ధనశ్రీ కాలనీ సాయం క్లబ్బు.పేకాట జోరుగా సాగిపోతోంది.ఆ క్లబ్బుని ధనలక్ష్మి కాలనీలో మగవాళ్ళు పేకాట వగైరా ఆడి సేద తీరటానికీ, ఆడవాళ్ళు తమకిష్టమైనవి ఆడుకుని ఆనందించటానికీ వీలుగా నెలకొల్పారు. అవటానికి అది సాయం క్లబ్బే కానీ, ఆడవాళ్ళు సాధారణంగా పగలు వచ్చి కబుర్లు చెప్పుకుని, ఆడుకుని వెళ్తుంటారు. మగవాళ్ళు సాయంత్రం వచ్చి అర్ధరాత్రి దాకా ఆడుకుని పోతుంటారు. రాత్రికి అది ఒక పేకాట శిబిరంగా మారుతుంది. పందెం వేలల్లో సాగుతుంది. పోలీసులు గానీ, మరొకరు గానీ అటు రారు. మద్యం నీళ్ళలా ప్రవహిస్తుంది. క్లబ్బు ప్రెసిడెంట్‌ విశ్వమోహన్‌కి డబ్బూ, పలుకుబడీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన తల్చుకుంటే కానిది లేదు.విశ్వమోహన్‌కి ఆడవాళ్ళంటే మహాసానుభూతి. వాళ్ళకోసం ఆయన ఎప్పుడూ తపించి పోతూనే ఉంటాడు. స్త్రీలన్నా, స్త్రీ సంక్షేమం అన్నా ఆయనకి మహాప్రియం. విశ్వమోహన్‌ కొన్నిసార్లు ఆడవాళ్ళతో హోటల్‌ రూమ్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని పుకార్లు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో, కొందరు స్ర్తీలతో వాళ్ళ సంక్షేమం కోసం, ఏకాంతంగా విచారిస్తున్న సమయంలో పట్టుకుని, అట్లా చిత్రీకరిస్తున్నారని కొందరు అంటారు.ఆడవాళ్ళకి రిక్రియేషన్‌ ఉండాలని పాపం ఆయనే మగవాళ్ళ క్లబ్బులో ఆడవాళ్ళని కూడా కలుపుకుని, అందరి క్లబ్బుగా మార్చాడు పాపం.ఇంకా అభివృద్ధి చెయ్యాలని, ఇంకో విశాలమైన గదిని కూడా కడు తున్నారు. దానికోసం ఒక కంట్రాక్టర్‌ని కూడా కుదుర్చుకున్నారు.కాంట్రాక్టర్‌తో విశ్వమోహన్‌ గీసి గీసి బేరమాడాడు. కాంట్రాక్ట్‌లో చూపించిన దానికన్నా తక్కువ ఇస్తానన్నాడు. ఆ తేడా డబ్బల్ని ఆయన నొక్కేయాలి మరి.ఖర్చులు పోను కంట్రాక్టర్‌కి మిగిలేది చాలా తక్కువ. 

సిమెంట్‌, స్టీలు, ఇసుక ఫిక్స్‌డ్‌ ధరలు కాబట్టి అందులో తగ్గించుకునే వీలు లేదు. ఇక మిగిలేదల్లా లేబర్‌లోనే. లేబర్‌నే చవగ్గా తేవాలి. అందుకని కంట్రాక్టర్‌ అందులోనే తగ్గించుకునే మార్గం చూసుకున్నాడు. ఒక లేబర్‌ కంట్రాక్టర్‌ని పట్టాడు.ఆ లేబర్‌ కంట్రాక్టర్‌ రాష్ట్రం నలుమూలలా తిరిగి, చివరికి ఒకానొక అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో, అతి బీద ప్రపంచంలో మగ్గిపోతున్న కొందరు ప్రాణుల్ని పట్టుకొచ్చాడు. వాళ్ళకు తిండి పెట్టి ఏ కాస్త ముట్ట చెప్పినా, మహాప్రసాదం అనేట్లున్నారు. ఒక వ్యాన్‌ నిండా వాళ్ళను కోళ్ళను కుక్కినట్లు కుక్కి, ఇరికించి హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. వివిధ స్థలాలకి వాళ్ళని తరలించాడు. అందులో ఒక కుటుంబాన్ని క్లబ్బు పనులకి అప్పజెప్పాడు.క్లబ్బు ముందు ఖాళీ స్థలంలో పూల మొక్కలు, క్రోటన్లు ఉంటాయి. మధ్యలో పేము కుర్చీలు వేసి ఉంచుతారు. ఖాళీస్థలమే అయినా కూలీలని వాడుకోనివ్వలేదు. ఆ కుటుంబంలో భార్య పేరు కుంజరి. కుంజరికి పాతికేళ్ళు కూడా ఉండవు. పదేళ్ళ కూతురుంది. ఆ తర్వాత మూడుసార్లు గర్భం వచ్చి పోయిందిట. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదో నెల గర్భం. రెక్కాడితే గానీ డొక్కాడదు కాబట్టి కూతురితో సహా వచ్చింది. భర్త కూడా ఇక్కడే కూలీ పని చేస్తున్నాడు.