‘‘అమ్మా....!! శంకరం ఉన్నాడా....?’’ ఇంటి లోపలికి తొంగి చూస్తూ అడిగాడు అనంతయ్య.పక్కింటి సుందరమ్మతో టీవీ సీరియల్స్‌ గురింఇ సీరియస్‌గా చర్చించుకుంటున్న సుశీల... అసహనంగా అనంతయ్య వైపు చూసి..... ‘‘లేకెక్కడికి వెళతారు.....!! అదిగో పెరట్లో కూర్చుని మొక్కలతో ముచ్చట్లాడుతున్నారు’’ హేళనగా అన్నది సుశీల.‘‘అదేంటమ్మా......!! మొక్కలతో ముచ్చట్లేమిటి.......!మరీ విడ్డూగాని....!’’ నవ్వుతూ అన్నాడు అనంతయ్య.‘‘అవునో... కాదో... వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది కదా....!!’’ అన్నది సుశీల.‘‘అదీ నిజమేలే...!’’ అనుకుంటూ పెరటి వైపు నడిచాడు అనంతయ్య.మొక్కల మధ్య కుర్చీలో కూర్చుని వాటివైపు లాలనగా చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్న శంకరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అనంతయ్య.‘‘శంకరం...!! ఏమిటీ వింత ధోరణి....??’’శంకరానికి ఎదురుగా నిలబడి అన్నాడు అనంతయ్య.‘‘కూర్చో అనంతం కుర్చీ చూపిస్తూ అన్నాడు శంకరం. కూర్చున్నాడు అనంతయ్య.ఏదైనా మాట్లాడతాడేమోనని కొన్ని క్షణాలు బిగుసుకు కూర్చున్న అనంతయ్యకి నిరాశే ఎదురైంది తప్ప శంకరం నోరు మెదపలేదు సరికదా....... మొక్కలకు సపర్యలు చేయడంలోనే నిమగ్నమయ్యాడు.‘‘శంకరం.....! ఎందుకీ మౌనం......!! అయినా మనుషుల్ని వదిలేసి యిలా మొక్కలతో సహజీవనం చేయడం ఏమీ బాగాలేదు. సున్నితంగా మందలిస్తూ అన్నాడు అనంతయ్య.‘‘నువ్వనుకున్నట్లు... మనుషులకి పూర్తిగా దూరమై.... కేవలం మొక్కలతో సహజీవనం చేసే మహోన్నత స్థితికి నేనింకా చేరుకోలేదు. ఇంకా.... మనుషుల మధ్య వుంటూ మొక్కలకు చేరువవుతున్నాను....అంతే...!’’నేప్‌కిన్‌తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు శంకరం.

‘‘అసలు...మనుషులకి దూరమవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు...’’ అన్నాడు అనంతయ్య.‘‘జీవితంలో ఏదీ సాధించలేక పోయాను. ఇక జీవన సమరంలో గెలుపు లేదూ అని గ్రహించడానికి యిన్ని సంవత్సరాలు పట్టింది. అనుక్షణం ఆశనిరాశల మధ్య కొట్టు మిట్టాడుతూ బ్రతకడం అంత సులువు కాదు;అందుకే స్వార్థరహితమైన మొక్కలతో స్నేహం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ మొక్కల నుండి నాకు లభించే ఆనందం అనిర్వచనీయమైంది....’’పెరిగిన గెడ్డాన్ని నిమురుకుంటూ అన్నాడు శంకరం.‘‘మొక్కల్ని పెంచే వాళ్ళను చాలామందిని చూశాను కాని.....మరీ యిలా ...... ఆ మొక్కలే సర్వస్వం అని భావించి వాటితో సహజీవనం చేసే వాళ్ళను..... యింత వరకూ చూడలేదు.......నిన్ను తప్ప....!! అన్నాడు అనంతయ్య.‘‘తన చిన్న తనంలో... చెట్టు చేమల కింద ఆడుకున్న మధుర క్షణాలను మరచిపోకుండా తన మనోఫలకంపై పదిలపరచుకుని కమనీయమైన కవితలుగా తీర్చిదిద్దిన తోరుదత్‌, చెట్టును ప్రేమించి, చెట్లే జగతికి సర్వస్వం అని భావించి చెట్ల మీద కవితలు అల్లి.... చెట్టు కవి అని పేరు తెచ్చుకున్న ఇస్మాయిల్‌, చెట్టు కొమ్మను అమ్మతో పోల్చిన కీట్స్‌ కవి, ..... తన కవితా తోరణాలతో చెట్టును అలంకరించిన రాబర్ట్‌ ఫ్రాస్ట్‌, ...... జ్ఞాన సంపదకోసం చెట్టు నీడను ఆశ్రయించిన గౌతమ బుద్ధుడు....., ‘‘బ్రతికి నీడనిచ్చి, చనిపోయి కలపనిచ్చే చెట్టుకంటే మనిషి గొప్పవాడు కాదు,..... చెట్టును ఆదర్శంగా తీసుకుంటే మానవ జన్మ ధన్యమైనట్లే.....!’’ అని హితవు పలికిన వివేకానందుడు, మొక్కలేని ప్రదేశాన్ని మరుభూమితో పోల్చిన షెల్లీ...........’’