‘‘మీకు బి.పి. వచ్చిందండోయ్‌’’ అన్నాడు డాక్టరు నవ్వుతూ. ఆ మాట వినేసరికి నా మనసు అదోలా అయిపోయింది. పట్టుమని నలభై ఏళ్ళయినా లేని నాకు బి.పి. వచ్చిందనే సరికి నా మనస్సును బెంగ ఆవరించింది. యముడు విసిరిన తాడు పీకకు తగులుకుందనీ, ఇక బిగుసు కోవడమే తరువాయి అనిపించింది. డాక్టరు ఆ విషయం నవ్వుతూ చెప్పే సరికి నాకు నషాళానికి తగిలింది... అవును నాకు రోగమొస్తే ఆయనకు పండగే కదా. డాక్టరుకి ఒక కొత్త పేషెంటు దొరకడం, కారు పెట్రోలు బిల్లులో కొంత భాగం ఫ్రీగా రావడంతో సమానం. నెలనెలా చెకప్‌లు, టెస్ట్‌లూఏదో కాస్త తల తిరుగుతూ ఉందంటే జీలకర్ర, ధనియాలు కషాయం ఇవ్వకుండా, నా శ్రీమతి నన్ను బలవంతంగా డాక్టరు దగ్గరికి పంపించింది.‘‘కొన్ని మందులు రాస్తున్నాను. అవి క్రమం తప్పకుండా వేసుకోండి. ముఖ్యంగా ఆహార, విహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజూ వాకింగ్‌ చెయ్యాలి’’‘వాకింగ్‌’ అన్న మాట వినే సరికి నాకు గుండె ఆగినంత పని అయ్యింది. నా జీవితాంతం ‘వాకింగ్‌’ చేసే అవసరం రాకూడదు అన్న ప్రార్థనను భగవింతుడు ఆలకించలేదన్న మాట. నిజానికి అది నా వల్ల కాని పని.డాక్టరు నా మనస్సులోని భావాలు గ్రహించినట్టు ఉన్నాడు. ‘‘చూడండి మీరు తీసుకునే మందులకన్నా మీ మనసును అదుపులో పెట్టుకోవడం, వాకింగ్‌ చెయ్యడం లాంటివి చాలా ముఖ్యం. వీలైనంత వరకూ బండిని దూరంగా ఉంచి నడవడం అలవాటు చేసుకోండి’’ అంటూ మందుల చీటీ నా చేతిలో పెట్టాడు డాక్టరు.

నేను మొహానికి నవ్వు పులుముకుని ‘‘అలాగే డాక్టర్‌’’ అన్నాను. క్లినిక్‌ బయటికి వచ్చి, ప్రక్కనే ఉన్న మందుల షాపులో మందులు కొనుక్కుని ఇంటిదారి పట్టాను.వీధి గుమ్మంలోనే నా శ్రీమతి ఆతృతగా ఎదురు చూస్తూ నుంచింది. ‘‘ఏమండీ డాక్టరుగారు ఏమన్నారు!!??’’ అని ఆదుర్దాగా అడిగింది. ‘‘ఆఁ! ఏదో కొద్దిగా బి.పి. ఉందన్నాడు. మాత్రలు రాసాడు’’‘‘బీపీనా!!? అమ్మో!!?’’ అంది శ్రీమతి అదేదో హర్ట్‌ ఎటాక్‌ అన్నంతగా.కానీ ఆ తరువాత ఆమె చెప్పిన జాగ్రతలూ, నేను ఆచరించవలిసిన ఆహార విహార నియమాలు చెప్పే సరికి నిజంగా నాకు హార్ట్‌ అటాక్‌ వచ్చినంత పని అయ్యింది. నాకు చెడ్డ రోజులు వచ్చాయనేది తేట తెల్లమయిపోయింది. ఆరోజు నుంచి ఇంట్లో చేసే పదార్ధాలు తిని జిహ్వ చచ్చి పోయింది. అన్న హితవు ఆమడంత దూరం’ పారి పోయింది.కానీ అన్నింటి కన్నా పెద్ద సమస్య ‘వాకింగ్‌’ అయి కూర్చుంది. నా శ్రీమతి తెల్లవారు ఝూమున నాలుగు గంటల నుంచీ నాకు సుప్రభాతం పలికే కార్యక్రమంలో నిమగ్నమయిపోవడం మొదలుపెట్టింది. నేను ఆరుగంటలకి అతికష్టం మీద వాకింగ్‌కి బయలుదేరినా అడుగులు తడబడుతున్నాయి. ఇంకాస్సేపు నిద్దురపోతే బాగుండ ననిపిస్తోంది. కానీ ఎక్కువగా శ్రీమతికి, కొంత డాక్టరుకి భయపడి పార్కులో వాకింగ్‌ చెయ్యడం మొదలుపెట్టాను. బలవంతంగా పార్కులో తిరుగుతున్నాను. ఆ పార్కుకి చాలా తక్కువ మంది వచ్చేవారు. అందుకని గొడవ, రఫ లాంటివి లేకుండా ఉండేది.