‘‘బయట చలిగా ఉంది. తొందరగా వచ్చేయండి’’ ఆశ్రమం మేనేజర్‌ హెచ్చరించాడు.‘‘చలి నన్నేం చేస్తుంది? స్వెట్టర్‌ వేసుకున్నాను. నెత్తిన టోపీ వుంది? కాళ్ళకి సాక్స్‌, బూట్లు’’ అని నవ్వాడు రవీంద్రనాథ్‌.‘‘ఎన్ని వేసుకున్నా మీది ముసలి శరీరం. ఆరోగ్యం అంతంతమాత్రం. అది గుర్తుంచుకోండి’’ అన్నాడు మేనేజర్‌.‘‘ఆరోగ్యం కోసమేగదా ఈ వాకింగ్‌?’’ అంటూ బయల్దేరాడు రవీంద్రనాథ్‌.ఆశ్రమం పక్కనే పెద్ద చెరువు. దాని గట్టుమీద నడుస్తూ సంధ్యాసమయం గడపడం రవీంద్రనాథ్‌కి ఎంతో ఇష్టం. సూర్యుడు అస్తమించాక పశ్చిమాకాశంలో రంగు రంగుల మబ్బులు వింత ఆకారాల్లో కనువిందు చేస్తాయి. దూరంగా కొండలు ఏనుగుల మందల్లా భ్రమ గొల్పుతాయి. తోటల మీదుగా, చెరువు నీళ్ళని తాకుతూ అలలు సృష్టిస్తూ శరీరానికి తగిలే గాలి హాయిగా వుంటుంది.రోజూ సాయంకాలం గంట వరకూ ఆ వాతావరణాన్ని ప్రకృతి సౌందర్యాన్నీ అనుభవిస్తూ చెరువు గట్టున వున్న సిమెంట్‌ బెంచీమీద సేదతీరి, తర్వాత నెమ్మదిగా ఆశ్రమానికి చేరుకుంటాడు. అది రవీంద్రనాథ్‌ నిత్యకృత్యం.ఆకాశంలో రంగులు మాయమవుతున్నాయి. మబ్బులు నల్లబడుతున్నాయి. చీకటి తరుముకొస్తోంది. వాతావరణం చల్లబడుతోంది.రవీంద్రనాథ్‌ బెంచీమీద నుంచి లేవబోయాడు. ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ కనిపించలేదు. 

తను భ్రమ పడుతున్నాడా? నిర్మానుష్యమైన నిశ్శబ్ద వాతావరణంలో ఏడుపు శబ్దం ఎక్కడిది? ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తనని ఎవరూ గమనించరనే ధైర్యంతో తనివితీరా దుఃఖిస్తున్నారు ఎవరో?అతను కళ్ళజోడు చేతిలోకి తీసుకుని షర్ట్‌తో తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు.ఎవరో పాపం? ఎందుకు ఏడుస్తున్నారో? ఏం కష్టం వచ్చిందో? అనుకుంటూ లేచి నిల్చున్నాడు.చెరువు గట్టున జిల్లేడు పొద దగ్గర్నుంచి ఏడుపు వినిపిస్తోంది. జిల్లేడు కొమ్మలు కదుల్తున్నాయి. ఎవరో అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు.అతను చెరువు గట్టు దగ్గరికి అడుగులు వేశాడు. అస్పష్టంగా కనిపించింది ఆకారం.‘‘ఎవరూ?’’ఏడుపు ఆగిపోయింది. గాజుల చప్పుడు వినిపించింది. ముక్కు చీదిన శబ్దం వినిపించింది.‘‘ఎవరూ?’’ రెట్టించాడు రవీంద్రనాథ్‌.ఆ ఆకారం లేచి నిలబడింది. అతను దగ్గరగా వెళ్ళాడు. ఆ ఆకారం ఒక అమ్మాయిది. అస్పష్టంగా కనిపిస్తోంది.‘‘ఎవరమ్మా నువ్వు?’’ అడిగాడు.‘‘ఆశ నా పేరు’’ ఏడుపు దిగమింగుకుని నెమ్మదిగా అన్నది.రవీంద్రనాథ్‌ పకపక నవ్వాడు. ఆయనెందుకు నవ్వుతున్నాడో అర్థం కాక తలెత్తి ఆశ్చర్యంగా చూసింది.‘‘నేనెందుకు నవ్వుతున్నాననుకుంటున్నావు?’’ అడిగాడు.ఆమె తెల్లముఖం వేసింది.‘‘నువ్వు చెప్పలేవు. రా... చెప్తాను’’ అంటూ ఆమె భుజంమీద చెయ్యివేసి నడిపించాడు.సిమెంట్‌ బెంచీమీద కూర్చున్నాడు.‘‘కూర్చో!’’ అన్నాడు.ఆశ అతని పక్కనే ఆశీనురాలైంది. తను ఎంతో కష్టంలో వుండి ఏడుస్తుంటే ఈయనేంటి నవ్వుతున్నాడు? అనుకుంది.‘‘నీ పేరు ఆశ. నీకాపేరు ఎవరు పెట్టారో తెలుసా?’’‘‘తెలుసు. మా తాత’’