‘‘ఒసేయ్‌! ఎర్రోని పెండ్లామా! కర్రిదానా! ‘రేడీ’వోళ్ళు యామన్నా సెప్పినారా’’ అంటూ వేపచెట్టు కింద కూర్చొని, ఆదారి వెంట పోతున్న వెంకటలకి్క్షని అడిగింది సుంకులమ్మ. ఆ మాటలో ‘ఎగతాళి’ లేదు. బతుకు బాధ ఉంది. అలవాటు ప్రకారం పిలిచింది. ఇంకో సమయంలో అయితే వెంకటలకి్క్ష విసురుగా సమాధానం చెప్పేదే. సుంకులమ్మ మానసిక పరిస్థితి తెలుసుకోని ‘‘నాకు తెలీదవ్వా!’’ అంది. వెళ్ళిపోయింది. ఇంక ఎవరొస్తారా అని చూసింది సుంకులమ్మ. నాగలకి్క్ష వచ్చింది.‘‘పిల్లా! బండోని సుట్టమరాలా! ‘టీఈ’వోళ్ళు యామన్నా సెప్పినారా’’ అంది. సుంకులమ్మ వైపు బిరుసుగా చూస్తూ ‘ఈ ముసల్దాని కండ్లబడితే సాలు... సుట్టమరాలా! సుట్టమరాలా! అని కాకిమాద్రి పొడుసుకు తింటుంది’ అని మనసులో అనుకుంది. వెంటనే గుర్తుకువచ్చి - ‘అవ్వకు కలిగిన నొప్పికంటే నన్ను అన్నమాట శానా తక్కువేలే’ అనుకుంది. పలకకుండా నాగలకి్క్ష వెళ్ళిపోయింది.‘యాందో! .. యవర్ని అడిగినా సెప్పరు’ పిచ్చిపట్టిన దానిలా తనలో తాను గొణుగుకుంటూ ఆకాశం వైపు చూసింది సుంకులమ్మ. తనకు కావలసిన మబ్బులు అక్కడ కనిపించకపోవడంతో నేలకేసి చూస్తూ వక్కాకు సంచిలోకి చెయ్యిపెట్టింది. ‘ఆకూ-వక్కా’ దొరకలేదు. పచ్చనోట్లు చిక్కాయి. వాటిని బయటికి తీసింది. తిప్పితిప్పి చూసింది చిత్తు కాయితాల్లాగా.కేశన్న చూసి - ‘‘యంత బయ్యంల్యాకుండా లెక్కపెడతాండావత్తా! ఉద్దరగా వచ్చినాయని తాత్సారమా? నోట్లు గాలికిపోతాయి. తిత్తిలో పెట్టుకో’’ అన్నాడు. కేశన్న మాట వినీ... వొంచిన తల పైకెత్తీ, నోట్ల గొంతును పిడికెట్లో పట్టుకొని ‘‘కేసిగ్యా! నువ్వా! పట్నం పోతాండావా? నువ్వు తిరిగొచ్చేటపడు మల్లెపడొత్తాదో వరద అడిగిరా’’ 

వర్షం కోసం రైతు ఎదురుచూసినంత ఆశ - ఆ గొంతులో ఉంది. గొంతు జీరబోయింది.కేశన్నకు కోపం వచ్చింది. ముక్కుపుటాలు అదిరినాయి. నోట్లో నాలుక మడతపడింది. చూపులకు పదను వచ్చింది. ముందుకేసిన అడుగు వెనక్కి తీస్తూ - ‘‘దరిద్రందానా! శనిముండా! నీకేం పొయ్యేకాలమే! ఏందో! పాపం. ముసిల్దికదాని వరద నీట్లో కొట్టుకుపోయేదాన్ని - బుజం మీద యత్తుకొనిపోయి రచ్చిత్తే మల్లెపడొత్తాది వరద అంటావా? అపశకునందానా! ఇపడొచ్చింది సాల్దా! కొంపాగోడూ, గొడ్డూగోదుమా... గింజాగిట్రా ఏట్లో కొట్టుకొనిపోయి... కూడో రామసెంద్రా అని నెత్తీ నోరూ మొత్తుకొని పాణాల్తో బయటపడితిమి. సెట్టూ పుట్టా పట్టుకొని గడ్డనపడితిమి. ఇపడు నీకు మల్లా వరద రావల్లా! నీకేమే ముందూ ఎనకా ఎవరూ లేరు. నువ్వు సచ్చిన ఏడిస్సేవాళ్ళు లేరూ! బతికినా నగేవోళ్ళు లేరు. మేం పిల్లలు గల్లోళ్లం. తంతాను సూడు ఇంగోసారి అన్నావంటే’’ అంటూ సుంకులమ్మ దగ్గరకు పోయాడు కేశన్న. ఎంత వేగంగా పోయాడు అంతే వేగంగా ఆగిపోయాడు. మళ్ళీ వరద రావాలని సుంకులమ్మ ఎందుకు కోరుకుంటుందో తెలుసుకున్నాడు. కోపం పోయింది. కరుణ కురిసింది. ‘అయ్యో! పాపం’ అన్నాడు.