విశాలమైన బాటకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు... వచ్చే వారికి స్వాగతం చెబుతూ... చల్లని గాలితో సేదతీరుస్తూ. రాలిన ఆకులు గాలికి కదుల్తూ... కోయిల పాటకు మృదువైన తాళం వేస్తున్నట్టుగా ఉంది.బాటకు కాస్త దూరంలో ఉన్న గన్నేరు చెట్టు నుంచి రాలిన పూలను ఒక్కొక్కటిగా ఏరాడతను...ఒక గుప్పెడు పూలను తీసి బండరాతిపై విశ్రాంతిగా కూర్చొని ఉన్న ఆమె ఒడిలో పోశాడు. ఎప్పుడూ చూసే పూలే... అయినా అపురూపమే. ఆమె వాటి రెక్కలను సుతారంగా తాకింది. తెల్లటి ఆమె వేళ్లు వయసు తెచ్చిన మరికొంత తెల్లదనంతో వాటిని కదుపుతుంటే ఆమె చేతులలోని గన్నేరునే చూస్తున్నాడతను.దూరం నుంచి చూసే వారికి ఇద్దరూ మగవాళ్లలానే కనబడతారు. ఇద్దరూ తెల్లటి జుబ్బా, పైజామానే వేసుకుని ఉన్నారు. ఆమె జట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉంది. పొడవుగా ఉంటే తలంటే వారికి కష్టం మరి.గుబురుగా పెరిగిన చెట్లు దూరం నుంచి ఒక ఆర్చ్‌లాగా కనబడుతున్నాయి. అతను ఆ దృశ్యాన్ని కాసేపు అలాగే చూస్తూ నించున్నాడు.‘‘ఊ...పెయింట్స్‌, పేపర్స్‌ తెచ్చుకునుంటే బావుండేదా?’’ అందామె నవ్వుతూ...‘‘అవును...కానీ నేను ప్రస్తుతం ఇంకా అందమైన బొమ్మ ఒకటి గీస్తున్నాను. కాబట్టి నా కాన్వాస్‌ ఖాళీగా లేదు’’ అన్నాడు చేతులూపుతూ..‘‘ఇంత కంటే అందమైన దృశ్యమా..! నాకు చూపనేలేదే?’’ నవ్వుతూ అడిగిందామె.‘‘ఎన్ని సార్లు చూడలేదు నీవు. కానీ అది గుర్తించడానికి నాలా రసహృదయం ఉండాలి.’’‘‘ఒప్పుకున్నాం... సరే ఇంతకూ ఆ సుందర దృశ్యం ఏమిటో?’’‘‘నిన్ను చూపే అద్దం...’’ఒక్కక్షణం ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యాక పెద్దగా నవ్వింది.‘‘నీకెన్ని సార్లు చెప్పాను అద్దాలు పెట్టుకోకుండా చూడొద్దని! బండెడు చత్వారం... అద్దాలు లేకుండా చూసుంటావు.’’‘‘నన్నేమైనా అను. 

నా డార్లింగ్‌ను మాత్రం ఏమీ అనకు.’’‘‘ఓహో! మీ డార్లింగ్‌ చాలా అందగత్తె! స్వీట్‌ సిక్స్‌టీన్‌కి జస్ట్‌ రివర్స్‌... సిక్స్‌టీవన్‌’’ ఉడికిస్తూ అందామె.‘‘నేను నిన్ను చూసిన కొత్తల్లో నైన్టీవన్‌లా ఉండేదానివి. ఊతకర్ర పట్టుకుని... నెమ్మదిగా నడుస్తూ... ఇప్పుడు కరెక్ట్‌గా సిక్స్‌టీవన్‌ లానే ఉన్నావు. కర్ర మానేసి నా చేయి పట్టుకుని నడుస్తున్నావు... ఇంకా కొద్దికాలం పోతే ఇంకా ఎంగ్‌ అవుతావు. నా చెయ్యి పట్టుకుని డ్యాన్స్‌ చేసేంతగా’’ డాన్స్‌ చేస్తున్నట్లు అభినయం చేశాడతను.