మిట్టమధ్యాహ్నం. వేసవి కాలపు ఎండ నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉంది. ఆ భవంతి పూర్తిగా రాతితో కట్టబడినది కావడంతో లోపల ఎండ వేడిమి అంతగా తెలియడం లేదు. పెంకుల వసారాకి ఆనుకొని ఉన్న గది తలుపు పక్కనే ‘కల్నల్‌ కోలిన్‌ మెకంజీ’ అని చెక్కబల్లపై పొదగబడిన ఇత్తడి అక్షరాలు మెరుస్తున్నాయి. గది గుమ్మంలో బెంచీ మీద కూర్చున్న బంట్రోతు చెమటలు తుడుచుకుంటూ లోపల గదిలో కూర్చున్న తెల్ల దొరకి తగిలేటట్టుగా పంకా లాగుతున్నాడు.

యుక్త వయసులో ఉన్న ముగ్గురు యువకులు గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఆ శబ్దానికి పంకా లాగుతున్న బంట్రోతు వాళ్ళవైపు చూశాడు. వాళ్ళు గది దగ్గరకి వచ్చి దొరగారిని కలుసుకోవాలని చెప్పారు. మీరెవరు, ఏ పనిమీద వచ్చారు? అని అడిగాడు బంట్రోతు. ముగ్గురులోకీ పొట్టిగా ఉన్న యువకుడు ఆ వివరాలన్నీ దొరగారితోనే చెప్తామన్నాడు. బంట్రోతు వాళ్ళ వంక కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు.బంట్రోతు వెళ్ళగానే మిగిలిన ఇద్దరు యువకులు పొట్టిగా ఉన్న యువకునితో ‘‘అలా ఎందుకు చెప్పావురా? దొరగారికి కోపం వస్తే’’ అన్నారు.‘‘వస్తే రానీ, అవసరం ఆయనది, మనది కాదు’’ అన్నాడా యువకుడు.బంట్రోతు బయటకు వచ్చి ‘‘దొరగారు రమ్మంటున్నారు’’ అన్నాడు.లోపలికి అడుగుపెట్టిన ముగ్గురు యువకులకీ పంకా నుంచి వీస్తున్న చల్లటి గాలి స్వాగతం పలికింది. విశాలమైన ఆ హాలు లాంటి గదిలో నూకమానుతో చేయబడిన పెద్ద టేబుల్‌ వెనక రాజసం ఉట్టిపడే ఆసనంపై కూర్చుని ఉన్నారు దొరగారు. మధ్య పాపిడి, కందగడ్డ లాంటి ముఖం, కోటేరేసినట్టున్న పొడవైన నాసిక, ఆజానుబాహువులు- దొరగారి రూపం ఆకర్షణీయంగా ఉంది. ఏవో దస్తావేజులు తిరగేస్తున్న దొరగారు యువకుల రాకను వెంటనే గమనించలేదు. పది నిమిషాలు గడిచినా ఆయన తలెత్తి చూడలేదు. వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు. పొట్టిగా ఉన్న యువకుడు ధైర్యం చేసి గొంతు సవరించుకుంటున్నట్టుగా పొడి దగ్గు దగ్గాడు. దొరగారు తలెత్తి చూశారు.‘‘ఓహ్‌! ఐ యామ్‌ సారీ. ప్లీజ్‌ టేక్‌ యువర్‌ సీట్స్‌’’ అంటూ వాళ్ళని కూర్చోమని సైగ చేశారు.