగు మొదలెట్టింది.మార్గశిర మాసం... రాత్రి వెలిగిన పున్నమి చంద్రుడు అప్పటికింకా వెలిసిపోలేదు.. పైగా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అన్నట్టు వన్నెలతో ప్రకాశిస్తున్నాడు. ధనుర్మాసం ముగ్గుల్లో మిస్సయిన తళుకుల చుక్కలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. చలి పులితో పోటీ పడుతూ చిరుత పులిలా పరుగెడుతున్న మధురను చూసి సముద్రపు కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. షూటింగ్‌లో అందమైన కొత్త హీరోయిన్ని చూసి వెర్రెక్కి ఈలలేస్తున్న కుర్రకారులా ఒకదాన్నొకటి తోసుకుంటూ విరగబడుతున్నాయి. ఇరవైరెండేళ్ల వయసు తెచ్చిన అందంతో.. విరబూసిన ముద్దబంతి పూల చెట్టులా ఉన్న ఆ అమ్మాయిని చూడ్డానికే తలలు వంచి వెలుగుతున్నట్టున్నాయి స్ట్రీట్‌ లైట్లు. ఆర్కే బీచ్‌ దగ్గరే కాలనీలో ఇల్లు కనుక మధుర రోజూ ఆ రోడ్డమ్మటే పేవ్‌మెంట్‌ మీద దాదాపు ఎంవీపీ కాలనీ సర్కిల్‌ దాకా జాగింగ్‌ చేస్తుంది. ఇవాళ మరికొంత దూరం.. కైలాసగిరి రోడ్డు దాకా వెళ్లాలని ఆమె ఆలోచన.